🍀 13. కర్మ - ప్రతిఫలాసక్తి - ఫలాసక్తి లేకపోవుటే బంధమోచన మార్గము కాని, అదియే రూపమున నున్నను జీవుని బంధించును. ఫలాసక్తి ధన రూపముగను, గుర్తింపు రూపముగను, కీర్తి గౌరవము రూపమునను, ఆధిక్యత రూపమునను జీవుని యందు పొంగుచుండును. 🍀
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. కర్మయోగము - 25 📚
తెలిసినవారు ఫలాసక్తి లేనివారై, లోక కళ్యాణమును నెరవేర్ప సంకల్పము గలవారై కర్మలను నిర్వర్తించవలెను. ఫలాసక్తి గలవారు పట్టుదలతో, శ్రద్ధతో, దీక్షతో అహర్నిశలు ఫలముల నాశించి నిర్విరామముగ కృషి సల్పుదురు.
25. సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత |
కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్ || 25 ||
ఫలాసక్తి లేనివారు అట్టి పట్టుదల, శ్రద్ధ, దీక్ష, ఏకాగ్రత, ఓర్పు కలిగి యుండరు. ఫలము నందాసక్తి లేదు గనుక పనియందు గూడ ఆసక్తి లేకపోవుట మనస్సు ధర్మము.
వేతనములేని పని మనస్సునకు రుచింపదు. తృణమో, పణమో లభించకుండ పనిచేయవలె నన్నచో నిర్విరామ కృషియుండదు. శ్రద్ధ ఉండదు. దీక్ష, పట్టుదల ఉండదు. ఇది లోక సహజము.
చిన్నపిల్లవాడు భోజనము చేయుటకు ఆశ కలిగింతురు. చదువుకొనుటకు చాక్లెట్లు, బిస్కెట్లువంటి ఆశ కల్పింతురు. ఏ పని చేయవలెనన్నను కూలివానివలె మనస్సు, పారితోషికము నాశించును.
ఈ మనోస్థితి నుండి బుద్ధిలోకములోకి పెరగనిచో వివిధములైన ఆశలు పెనుభూతములై, జీవితమున బంధములు పెరుగుట, జీవుడు వివశుడై దుర్గతి చెందుట జరుగును. చిన్నపిల్లలు ఆశకు లోబడుదురు. చిన్నపిల్లలనగా పరిణతి చెందని వారు.
వారికి ధర్మ స్వరూపము, కర్మ స్వరూపము ఇంకనూ తెలియదు. ముందు శ్లోకములలో తెలిపిన విధముగ, కర్మ, ధర్మ స్వరూపముల నెరిగినవాడు ఏమి చేయవలెను? వాని ననుసరించుటయే బంధమోచన మార్గమని తెలిసి అనుసరించవలెను. అనుసరించినపుడు తమ మనోతత్త్వమే తమకు అడ్డుపడు చుండును.
ఫలముల నాశింపక పనిచేయుట క్రొత్తగా అలవాటు చేసుకొనవలెను. పాత అలవాటు వలన మనసు ఫలితముల నాశించును. అది బలవంతముగ నుండును. క్రొత్త అలవాటునకు అంత బలముండదు. అందుచే ఫలాసక్తి లేక పనులు చేయవలె నన్నచో మనసు నిరసించును. అశ్రద్ధ చూపును. దీక్ష, పట్టుదల ఉండవు. నిర్లక్ష్యభావము, అహంభావము పెరుగును. ఇది ఎప్పటికప్పుడు నిర్మూలించుకొనుచు, పై తెలిపిన సద్గుణములతో ఫలాసక్తిని విడచి పనిచేయుట శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు.
ఫలాసక్తి లేకపోవుటే బంధమోచన మార్గముకాని, అదియే రూపమున నున్నను జీవుని బంధించును. ఫలాసక్తి ధన రూపముగను, గుర్తింపు రూపముగను, కీర్తి గౌరవము రూపమునను, ఆధిక్యత రూపమునను జీవుని యందు పొంగుచుండును.
దాని నెప్పటి కప్పుడు నిర్మూలించుకొనుచు, అత్యంత ఆసక్తి కలవానివలె కర్మల నాచరించవలెనని భగవంతుడు తెలుపుచున్నాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment