కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 116
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 116 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -46 🌻
కాబట్టి, ఉత్తమసాధన ఏమిటి? మనస్సు సంయమనము, బుద్ధి యొక్క సంయమనము. సంయమనము అంటే లేకుండా పోవుట. తన స్వస్థానమునందు తానే లేకుండా పోవుట.
కాబట్టి, ఇట్లా మొదట ఇంద్రియ సంయమనాన్ని తదుపరి ఇంద్రియ జయాన్ని, ఆ తదుపరి మనః సంయమనాన్ని, ఆ తదుపరి మనోజయాన్ని, తదుపరి బుద్ధి సంయమనాన్ని, తదుపరి బుద్ధిపై విజయాన్ని సాధించాలి.
ఈ రకంగా సాధకుడు క్రమమార్గములో, సాంఖ్య విచారణ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, పంచీకరణ యొక్క పరిజ్ఞానాన్ని వినియోగించు కుంటూ, ఆయా అధిష్ఠాన దేవతల అనుగ్రహంతో, ఆయా పంచ శక్తులు, పంచ బ్రహ్మల యొక్క అనుగ్రహంతో, ఈశ్వరానుగ్రహంతో, సద్గురుమూర్తి యొక్క కృపచేత విరమిస్తూ, తాను ఆత్మోపరతిని పొందవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి ఆ ముఖ్యమైనటు వంటి లక్ష్యాన్ని క్రమమైన మార్గంలో యమధర్మరాజు తన శిష్యుడైనటువంటి నచికేతునకు బోధిస్తూ ఉన్నారు.
యమధర్మరాజు పైన చెప్పిన మార్గమున పయనించి పరమాత్మను తెలుసుకొనుటకు నచికేతుని ద్వారా మానవజాతిని ఈ విధముగా మేల్కొలుపు చున్నాడు. లెండు! అజ్ఞానమనెడి నిద్ర నుండి మేల్కొనుడు. ఆత్మసాక్షాత్కారము పొందిన గురువర్యులను ఆశ్రయించి, వారి ఉపదేశములను పొంది, వారి ఆజ్ఞను అనుసరించి, శ్రద్ధతో నిరంతరము అభ్యాసము చేసి, ఆత్మను ‘అయమస్మి’ అని తెలుసుకొనుడు. ఉపేక్షింపకుడు.
ఈ మార్గము పదును గల కత్తి యొక్క అంచువంటిది. ఈ అంచుమీదుగా పాదమును ఉంచి నడుచుట ఎంత కష్టమో, పరమాత్మను తెలుసుకొను మార్గము కూడా అంత కష్టమైనదని విద్వాంసులు చెప్పుచున్నారు.
కాబట్టి, ఈ బోధాక్రమంలో యమధర్మరాజు ఒక నచికేతునికి చెప్పుచున్నట్లు కనబడుతున్నప్పటికీ, ఆ నచికేతుని రూపమున సమస్తమానవ జాతికి కూడా ఈ బోధను అందిస్తూఉన్నారు. ఎలా? ఓ మానవులారా! లెండు! లేవండీ - అంటే, ఆజ్ఞానవశం అనేటటువంటి, నిద్రావస్థకులోనైనటువంటి మానవులందరినీ కూడా మేల్కొల్పుతూ ఉన్నాడన్నమాట! నిద్ర నుండీ మేల్కొనుడు. ఆత్మ సాక్షాత్కారము పొందినటువంటి గురువర్యులను ఆశ్రయించి, వారి ఉపదేశములను పొంది, ఆజ్ఞను అనుసరించి... ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
సాధారణముగా మనము వ్యవహారమంతా ఎలా చేస్తామంటే? ఈ ఆజ్ఞగురువుగారి ఆజ్ఞను అనుసరించి చేయడమనేటటువంటి నియమానికి కనుక కట్టుబడి ఉన్నట్లయితే, “నేను గురువుగారి దగ్గర వాగ్దానం చేశాను. ఈ ఇంద్రియాలని ఈ రకంగా ఉపయోగించను, అని. ఇదిగో ఈ విషయాలలో ప్రవేశించను అని, ఇదిగో ఈ బలహీనతలను నేను అధిగమిస్తాను“ అని.
ఈ రకమైనటువంటి, ప్రాథమికమైనటువంటి, నియమాన్ని పెట్టుకోవలసినటువంటి అవసరము ఉన్నది. ఆత్మసాక్షాత్కార జ్ఞానము కలిగినటువంటి, ఆత్మనిష్ఠులైనటువంటి మహానుభావులందరూ తప్పక తత్త్వజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని మాత్రమే బోధిస్తూఉంటారు. అంటే, వాళ్ళ దగ్గర సూపర్‌మార్కెట్‌లో దొరికినట్లుగా అన్నీ దొరకవు.
ఏమండీ! మా అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు, ఏం చేయమంటారు? అమ్మా! డాక్టరు గారి దగ్గరకు వెళ్ళండి, అని చెబుతారు. అంతే కాని, ఏవండీ! మీరు ఇలా చేయండి, మీరు అలా చేయండి అని, మీరు అలా చేస్తే బాగుంటుంది, మీరు ఇలా చేస్తే బాగుంటుంది. ఈ రకమైనటువంటి సూపర్ మార్కెట్ వ్యవహారం వుండదు అన్నమాట. అంటే, ఆ మంత్రాలు చేయండి, ఈ యంత్రాలు చేయండి, ఆ యజ్ఞాలు చేయండి, ఈ యాగాలు చేయండి, ఈ తీర్థ యాత్రలు చేయండి.
ఈ రకమైనటువంటి విశేష లక్షణాలని చెప్పారు అన్నమాట. ఎందుకని అంటే, ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించేటటువంటి వారు, మధ్యమగతికి కానీ, అథమగతికి కానీ, కామ్యక కర్మల జోలికి కానీ వాళ్ళు రారన్నమాట! అయితే, సాధకుల యొక్క శిష్యుల యొక్క జీవనశైలిని అతి దగ్గరగా పరిశీలిస్తూ ఉంటారు.
వాళ్ళు ఏ రకంగా వికాసాన్ని పొందుతున్నారు, వాళ్ళు ఏ రకంగా అభివృద్ధిని సాగిస్తున్నారు, ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి అంతర్ముఖత్వాన్ని సాధిస్తున్నారు అనేది దగ్గరగా గమనిస్తారు. గమనిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంటారు. అంతేగానీ, వాళ్ళు ఎవ్వరూ కూడా ఏమీ ఆజ్ఞాపించరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
29 Nov 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment