✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 54 🌻
చతుర్థవల్లిలో నచికేతుడు తనలో తాను ఆత్మోపదేశము గ్రహించిన తరువాత, విన్న తరువాత మరి ఇట్లయితే మానవాళి అంతా కూడా ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలి కదా! ఈ ఆత్మాశ్రయాన్ని పొందాలి కదా! ఈ స్వస్వరూపజ్ఞానాన్ని పొందాలి కదా! ఈ స్వప్రకాశ లక్షణాన్ని తెలుసుకోగలిగి ఉండాలి కదా! కానీ, అట్లు తెలుసుకోజాలకున్నారు కదా! కారణమేమై ఉంటుంది? ప్రతిబంధకము ఏమై ఉంటుంది? అడ్డుగా ఏమి ఉంది? అనేటటువంటి విచారణ చేపట్టాలి.
ఆ విచారణను గ్రహించినటువంటి యమధర్మరాజు నచికేతునికి మరలా ఆత్మోపదేశము నందు స్థిరపరచటానికి దానికి ప్రతిబంధకాల గురించి, అడ్డు వచ్చేటటువంటి ఇంద్రియ వ్యాపార విశేషాల గురించి, వాటిని అధిగమించే ప్రక్రియల గురించి, తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రతి బంధకాలని మానవుడు స్వయముగా, విశేషముగా పరిశోధించి, సద్గురు కృప చేత, ఆత్మ సాక్షాత్కార జ్ఞానమును పొంది, అధిగమించవలసినటువంటి అవసరము ఉన్నది.
నచికేతా! పరమేశ్వరుడు శ్రోత్రాది ఇంద్రియములను, శబ్దాది బాహ్య విషయములను గ్రహించుటకే నిర్మించెను. కావున మానవుడు ఆ ఇంద్రియముల ద్వారా ప్రాకృతకములగు బాహ్య విషయములనే గ్రహింపగలుగుచున్నాడు. కానీ, అంతరాత్మను గ్రహించుట లేదు.
ఇంద్రియములు బహిర్ముఖములై ఉండుట చేత, బాహ్య విషయములనే గ్రహించుట సహజము అయినప్పటికినీ ఉపాయశాలియు, ధైర్యము కలవాడును అగు మానవుడు, ప్రవాహమునకు ఎదురీదునటుల వివేకియగు వాడు గొప్ప ప్రయత్నము చేత, ఇంద్రియ ప్రవృత్తిలను నిరోధించి, వానిని అంతర్ముఖముగా నుండునట్లు చేసి, ప్రత్యగాత్మను చూచుచున్నాడు. దాని వలన జరామరణ రూప సంసారము నుండి విముక్తుడగును.
కాబట్టి, సంసారము యొక్క లక్షణమేమిటంటే, జర మరణం. అంటే ముసలితనము, మరణము. ‘వృద్ధాప్యము, అసక్తత, మరణము’ ఇవన్నీ జీవితములో ప్రతీ ఒక్కరూ పొందేటటువంటి బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య రూపములు అనేటటువంటి, పరిణామ రూపమగు ‘శరీరమే నేను’ అనుకొన్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పక శరీరమందు ఆసక్తి చేత, శరీరమునందు గల బాంధవ్యము చేత, శరీరమునందు గల సాంగత్యము చేత, ‘శరీరమే నేను’ - అనుకునేటటువంటి అజ్ఞానము అవిద్య చేత, అభిమానము చేత, ఆ యా ఇంద్రియ రూప వ్యవహారమంతా కూడా తానేనని భావించి, భ్రమ చేత, భ్రాంతి చేత, అవిద్యామోహము చేత, అజ్ఞాన మూలము చేత ఆ రకమైనటువంటి మనోభ్రాంతికి గురియై, సంసారమునందు పడిపోవుతున్నాడు.
అలా గనక ఎవరైతే విచారణ చేసి, దానిని ముఖ్యమైనటువంటి ఉపమానము ఏమిటంటే ఇక్కడ ‘ప్రవాహమునకు ఎదురీది’ గొప్ప మనోధైర్యము కలిగి యుండి స్వీయ 14.41 ప్రయత్నము చేత, అనేటటువంటి మూడు అంశాలని మనము వివరించుకొనుచున్నాము.
ప్రవాహమునకు ఎదురీదేటటువంటి వాడు తన ప్రాణమును స్వాధీన పరుచుకొన్న వాడై ఉండాలి. నీళ్ళు త్రాగకుండా ఉండాలి. అలలకు ఎదురీద గలిగేటటువంటి సమర్థుడై ఉండాలి.
గొప్ప శారీరక బలము కలిగినవాడై ఉండాలి, గొప్ప మనోబలం కలిగిన వాడై ఉండాలి. ఇంద్రియాలను వాటి యొక్క ధర్మము నుంచి విరమించగలిగినటువంటి సమర్థుడై ఉండాలి. అట్టి ఇంద్రియ జయాన్ని సాధించినటువంటి వాడు మాత్రమే, ప్రవాహానికి ఎదురీద గలుగుతాడు.
అట్లా నీ మనస్సు ‘నీరు పల్లమెరుగు’ అన్నట్లుగా, బాహ్య విషయేంద్రియ వ్యాపారమునందు నిమగ్నమై, దాని యొక్క సుఖదుఃఖములను అనుభవిస్తూ, ఆ యా సుఖదుఃఖముల యొక్క అలలలో కొట్టుకొనిపోతూ, సంసార మూలమైనటువంటి జనన మరణ చక్రములో పరిభ్రమిస్తూ, కర్మచేత బాధించబడుతూ, కర్మఫలాలను అనుభవిస్తూ, మీరు చేస్తున్నటువంటి జీవనాన్ని విచారణ చేసి, ఆత్మ విచారణ ద్వారా, ఆత్మోపదేశము ద్వారా, ఆత్మసాక్షాత్కార జ్ఞానము ద్వారా, ఆ మోహాన్ని ఒదిలించుకోవాలి.
అప్పుడు మాత్రమే నీవు ముక్తుడవైయ్యేటటువంటి అవకాశం ఉన్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
07 Dec 2020
No comments:
Post a Comment