శ్రీ శివ మహా పురాణము - 289
🌹 . శ్రీ శివ మహా పురాణము - 289 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
70. అధ్యాయము - 25
🌻. సతీ వియోగము - 1 🌻
రాముడిట్లు పలికెను -
ఓ దేవీ! పూర్వము ఒకప్పుడు పరమ కారణుడగు శంభుడు విశ్వకర్మను పిలిపించి, అన్నిటికంటె ఊర్ధ్వమునందున్న తనలోకములో (1), తన గోశాలయందు ఆ విశ్వకర్మచేత సుందరమైన పెద్ద భవనమును నిర్మింపజేసెను. దానియందు గొప్ప సింహాసనమును చక్కగా ఏర్పాటు చేసెను (2).
దానియందు మహాదివ్యము, అన్నివేళలా అద్భుతమును గొల్పునది, సర్వోత్తమము అగు ఛత్రమును శంకరుడు విశ్వకర్మచేత నిర్మింపజేసెను (3). ఆయన వెంటనే ఇంద్రాది సమస్త దేవతా గణములను, సిద్ధ, గంధర్వ, నాగ ఉపదేవులనందరినీ పిలిపించెను (4).
సర్వ వేదములను, శాస్త్రములను, బ్రహ్మను, ఆయన పుత్రులను, మునులను పిలిపించెను. దేవతా స్త్రీలందరు అప్సరసలతో గూడి వివిధ వస్తువులను తీసుకొని విచ్చేసిరి (5). దేవతల, ఋషుల, సిద్ధుల, మరియు నాగుల కన్యలను పదహారేసి మందిని మంగళార్థమై రప్పించెను (6).
ఓ మహర్షీ! గొప్ప గాయకులచే పాడించి, వీణామృదంగాది ప్రముఖ వాద్యములను వాయింపజేసి ఉత్సవమును చేయించెను (7). సర్వ ఓషధులు మొదలగు, రాజాభిషేకమునకు అర్హమైన ద్రవ్యములను తెప్పించెను. వివిధ తీర్థములలో ప్రత్యక్షముగా లభించే జలములతో నిండిన అయిదు కుంభములనేర్పాటు జేసెను (8).
మరియు దివ్యములగు ఇతర వస్తువుల నన్నిటినీ తన గణములచే రప్పించెను. శంకరుడు గొప్ప ధ్వని కల్గునట్లు వేదఘోషను ఏర్పాటు చేసెను (9).
ఓ దేవీ! అపుడు మహేశ్వరుడు ప్రీతి చెందిన మనస్సు గలవాడై వైకుంఠము నుండి విష్ణువును పిలిపించెను. విష్ణువు యొక్క పూర్ణ భక్తికి ఆయన చాల ఆనందించెను (10). మహాదేవుడు సుమూహూర్తమునందు ఆ భవనములో శ్రేష్ఠ సింహాసనముపై విష్ణువును ప్రీతితో కూర్చుండ బెట్టి, సర్వత్రా అలంకరింపజేసెను(11).
సుందరమగు కిరీటమును పెట్టి, కౌతుకమనే మాంగళిక కర్మను చేసి, మహేశ్వరుడు స్వయముగా బ్రహ్మాండమండపమునందు అభిషేకించెను (12). ఇతరులకు లభించని స్వీయ ఐశ్వర్యము నంతనూ ఇచ్చెను. తరువాత స్వతంత్రుడు, భక్తవత్సలుడు నగు శంభుడు ఆ విష్ణువును స్తుతించెను (13).
మహేశ్వరుడిట్లు పలికెను -
ఓ సృష్టికర్తా! ఈనాటినుండి నా ఆజ్ఞచే ఈ విష్ణువు నాకు నమస్కరింపదగినవాడు అయినాడు. ఈ మాటను అందరు వినెదరు గాక! (15). వత్సా! విష్ణువు దేవతలందరికీ నమస్కరింపదగినవాడు. నీవీ హరిని నమస్కరించుము. నా ఆజ్ఞచే నా ఈ వేదములు నన్ను వలెనే విష్ణువును కూడ వర్ణించును గాక!(16).
రాముడిట్లు పలికెను -
రుద్రుడు ఇట్లు పలికి స్వయముగా గరుడధ్వజుడగు విష్ణువునకు నమస్కరించెను. భక్తవత్సలుడు, వరదాత అగు శివుని మనస్సు విష్ణువు యొక్క భక్తిచే ప్రసన్నమైనది (17).
అపుడు బ్రహ్మాది దేవతలు, మునులు, సిద్ధులు మొదలగు వారందరు విష్ణువునకు నమస్కరించిరి (18).అపుడు భక్తవత్సలుడగు మహేశ్వరుడు మిక్కిలి ప్రసన్నుడై, దేవతలు ప్రశంసించుచుండగా, విష్ణువునకు గొప్ప వరముల నిచ్చెను (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
07 Dec 2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment