✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 55 🌻
నచికేతుడు తనలో తాను ఇట్లు అనుకొనుచున్నాడు. సూక్ష్మబుద్ధితో, సూక్ష్మాతిసూక్ష్మమైన ఈ ఆత్మను తెలిసికొనవచ్చునని, ఇంతవరకూ యమధర్మరాజు చెప్పియున్నాడు.
ఆయన చెప్పినంత సులభముగా ఆత్మను అందరూ గుర్తించ లేకున్నారు. అట్లు ఆత్మను గుర్తించకుండుటకు ప్రతిబంధ కారణములు ఏవైనా ఉన్నవేమో తెలిసికొని, తొలగించుకొనవచ్చును గదా యని, తలంచు చుండగా అతని సంశయుమును గ్రహించిన యమధర్మరాజు ప్రతిబంధ కారణములను ఈ విధముగా చెప్పుచున్నాడు.
కోహం బంధః, తప్పక ప్రతీ ఒక్కరూ విచారణ చేయవలసినటువంటి ప్రశ్న ఇది. నాకు బంధకారణమేమి? కోహం బంధః? అనే విచారణ చేసినట్లయితే,
పంచభూతముల చేత, ప్రేరేపింపబడుతున్నటువంటి ప్రకృతి చేత ప్రేరితమౌతున్నటువంటి, త్రిగుణాత్మకమైనటువంటి వ్యామోహము చేత, మాలిన్యము చేత, ప్రేరేపింపబడేటటువంటి, మనస్సు అనేటటువంటి, బుద్ధి అనేటటువంటి, అంతర ఇంద్రియాల ద్వారా అంతఃకరణ చతుష్టయాన్ని చక్కగా ఎఱిగి, ఆ అంతఃకరణ చతుష్టయ సాక్షి అయినటువంటి జ్ఞాత నేనని ఎఱిగి,
అట్టి జ్ఞాత స్థానములో తాను స్థిరముగా నిలబడి ఉండి, మిగిలినటువంటి 24 తత్త్వములను తన ఆధారముగనే తాను నడిపించుచున్నాడనేటటువంటి సత్యమును గ్రహించి, అవి తనకి పనిముట్లని గ్రహించి, తాను సహజముగా స్వస్వరూపుడునని, స్వయం ప్రకాశకుడనని, తన ప్రభావం చేత మాత్రమె, మిగిలిన 24 తత్వములు సమర్థవంతములు అగుచున్నవని
పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణములను లెస్సగా పరిశీలించినటువంటి వాడై, ప్రతి ఒక్క విశేషములను స్పష్టముగా ఎఱిగినటువంటి వాడై, సాంఖ్య తారక అమనస్క విధిని ఎఱిగినవాడై, తనను తాను విరమింప చేసుకుని,
తనను తాను తెలుసుకుని, తనను తాను పోగొట్టుకొనేటటువంటి రాజయోగ మార్గములో ప్రయాణము చేయవలసినటువంటి అవసరము ఉన్నది. అలా ఎవరైతే మనస్సును విరమింప చేయగలుగుతున్నారో, వాళ్ళు మాత్రమే ఈ ముక్తి పథంలో నడువగలుగుతున్నారు.
ఎవరైతే బాహ్య వ్యవహారముల నందు మగ్నత చెంది ఉంటారో, బాహ్య వ్యవహారం బలంగా ఉంటుందో, బాహ్య వ్యవహారములయందు, సుఖదుఃఖముల యందు ఆసక్తి కలిగియుంటారో వారందరూ తప్పక మరల జనన మరణ జరామరణ చక్రములో ప్రవేశింపక తప్పదు. సంసార చక్రములో పరిభ్రమింపక తప్పదు. అవిద్యా మోహము చేత బాధింపబడక తప్పదు. మనోభ్రాంతి చేత లాగబడక తప్పదు.
ఇట్లు గ్రహించనటువంటి వారు, వివేచనా శీలియై, వివేకముతో తమను తాము, తనలో ఉన్నటువంటి, యథార్థమైనటువంటి సర్వకాల సర్వ అవస్థలయందు మార్పు చెందనటువంటి, పరిణామ శీలము కానటువంటి, ఆత్మతత్వమును ఎఱిగేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని చేయాలి. ఈ సత్యాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తెరగాలి.
మనస్సు ఇంద్రియములతో కూడినప్పుడే అవి వాని వాని విషయములను గ్రహించగలుగును. లేనిచో ఇంద్రియములు విషయములను గ్రహించుట లేదు. ఆత్మ దర్శనము కావలయునని, మనస్సు అంతర్ముఖము కావలయును.
one cannot serve two masters అన్నట్లు ఒక సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేనట్లు, మనస్సు అంతరముగా ఉన్న ఆత్మను, బాహ్యముగా ఉన్న శబ్దాది విషయములను, ఒకేసారి గ్రహించలేదు. శబ్దాది విషయములనుండి ఇంద్రియములను మరల్చిన గానీ, మనస్సు బాహ్య విషయముల నుండి మరలుటలేదు. ధ్యాన శీలుడైన వ్యక్తి మాత్రమే, ఇంద్రియములను నిగ్రహించి మనస్సును అంతర్ముఖము చేసుకొనగలడు.
అతి ముఖ్యమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ చెబుతున్నారు. ధ్యానశీలుడైన వ్యక్తి మాత్రమే ఇంద్రియముల నుండి గ్రహించి, మనస్సును అంతర్ముఖము చేసికొన గలడు. ఈ రహస్య సూత్రాన్ని మనం మానవ జీవితంలో బాగా ఆశ్రయించ వలసినటువంటి అవసరమున్నది.
ధ్యానము అంటే ఏదో ఒక పది నిమిషాలో, పదిహేను నిమిషాలో, ఐదు నిమిషాలో, మూడు నిమిషాలో, గంటో, అరగంటో చేసేటటువంటి తాత్కాలికమైన ప్రయత్నం కాదు. సహజ ధ్యాన శీలియై ఉండాలి. సమాధినిష్ఠుడై ఉండాలి. - విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
08 Dec 2020
No comments:
Post a Comment