భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 178


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 178 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మార్కండేయ మహర్షి - 4 🌻


26. క్షమవల్ల మహత్తు, వస్తాయి. కానీ క్రోధంవల్ల ఉన్నశక్తులు నశిస్తాయి. ఏముంది? ఒకడికి అపకారం, అపచారం చేస్తాడు. అంతకన్నా చేయగలిగింది ఏముంది? దానివల్ల అది పొందినవాడికి కర్మక్షయం అవుతుంది. పాపక్షయం అవుతుంది. కాని క్రోధంవల్ల తపస్సే క్షయం అవుతుంది. వివేకి ఎప్పుడూ తన తపస్సును వ్యర్థం చేసుకోడు.

27. తనకు అపచారం చేసినవాడినికూడా సిక్షించకుండా వదిలిపెడతాడు. ఎందుచేతనంటే, పాపానికి ఫలం ఎలాగూ ఈ ప్రపంచంలో ఉండనే ఉంది. తనెందుకు తన తపస్సును వ్యర్థంచేసుకోవాలి? పాపంచేసినవాడే ఫలం అనుభవిస్తాడు. వివేకం అంటే ఇదే.

28. “గృహస్థులయొక్క ధర్మములేవి? కొడుకులు తల్లితండ్రుల విషయంలో ఎట్లాంటిభక్తి, ధర్మములు కలిగి ఉండాలి?” అని ధర్మరాజు అడిగాడు. “తల్లిదండ్రులమీద భక్తి, ధర్మార్థములందు ఆసక్తి, ఈ రెండే పుత్రులకు ఉండాలి” అని చెప్పాడు.

29. బ్రహ్మదేవుడు పూర్వం ఏడుగురు ఋషులను సృష్టించాడు. తరువాత తనను అరాధిస్తూ ఉండమని వాళ్ళతో బ్రహ్మదేవుడు చెప్పాడు. మరీచాదులైన ఆ మునులు బ్రహ్మ మాట వినక, అంతఃకరణలో పరమేశ్వరుడిని గురించి తపస్సుచేసారు. ఇది ప్రవృత్తి, నివృత్తుల విషయం. బ్రహ్మ తనను ఆరాధించమనడంలో అర్థం, వారిని ప్రవృత్తిమార్గంలో నిలుపటానికి, కాని వాళ్ళు నివృత్తిమార్గంలో మహేశ్వరుడిని అంతఃకరణలో ఆరాధించారు.

30. అందుకు బ్రహ్మదేవుడికి ఆగ్రహంవచ్చి, “మీ బ్రహ్మవిజ్ఞాన శక్తులు ఏవైతో ఉన్నాయో అవి నశించుగాక!” అని వాళ్ళను శప్తుల్ని చేసాడు. వాళ్ళాల్లో జ్ఞానాన్ని ఆయన హరించాడు. “ఆ తరువాత వాళ్ళు ప్రవృత్తిమార్గంలో వివాహాలూ చేసుకున్నారు. పుత్రులను కన్నారు. స్వర్గస్థులయినారు. అజ్ఞానంరాగానే మృత్యువు ఆవరించింది వాళ్ళను.

31. పృత్యువు – అవిద్య, అజ్ఞానం యొక్క లక్షణం. స్వర్గానికి వెళ్ళి భూలోకంలో తమ కొడుకులు క్రమంతప్పకుండా తమకు శ్రాద్ధాలు పెడుతుంటే చూచి ఆనందించటం వాళ్ళకు అలవాటయింది. చనిపోయిన తరువాత తమకు పుత్రులు శ్రాద్ధాదిక్రియలు విర్వర్తించటంవల్ల వాళ్ళకు ఆనందం. మొత్తం అవిద్య యొక్క లక్షణములే ఇవి! బ్రహ్మశాపమే అదంతా. ఆ శ్రాద్ధానందంలో వాళ్ళు సుఖంగా ఉన్నారు.

32. అసలు వాళ్ళు దేవతలకు తండ్రులు. మొత్తమొదట బ్రహ్మ సంతానంగా పుట్టారు. తరువాత దేవతలు వాళ్ళనుంచే పుట్టారు. అంటే దేవతలకు కూడా వాళ్ళు తంద్రుల లాంటివాళ్ళు. ఆ ఏడుగురిలో అమూర్తులు ముగ్గురు, సమూర్తులు నలుగురు. అంటే రూపంకలిగినవాళ్ళు నలుగురు. రూపం లేనివాళ్ళు ముగ్గురు. వీళ్ళను దేవతలు కూడా గౌరవించటం జరుగుతూ ఉంటుంది ఎప్పుడూనూ.

33. వాళ్ళు అలాగ మూడుయుగాలు ఉంటారు. ఆ తరువాత బ్రహ్మజ్ఞానం కొరకు జన్మిస్తారు. క్రమక్రమంగా వాళ్ళు ఇక్కడ పుట్టినతరువాత, సాంఖ్య మతాల్లో కొంతకలం ఉన్నతరువాత, పునరావృత్తిలేనటువంటి జ్ఞానమార్గంలో యోగసిద్ధి పొందుతారు. అంతేకాక, వాళ్ళు తమ యోగబలంతో – యోగసాధన చేసె భక్తులు, మోక్షమార్గాన్వేషకులు ఎవర్యితే ఉన్నారో, వాళ్ళకు యోగాభివృద్ధినిస్తారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


08 Dec 2020

No comments:

Post a Comment