శ్రీ శివ మహా పురాణము - 290


🌹 .  శ్రీ శివ మహా పురాణము - 290 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

70. అధ్యాయము - 25

🌻. సతీ వియోగము - 2 🌻


మహేశ్వరుడిట్లు పలికెను -

నీవు లోకములన్నింటికీ నా ఆజ్ఞచే కర్తవు. భరించువాడవు, హరించు వాడవు. ధర్మ, అర్థ, కామముల నిచ్చువాడవు, దుర్మార్గులను శిక్షించువాడవు (20). నీవు జగత్తునకు ప్రభువు. నీకు జగత్తునకు పూజ్యుడవు. మహాబల పరాక్రమములు గల నీవు ఎక్కడనైననూ నాకు కూడా జయింప శక్యము కానివాడవు కాగలవు(21).

నేను నీకు ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులను ఇచ్చెదను. నీవు స్వీకరింపుము. ముల్లోకములలో అనేక లీలలను ప్రకటించగలిగే మహిమను, స్వాతంత్ర్యమును స్వీకరింపుము (22).

ఓ హరీ! నిన్ను ద్వేషించువారిని నేను ప్రయత్నపూర్వకముగా దండించుట నిశ్చయము. ఓ విష్ణో! నీ భక్తులకు నేను ఉత్తమమగు మోక్షము నిచ్చెదను (23).

దేవతలు కూడ తపింప శక్యము కాని ఈ మాయనను కూడా స్వీకరించుము. దీనిచే సంమోహితమైన జగత్తు జడాత్మకమగును (24). ఓ హరీ! నీవు నా ఎడమ చేయి. ఈ బ్రహ్మ నా కుడిచేయి. ఈ బ్రహ్మకు కూడా నీవు తండ్రివి. రక్షకుడవు కాగలవు (25).

రుద్రుడు నా హృదయము. నేనే రుద్రుడు. దీనిలో సంశయము లేదు. రుద్రుడు నీకు, మరియు బ్రహ్మాదులకు కూడ పూజ్యుడు. ఇది నిశ్చయము.(26). నీవు ఇచటనే ఉండి జగత్తునంతనూ పాలించుము. మరియు, విశేషించి అనేక అవతారములనెత్తి, ఆ అవతారములలో వివిధ లీలలను ప్రకటించుము (27).

నా లోకములో నీ యీ స్థానము సర్వసమృద్ధమై గోలోకమని ఖ్యాతిని బడసి అద్భుతముగా ప్రకాశించగలదు (28). ఓ హరీ! భూమియందు సాధువులను రక్షించే నీ అవతారములు ఏవి రాగలవో, వారందరు నిశ్చయముగా నా భక్తులుగను, నా వరములచే ప్రీతులుగను ఉండగలరు. నేను వారిని అట్లు చూడగలను (29).

రాముడిట్లు పలికెను -

ఈ విధముగా ఉమాపతియగు శంభుడు విష్ణువునకు స్వయముగా అఖండైశ్వర్యమును సంక్రమింపజేసి, ఆ కైలాస పర్వతమునందు తన గణములతో కూడి యథేచ్ఛగా క్రీడించుచున్నాడు (30). ఆనాటి నుండియు లక్ష్మీపతి గోపవేషమును ధరించి, అచటకు ఆనందముగా వెళ్లి, గోపులకు, గోపికలకు, గోవులకు ప్రభువు ఆయెను (31).

మరియు ఆ విష్ణువు ప్రసన్నమగు మనస్సు గలవాడై శివుని యాజ్ఞచే అనేక అవతారములను ధరించి సర్వ జగత్తును రక్షించెను (32). ఆయన ఇపుడు ఇచట శంకరుని ఆజ్ఞచే నాల్గు రూపములతో అవతరించినాడు. వారిలో నేను రాముడను. భరత లక్ష్మణ శత్రుఘ్నులు మిగిలిన వారు (33).

ఓ సతీ దేవీ! నేను తండ్రి యాజ్ఞచే సీతాలక్ష్ముణులతో గూడి వనమును వచ్చితిని. ఈనాడు దైవవశమున మేము దుఃఖితులమైతిమి(34) ఎవరో ఒక రాక్షసుడు నా భార్యయగు సీతను అపహరించినాడు. నేను అట్టి విరహము గలవాడనై తమ్మునితో గూడి ఈ అడవియందు నా ప్రియురాలిని వెదకుచున్నాను. (35)

నీ దర్శనము లబించినది గాన, నాకు అన్ని విధములా క్షేమము కలుగ గలదు. ఓ సతీ తల్లీ! నీదయచే దీనిలో సందేహమును లేదు(36). నాకు నీనుండి సీత లభించుట అను వరము నిశ్చయముగా ప్రాప్తించును. నీ అనుగ్రహముచే నాకు దుఃఖమును కలుగజేసిన ఆ రాక్షసుని, ఆ పాపాత్ముని వధించెను(37).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


08 Dec 2020

No comments:

Post a Comment