✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 1, 2.
🍀. 1. కర్మ - జ్ఞానము - కర్మత్యాగము, కర్మయోగము రెండును విముక్తి కలిగించ గలవు. రెండిటిలో కర్మయోగమే శ్రేష్ఠము. కర్మల నెవ్వరును త్యాగము చేయలేరు. నిద్రించుట, లేచుట, ఆలోచించుట, భుజించుట, మాటాడుట దేహకి తప్పనిసరి యగు కర్మలు. కర్మత్యాగ మనగా, కర్మఫలత్యాగమే అని తెలియవలెను. అంతియే కాదు, కర్మసంగ త్యాగము కూడ. కర్మల నాచరించుచు, వానిచే తగులకొన బడకుండుట కర్మ యందు కౌశలము. "కర్మ బ్రహ్మాద్భం విద్ధి" - కర్మ బ్రహ్మము నుండి పుట్టుచున్నదని, బ్రహ్మము అక్షర పరబ్రహ్మము నుండి పుట్టినవాడని, కావున సృష్టియందు కర్మ మనివార్యమని, కర్మమును బ్రహ్మవలె నాచరించినచో జీవుడు ముక్తుడుగ నుండునని ముందే తెలుపబడినది. 🍀
1. సన్న్యాసం కర్మణాం కృష్ణ పున ర్యోగం చ శంససి |
యచ్ఛేయ ఏతయో రేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ||
2. సన్న్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా వుభౌ |
తయోస్తు కర్మసన్న్యాసా త్కర్మయోగో విశిష్యతే || 2
శ్రీ కృష్ణా! నీ ప్రబోధమున కర్మయోగము, కర్మత్యాగము రెంటిని పలుకుచున్నావు. ఇంతకును జీవుడు కర్మయోగము నందుండవలెనా, కర్మత్యాగము నందుండవలెనా అని అర్జునుడు ప్రశ్నించినాడు.
అర్జునా! కర్మత్యాగము, కర్మయోగము రెండును విముక్తి కలిగించ గలవు. రెండిటిలో కర్మయోగమే శ్రేష్ఠము.
కర్మల నెవ్వరును త్యాగము చేయలేరు. నిద్రించుట, లేచుట, ఆలోచించుట, భుజించుట, మాటాడుట దేహకి తప్పనిసరి యగు కర్మలు. కర్మత్యాగ మనగా, కర్మఫలత్యాగమే అని తెలియవలెను.
అంతియే కాదు, కర్మసంగ త్యాగము కూడ. కర్మల నాచరించుచు, వానిచే తగులకొనబడకుండుట కర్మ యందు కౌశలము. కర్మలను నిర్వర్తింపకుండుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. నిర్వర్తించునపుడు కర్మ సంగము, కర్మ ఫలము కలుగుచుండును. త్యాగము చేయవలసినది సంగము, ఫలమే గాని కర్మలు కాదు.
ఫలముల నాశించక, కర్తవ్య కర్మలను నిర్వర్తించుచు, నిర్వర్తింపబడు కర్మలనుండి సంగము పొందక నిర్వర్తించుట కర్మయోగమే యగును.
"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన! మా కర్మఫల హేతుర్భూ ర్మా తే సంగో2 స్వకర్మణి |'' (2-47)
అను నాలుగు సూత్రములుగ కర్మలు నిర్వర్తించు పద్ధతి దైవము తెలిపినాడు. (వివరమునకు పై శ్లోక వివరము చూడుడు). అట్లాచరించినవాడు కర్మయోగియే. ఈ మార్గమున కర్మ క్షాళనమై, జీవుడు ముక్తుడగునని తెలుపుచున్నాడు.
పై విధముగ కర్మల నాచరించు కర్మయోగి క్రమముగ, కరృత్వ భావనను కూడ విసర్జించును. తన నుండి కర్మలు జరుగు చున్నవి గాని, తాను చేయుట లేదని తెలియును.
"కర్మ బ్రహ్మాద్భం విద్ధి" - కర్మ బ్రహ్మము నుండి పుట్టుచున్నదని, బ్రహ్మము అక్షర పరబ్రహ్మము నుండి పుట్టినవాడని, కావున సృష్టియందు కర్మమనివార్యమని, కర్మమును బ్రహ్మవలె నాచరించినచో జీవుడు ముక్తుడుగ నుండునని ముందే తెలుపబడినది.
కావున కర్మయోగమున నిష్ణాతుడైనవాడు తననుండి జరుగు కర్మ యంతయు దైవ సంకల్పమని తెలిసియుండును. కర్త తాను కాడు కనుక, కర్మలు చేయుచున్నానను భావన కూడ యుండదు.
కర్తృత్వ భావన లేక చేయుచు నుండును. ఈ స్థితిని కర్మ సన్న్యాస స్థితి అందురు. కర్మయోగికే కర్మ సన్న్యాస స్థితి లభించును. కర్మలు మానుట కర్మ సన్న్యాసము కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
08 Jan 2021
No comments:
Post a Comment