కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 156
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 156 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 86 🌻
అంతా మానవత్వాన్నే కలిగియున్నారు. మానవత్వాన్ని కలిగియున్నవారందరూ మానవులే. కాబట్టి, అలా లక్షణ రీత్య నిర్ణయం చేసేటటువంటి ఎదుగుదలను మానవుడు సాధించాలి. ముఖ్యంగా సాధకులు సాధించాలి.
నీ చుట్టు పక్కల ఉన్నటువంటి నీ సంసారంలో, నీవు గుర్తించేటటువంటి మనుషులు కానీ, నిన్ను గుర్తించే మనుషులు కానీ, ఏవైతే, ఎవరైతే ఉన్నారో, వారంతా ఎవరు? నీ ఇంట్లో ఉన్నవస్తువులు కానీ, నువ్వు ప్రపంచంలో గుర్తుపట్టేటటువంటి వస్తువులు కానీ, ఇదంతా కూడా ‘ఇదం’, ఇదం అంటే నేను కాదని. ‘ఇదం’ - అనేటటువంటిది అంతా కూడా నేను కాదు.
మరి నేను ఎవరిని? ఆ ఇదం కి ఉన్న లక్షణాలకి వ్యతిరేకంగా ఏ సాక్షిత్వము అయితే ఉన్నదో... అంటే అర్థం ఏమిటి? నీవు ఒక వస్తువును చూస్తూఉన్నావు. చూస్తూఉంటే ఆ వస్తువు నువ్వు అవుతావా? ఆ ఘటము నువ్వు అవుతావా? ఓ కుండలో నీళ్ళు పట్టావయ్యా! కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయయ్యా! అది దాని లక్షణం.
కుండనువ్వా? నీళ్ళు నువ్వా? చల్లదనం నువ్వా అంటే, ఈ మూడు నేను కాదు. కారణం ఏమిటి? నేను చూస్తూ ఉన్నాను, నేను అనుభవిస్తూ ఉన్నాను, నేను తెలుసుకుంటూ ఉన్నాను. జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం, అధిగచ్ఛతి. నేను అధిగమించి ఉన్నటువంటి సాక్షిని. సర్వదా సాక్షిని. సర్వ సాక్షిని. కాబట్టి, నాకేమీ అంట లేదు, కుండ అంట లేదు, నీళ్ళు అంట లేదు, చల్లదనము అంట లేదు.
నాకు ఏ సంగత్వము లేదు అనేటటువంటి సాక్షిత్వ స్థితిని సాధించడం చాలా అవసరం. మరి కుండ అవసరం లేదా? మంచి నీళ్ళు అవసరం లేదా? అందులో చల్లటి మంచి నీళ్ళు అవసరం లేదా? అది భౌతిక అవసరం.
ఆత్మ అభౌతికం. ఆత్మ సూక్ష్మం. ఎన్ని అవసరాలున్నప్పటికీ, అవసరాలమేరకు పని చేసేటటువంటి వాడు, అనిత్య వస్తువులయందు రమించకుండా, కలిసిపోకుండా, తాదాత్మ్యత లేకుండా, సంగత్వ దోషం లేకుండా, తాను తానుగా ఉండి, తానైనటటువంటి స్థితిలో నిలిచి ఉండి, బట్టబయలే బ్రహ్మము అనేటటువంటి జన్మరాహిత్య లక్షణానికి ఆశ్రయంగా ఉండేటటువంటి, తత్త్వజ్ఞాన లక్ష్యం దృష్ట్యానే, వ్యావహారిక లక్షణాలను చూస్తాడు. ఈ రకంగా వ్యావహరిక దృష్టి అనేటటువంటిది సామాన్యమైపోయింది.
అప్రధానం అయిపోయింది. అనిత్య వస్తూపలబ్ది చేత ప్రేరేపించబడడం లేదు. పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల అనేక వస్తువుల ఉపలబ్ది జరుగుతూ ఉంటుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
08 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment