🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దుర్వాసమహర్షి-కందళి - 7 🌻
35. విశ్వరూపదర్శనంకూడా కృష్ణుడు అర్జునుడికి లోపల అంతఃకరణలో తెరతీసి చూపించాడే తప్ప, అర్జునుడు సంపాదించుకున్న జ్ఞానం కాదు అది. అతడి మోహాన్ని తొలగించటానికి లోపల తెరతీసి చూపించాడు. అతనికి దృష్టినిచ్చాడు ఒక్కక్షణం. తనే కనబడితే ఊళ్ళో అందరికీ కనబడవలసిందే! ఆ యుద్ధరంగంలో ఎవరికీ కనబడలేదే! ఎవరి హృదయంలో తెరతీసాడో వాళ్ళకే కనబడ్డాడు.
36. కౌరవసభలో పూర్వం, వాళ్ళు ఆయనను బంధించే ప్రయత్నం చేసినప్పుడు, విశ్వరూపదర్శనం ఇచ్చాడు. ఆ గుడ్డివాడైన దృతరాష్ట్రుడికికూడా అది ప్రసాదించాడు. కానీ అతడు జ్ఞానాన్ని అడగలేదు. నువ్వు మహాపురుషుడివి అన్నాడు. కృష్ణుడికి దణ్ణం పెట్టాడే తప్ప, అతడికి పుత్రవ్యామోహంపోలేదు. జ్ఞానార్థికాలేదక్కడ. జ్ఞానార్థి అయితే జ్ఞానం వచ్చేదే.
37. “మీరు నన్నేమీ చెయ్యలేరు. నేను సర్వాంతర్యామిని. విరాట్పురుషుణ్ణి. నన్ను మీరు శిక్షించటమేమిటి?” అని వారి అహంకారాన్ని తగ్గించేందుకు ఇచ్చిందే ఆ దర్శనమంతా! వీళ్ళందరూ మూర్ఛపోయారు. ఎవ్వరూ చూడలేదు. సభఅంతా మూర్ఛపోయింది. బ్రహ్మాండమయిన వెలుగేదో కనబడింది. వాళ్ళు స్పృహతప్పిపడిపోయారు. ధృతరాష్ట్రుడు ఆ తేజస్సును కళ్ళతో-చర్మచక్షువులతో-చూడలేదు కాబట్టి, అతడు మూర్ఛపోలేదు. అతడికి కృష్ణుడు అంతర్దర్శనం అప్పుడే ఇచ్చాడు.
38. నదిలో స్నానంచేస్తుంటే చెత్తకొట్టుకొస్తుంది. ఇలాఅలా తోసేసి మళ్ళీ మునుగుతాం. లేచేసరికి మళ్ళీ చెత్తవస్తుంది. అక్కడి పరిశుద్ధత మనం మునిగి లేచేలోపల అయిపోతుంది. దానికి అంతే పారిశుద్ధ్యం! మళ్ళీ చెత్త కొట్టుకుని వస్తూనే ఉంటుంది. అలాగే ఈ ప్రకృతి అనే మహాప్రవాహంలో ఎప్పుడూ మనం ఉంటాము. జ్ఞానం క్షణికంగా ఉంటుంది.
39. ఎందుకంటే ఉన్నదంతా బ్రహ్మాడమయిన చీకటి. నల్లనిమబ్బు. జ్ఞానం మెరుపులా ఒక్క క్షణంవచ్చి బ్రహ్మాండంగా వెలుగు చూపిస్తుంది. ఎంతసేపుంటుంది? ఏదీ ఉండదు. చూస్తుండగానే అంతర్థానం అయిపోతుంది. అజ్ఞానం అనే ఈ నల్లని మబ్బుల్లో, అంధకారంలో మెరిసేమెరుపులాగా. క్షణంమాత్రమే ఉండిపొతుండి.
40. ప్రపంచంలో, జీవితంలో ఈ సుఖంఅనేది కూడా అంతే! మెరుపులాగా క్షణం కనబడేదే! ఎప్పుడో అలాగ ఒక్కక్షణం మాత్రం మెరిసే మెరుపుని పట్టుకుని శాశ్వతంగా పెట్టుకుందామని ప్రయత్నం చేయడం ఏమి వివేకం? ఎప్పుడూ సుఖంగా బతకాలి అనేమాట కూడా అజ్ఞానంతో కూడినదే. ఏముంది సుఖం? ఎలా ఉంటుంది శాశ్వతంగా! దీనికి సిద్ధపడే ఇక్కడ జీవించాలి కాని, భ్రమలలో కాదు.
41. లేదా, “ఇక్కడికి నేను కర్మక్షయం కోసం వచ్చాను” అనే దృక్పథంతో జీవించడం ఒక మార్గం. అంటే, కష్టపడటానికే వచ్చాను అనే వివేకమన్నమాట. “నేనెంతమందికి బాకీఉన్నానో, సేవచేసి ఆ ఋణం తీర్చుకోవటానికి వచ్చాను” అనే దృక్పథం. ఇలాగ ఉండి, ఈ మాటలు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటే దుఃఖం ఉండదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
08 Jan 2021
No comments:
Post a Comment