శ్రీ శివ మహా పురాణము - 318
🌹 . శ్రీ శివ మహా పురాణము - 318 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
80. అధ్యాయము - 35
🌻. విష్ణువు పలుకులు - 1 🌻
దక్షుడిట్లు పలికెను -
హే దేవదేవా! హరే! విష్ణో !దీనబంధూ! దయాసాగరా! నీవు నన్ను, నాయజ్ఞమును రక్షించవలెను (1). యజ్ఞము నీస్వరూపమే. యజ్ఞమును రక్షించువాడవు నీవే. యజ్ఞమును చేయు యజమాని కూడ నీ స్వరూపమే. నీవు దయను చూపుము. హే ప్రభూ! యజ్ఞము నాశము కాని విధముగా అనుగ్రహించుము (2).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్షుడు ఈ విధముగా అనేక తెరంగులలో సాదరముగా విన్నవించుకుని, భయముచే కల్లోలితమగు మనస్సు గలవాడై ఆయన పాదములపై పడెను (3). అపుడు విష్ణువు చింతాగ్రస్తమైన మనస్సుగల ఆ దక్షుని పైకి లేవదీసి, దుర్బుద్ధియగు ఆతని ఆ పలుకులను విని శివుని స్మరించెను (4). మహేశ్వరుడు, తనకు ప్రభువు అగు శివుని స్మరించి, శివతత్త్వమును ఎరింగిన విష్ణువు దక్షుని సంబోధించి ఇట్లు పలికెను (5).
విష్ణువు ఇట్లు పలికెను -
దక్షుడా! వినుము. నేను యథార్థమగు వచనమును చెప్పెదను. నీకు అన్ని విధములా హితమును చేగూర్చి సుఖము నిచ్చే మహామంత్రమును చెప్పెదను (6). హే దక్షా! తత్త్వము నెరుంగని నీవు సకల జగత్తునకు అధీశ్వరుడు, పరమాత్మయగు శివుని అవమానించితివి (7).
ఈశ్వరుని తిరస్కరించినచో, సర్వకార్యములు అన్ని విధములా విఫలమగును. అంతమాత్రమే గాదు. ప్రతి అడుగు నందు ఆపదలు కలుగును (8). ఎచట పూజింపదగని వారు పూజింపబడుదురో, పూజింపదగిన వారు పూజింపబడరో, అచట దారిద్ర్యము, మరణము, భయము అను మూడు ఉండును (9).
కావున, అన్ని విధముల ప్రయత్నమును చేసి వృషధ్వజుడగు శివుని పూజించవలెను. కాని మహేశ్వరుని అవమానించుట వలన మహాభయము సంప్రాప్తమైనది (10). ఇప్పుడు మేమందరము సమర్ధులమైననూ, కలిసి ఆపదను నివారించుటకు శక్యము కాదు. ఇది అంతయూ నీ చెడునీతి వలన కలిగినది. నేను సత్యమును చెప్పుచున్నాను (11).
బ్రహ్మ ఇట్లు పలికెను -
విష్ణువు యొక్క ఆ మాటను విని దక్షుడు చింతాగ్రస్తుడాయెను. ఆతడు పాలిపోయిన ముఖము గలవాడై నేలపై గూర్చుండి మిన్నకుండెను (12). ఇంతలో సైన్యముతో కూడి యున్నవాడు, రుద్రునిచే ప్రోత్సహింపబడినవాడు, గణాధ్యక్షుడునగు వీరభద్రుడు యజ్ఞస్థలమును సమీపించుచుండెను (13).
కొన్ని గణములు ఆయన వెనుక, మరికొన్ని ఆకాశమునందు, ఇంకొన్ని సర్వదిక్కులను ఆక్రమించి ముందుకు సాగిరి (14). శూరులు, భయము లేనివారు, రుద్రునితో సమానమగు పరాక్రమము గలవారు, మహావీరులునగు ఆ గణములు లెక్కలేనంతమంది సింహనాదములను చేయుచూ ముందుకు సాగిరి (15).
ఆ శబ్దమునకు ముల్లోకములు దద్దరిల్లెను. ఆకాశము ధూళితో నిండెను. దిక్కులయందు చీకట్లు వ్యాపించెను (16). ఏడు ద్వీపములతో, పర్వతములతో, అడవులతో కూడియున్న పృథివి మిక్కిలి భయముతో కంపించెను. సముద్రములన్నియు క్షోభిల్లినవి (17). లోకములను నాశనము చేయగల ఇటువంటి ఆ మహాసైన్యమును చూచి రాక్షసులు మొదలగు వారందరు ఆశ్చర్యచకితులైరి (18). తరువాత ఈ సైన్య సంరంభమును చూచిన దక్షుడు నోటినుండి రక్తమును గ్రక్కెను. ఆతడు భార్యతో గూడి విష్ణువు ఎదుట దండము వలె పడి, ఇట్లు పలికెను (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
08 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment