వేదములు - వాటి ప్రాముఖ్యత - ఆవిర్భావము (The Vedas - Their Importance - Origin)


🌹. వేదములు - వాటి ప్రాముఖ్యత - ఆవిర్భావము 🌹

📚. ప్రసాద్ భరద్వాజ


వేదమనగా – విద్ అను ధాతువు నుండి పుట్టినది. “వేద ఇతీతి వేదః” అనగా తెలియచేయునది వేదమని చెప్పబడును. “విదంతి యతో ధర్మాధర్మమితి వేదః” అనగా దేని సహాయము వలన ధర్మాధర్మములు తెలియబడుచున్నవో అదే వేదము.


శృతి|| శౄయత ఇతి శృతిః|| మరియు

శృతిః|| ఆమ్నాయతే పరంపర ఏత్యామ్నాయః||


అనగా శ్రోత్రేంద్రియమునకు వినబడుటచే శృతియనియూ, గురుశిష్య పరంపరగా తెలియబడునది అయినందున ఆమ్నాయమని చెప్పబడును. శ్రుతి గురువు నుంచి శిష్యుడు వినే దివ్యవాణి. ఆమ్నాయము ఆవృత్తి లేదా మననము ద్వారా నేర్చుకోబడే విద్య. వేదము మొదట్లో ఒక్కటిగానే వుండెను. కృష్ణ ద్వైపాయనుడు వేదమును నాలుగు భాగములుగా విభజించి మానవులకు సులభతరముగా అర్థమయ్యేటట్లు చేసిన మహాఋషి కావడముచేత వేదవ్యాసుడని పేరుగాంచెను.

మహాఋషులైన మంత్ర ద్రష్టల శ్రోత్రేంద్రియములకు వినిపించిన వాక్కులే వేదములు. కనుకనే వాటిని అపౌరుషేయములని చెప్పబడినవి. వేదములకు కర్త అనేవాడు ఒకడు లేనందున అనగా పురుష నిర్మితము కానందున అవి అపౌరుషేయములనీ, అనాది అగుటచే ఒక కాలములో పుట్టెననుటకు వీలు కాదనియూ, నిత్యమగుటచే మార్పుచెందునవిగాని నశించునవిగాని కావనియూ, కనుక సర్వకాలములకు, సర్వులకు నిత్యమైన ప్రమాణ గ్రంథరాజములు వేదములు అని స్తుతింపబడుచున్నవి.

పరమాత్మకు అన్యముగా వేదములు లేవు మరియు వేదములు పరమాత్మయందే నిక్షిప్తమై ప్రకటమగుచున్నందున ‘నిశ్వాసితం’ – ఈశ్వరుని యొక్క నిశ్వాసములే వేదములని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడినది. వేదములను నిగమములని కూడా అంటారు.


వేదములు నాలుగు:

🌻 1) ఋగ్వేదము

🌻 2) యజుర్వేదము

🌻 3) సామ వేదము

🌻 4) అధర్వణ వేదము


వేదము బ్రాహ్మణములు, సంహితలు, అరణ్యకములు అని త్రివిధ భాగములుగా ఉండును.

🌻. బ్రాహ్మణములు కర్మ పద్ధతిని తెలియజేయునట్టివి. ఇది వివిధ ఆచారములు వాటిని పాటించే విధముల గురించి వివరించే భాగము.

🌻. సంహితలు అనగా భగవంతుని స్తుతించునట్టి స్తోత్రములు. ఇందులో ఇహలోక పరలోక లభ్ధికోసము వివిధ దేవతల గురించి ప్రార్థనలు ఉన్న భాగము. సంహితలలో భక్తి పద్ధతి బోధించబడినది.

🌻. అరణ్యకములు అనగా వేదాంతమును బోధించు ఉపనిషత్తులు. అరణ్యకములలోని ఉపనిషత్తులయందు జ్ఞాన పద్ధతి తెలియజేసి బ్రహ్మస్వరూపము ఉపదేశించబడినది. ఉపనిషత్తులనే వేదశిఖరములనియూ, వేదాంతములనియూ అంటారు. ఉపనిషత్తులు వేదములలోని సారాంశాన్ని వివరిస్తాయి.

మొత్తము వేద విజ్ఞానమును ఒక మహావృక్షంగా భావిస్తే బ్రాహ్మణములను ఆ చెట్టు పూలుగా, సంహితలను పచ్చి కాయలుగా, ఉపనిషత్తులను పండ్లుగా వర్ణించవచ్చును. కృష్ణ ద్వైపాయనుడు వేదములను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే వారికి బోధించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్య పరంపరగా ఈ నాలుగు వేదములు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదములను ఉచ్ఛరించడములో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదములు కలిపి 1,180 అధ్యాయాలు, లక్ష పైగా శ్లోకాలు ఉండాలని అంటారు. ఒక్కొక్క అధ్యాయమునకు ఒక్కటేసి చొప్పున 1,180 అధ్యాయాలకు 1,180 ఉపనిషత్తులు ఉండేవి. కాని ప్రస్తుతము మనకు లభించిన శ్లోకాలు 20,023 (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు) కాగా, ఉపనిషత్తులు 108 మాత్రమే లభించినవి. మిగతావి కాలగర్భములో కలిసిపోయాయి.


🌻 1) ఋగ్వేదము

ఈ వేదము అన్ని వేదములలో ప్రాచీనమైనదిగా భావిస్తారు. ఈ వేదము మొట్టమొదటిసారిగా పైల మహర్షికి ప్రకటింపబడినది. అగ్ని దేవుడికి అంకితము చేయబడిన ఈ వేదమునకు అధిష్ఠాన దేవత గురువు. ఈ వేదము మొత్తము 10 మండలాలుగా విభజించబడి, 1028 సూక్తములతో 10,552 మంత్రాలతో అలరారుతూ ఉంది. ఈ వేదము మొదటిలో 21 శాఖలుగా విస్తరించి ఉండేది. కాని ఇప్పుడు 5 శాఖలు మాత్రమే దొరుకుతున్నాయి. దేవతా సూక్తములు, ఆత్మ సంబంధిత సూక్తములు, సామాన్య జీవన విధాన సూక్తములు ఇందులో పొందు పరచ బడినాయి.


🌻 2) యజుర్వేదము

వైశంపాయన మునికి మొదటి సారిగా ప్రకటించబడిన ఈ వేదము వాయు దేవునికి అంకితము చేయబడినది. అధిష్ఠాన దేవత శుక్రుడు. ఈ వేదము 40 స్కంధములుగా విభజించబడి, 1975 శ్లోకములతో అలరారుతుంది. ఈ వేదమును ‘శుక్ల’ యజుర్వేదము అని, ‘కృష్ణ’ యజుర్వేదము అని రెండు భాగములుగా విభజించారు. వీటిలో శుక్ల యజుర్వేదము ప్రాచీనమైనది. కృష్ణ యజుర్వేదము యాఙ్ఞవల్క్య మునికి ప్రకటించబడినది. యజుర్వేదము మొదట 102 శాఖలుగా ( 85 కృష్ణ, 17 శుక్ల) విస్తరించినప్పటికి, ప్రస్తుతానికి 4 కృష్ణ యజుర్వేద శాఖలు, రెండు శుక్ల యజుర్వేద శాఖలు మాత్రమే మనకు మిగిలాయి. ఈ వేదము ముఖ్యముగా సాంప్రదాయ పద్ధతులు, పూజా విధానములు, బలి మొదలైన వాటిని వివరిస్తుంది. కృష్ణ యజుర్వేదములో ‘తైతిరీయ’, ‘కఠ’ ఉపనిషత్తులు ఉండగా, శుక్ల యజుర్వేదములో ‘ఈశ’, ‘బృహదారణ్యక’ ఉపనిషత్తులున్నాయి.


🌻 3) సామ వేదము

ఈ వేదము మొట్టమొదటి సారిగా జైమిని మునికి ప్రకటించబడింది. ఈ వేదమునకు అధిష్ఠాన దేవత అంగారకుడు. ఈ వేదము ఆదిత్యునికి అంకితము చేయబడినది. ఈ వేదము రెండు భాగములుగా విభజించబడింది.

(1) పూర్వార్సిక: 4 స్కంధములలో 585 మంత్రములు కలిగి ఉంది.

(2) ఉత్తరార్సిక: 21 స్కంధములలో 964 మంత్రములను కలిగి ఉంది.

మొత్తం 1564 మంత్రములలో 75 మంత్రాలు ఋగ్వేదము నుంచి గ్రహించబడినాయి. మొదట్లో 1000 శాఖలుగా విస్తరించిననూ ప్రస్తుతానికి 3 శాఖలు మాత్రమే నిలిచి ఉన్నాయి. దైవ ప్రార్థనలు, సంగీతము, శాంతి ప్రార్థనలు ఈ వేదములో మనకు కనపడే విశేషములు.


🌻 4) అధర్వణ వేదము

ఈ వేదము మొదటి సారిగా సుమంతు మహామునికి ప్రకటించబడినది. ఆదిత్యునికి అంకితమైన ఈ వేదమునకు బుధుడు అధిష్ఠాన దేవత. ఈ వేదము రెండు భాగములుగా విభజించబడినది.

(1) పూర్వార్థ: అనేక విషయముల పై చర్చ.

(2) ఉత్తరార్థ: వివిధ ఆచారముల పై కూలంకష చర్చ.

అధర్వణ వేదము నాలుగు భాగములుగా విభజించబడి 20 స్కంధములతో 6,077 మంత్రములతో అలరారుతున్నది. మొదట తొమ్మిది శాఖలతో ఉన్న ఈ వేదములో ప్రస్తుతము 2 శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ వేదములో దైవ ప్రార్థనలతో పాటు సృష్టి పరిణామము గురించిన కథలు, భూత, పిశాచ, దుష్ట శక్తులను నివారించటానికి మంత్రములు, మంత్ర విద్య, తంత్ర విద్యలకు సంబంధించిన విషయములు కూడా పొందుపరిచారు. ఇందులో 93 ఉపనిషత్తులు పొందుపరుచబడి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ‘ప్రశ్న’, ‘మాండూక’, మరియు “మాండుక్య” ఉపనిషత్తులు.

ఈ నాలుగు వేదములు త్రిగుణాత్మకమైనవి. అనగా సత్వరజస్తమోగుణములతో కూడుకొని కర్మ, భక్తి, జ్ఞాన సంబంధమైన పద్ధతులనే బోధించును, కాని వాటికి అతీతమైన పద్ధతిని తెలియచేసి జననమరణ భ్రాంతిరహితమును సూచించు మార్గమును తెలియ చేయలేవని భావము. కనుకనే శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతయందు ఈ క్రింది విధముగా వక్కాణించి వున్నారు.


“శ్లో || త్రైగుణ్య విషయా వేదా | నిస్త్రైగుణ్యో భవార్జున |

నిర్ద్వంద్వో నిత్య సత్త్వస్థో | నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ||”


🌹 🌹 🌹 🌹 🌹


08 Jan 2021

No comments:

Post a Comment