గీతోపనిషత్తు -152


🌹. గీతోపనిషత్తు -152 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 4

🍀 4 - 2. సంకల్ప సన్యాసము - ఆసక్తి అనాసక్తిగా ఎట్లు మారగలదు? అంతరంగ మాధుర్యము బహిరంగ మాధుర్యముకన్న మిన్నయని జీవునకు తోచినపుడే ఇది సాధ్యము. సత్సాంగత్యము, సద్గురు బోధ అమిత మధురమగు విషయము నావిష్కరింపగ దానియందు ఆసక్తి కలుగుట కవకాశ ముండును. దైవమును గూర్చిన రుచి పెరుగుచుండగ ప్రవృత్తి యందు మార్పునకై కృషి కూడ సమాంతరముగ సాగవలెను. అట్లు సాగుటకే ప్రవృత్తి కార్యములందు అనగా బాహ్య ప్రవర్తన యందు కర్తవ్య నిర్వహణము మాత్రమే నిర్వర్తించుట నొక దీక్షగ గైకొనవలెను. కర్తవ్యేతర సంకల్పములు సాధకుని వీడినపుడే అతడు యోగమున పురోగతి చెందు అవకాశము కలిగి యుండును. ఈ స్థితినే భగవంతుడు సంకల్ప సన్యాసమని పలికినాడు. 🍀

యదా హి చేంద్రియార్డేషు న కర్మ స్వనుషజ్జతే |
సర్వసంకల్ప సన్న్యాసీ యోగారూఢ స్తదోచ్యతే || 4

హృదయము నుండి ప్రజ్ఞయింద్రియముల ద్వారా బహిర్గత మగుచున్నది గనుక, హృదయమును రంజింపజేయు విషయ మొక్కటి తెలిసినచో బాహ్య విషయములం దనాసక్తికి అవకాశ మేర్పడును. అంతరంగ మాధుర్యము బహిరంగ మాధుర్యముకన్న మిన్నయని జీవునకు తోచినపుడే ఇది సాధ్యము. సత్సాంగత్యము, సద్గురు బోధ అమిత మధురమగు విషయము నావిష్కరింపగ దానియందు ఆసక్తి కలుగుట కవకాశ ముండును.

అట్లే సభ్రంథములు కూడ అట్టి ప్రచోదనము కలిగింప గలవు. దైవమునందు రుచి కలుగుట దైవానుగ్రహమే. రుచి కలిగిన వారు సత్సాంగత్యము, సభ్రంథ పఠనము కావించుట వలన రుచి పెరుగగలదు.

దైవమును గూర్చిన రుచి పెరుగుచుండగ ప్రవృత్తి యందు మార్పునకై కృషి కూడ సమాంతరముగ సాగవలెను. అట్లు సాగుటకే ప్రవృత్తి కార్యములందు అనగా బాహ్య ప్రవర్తన యందు కర్తవ్య నిర్వహణము మాత్రమే నిర్వర్తించుట నొక దీక్షగ గైకొనవలెను.

చేయవలసిన పనులను మాత్రమే చేయుచు, చేయదలచిన వన్నియు చేయుట మానవలెను. కర్తవ్య కార్యము లెవ్వరికిని తప్పవు. వానిని నిర్వహింపక పోవుట అవివేకము. కర్తవ్యమునకు మించి కలుగు సంకల్పములు కోరికలే యగును. ఈ కోరికలే కళ్ళెము లేని గుఱ్ఱములు. వీనిని అదుపున నుంచుకొనినచో ప్రజ్ఞ బాహ్యము నుండి అంతరంగము లోనికి తిరోధానము చెందదు.

కోరికలను నియమించుట, నిగ్రహించుట అనగా, కర్తవ్యము కాని సంకల్పములలో నియమించుట. విచక్షణము లేనిచో కర్తవ్యమేమో తెలియదు. కానిపనులు కూడ కర్తవ్యమే అనిపించును. అపుడు జీవుడు తీరుబడి లేక తిరుగుచుండును.

కర్తవ్యము నందు తప్ప యితరములగు ఆసక్తి నశించుటకు బాహ్యముగ దీక్షనుగొనుట, అంతరంగమున నచ్చిన ఒక వెలుగు రూపమును ఆరాధించుట నేర్వవలెను. కర్తవ్య కర్మను మాత్రమే నిర్వర్తించు జీవుడు యింద్రియార్థముల వెంటబడి ప్రపంచమున పరుగెత్తడు.

ఆహార వ్యవహారాదులను క్లుప్తము కావించుకొనును. ఆసక్తి అంతరంగమును గూర్చి ఏర్పడుచుండగ బహిరంగమున వ్యాప్తిపై ఆసక్తి యుండదు. ఇట్లు భగవంతుడు చెప్పిన అనాసక్తత సిద్ధించు చుండును.

సంకల్పములు కూడ కర్తవ్యము మేరకే ఏర్పడుచుండును గాని, ఊరుట యుండదు. మానవులకు సంకల్పములు ఊట బావిలోని నీరువలె ఊరుచునే యుండును. అట్టి వారికి ఊరట కలుగదు. వారు ధ్యానమున కర్హులు కారు. ఆత్మసంయమమునకు అర్హులు కారు.

కర్తవ్యేతర సంకల్పములు సాధకుని వీడినపుడే అతడు యోగమున పురోగతి చెందు అవకాశము కలిగి యుండును. ఈ స్థితినే భగవంతుడు సంకల్ప సన్యాసమని పలికినాడు.

ఇంద్రియార్థముల వెంటబడి తీరుతెన్ను లేకుండ, గతి గమ్యము లేకుండ బాహ్యమునకు ప్రసరించు మానవ ప్రజ్ఞను, కర్తవ్యము మేరకే నిర్వర్తింప జేయుట, కర్తవ్యేతర సంకల్పములను సన్యసించుట ఆత్మ సంయమమునకు ప్రధానమగు సూత్రము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Feb 2021

No comments:

Post a Comment