✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 5
🍀 5 - 3. ఆత్మోద్ధరణ - దేహము తన వాహనమే కాని తాను కాదు. తాను ప్రజ్ఞ, శరీరము తన వాహనము. వాహనమును, తనను అనుసంధానము చేయు ప్రజ్ఞ చిత్తము. ఈ చిత్తము బుద్ధి నుండి దిగివచ్చినది. బుద్ధి దైవమునుండి దిగివచ్చినది. జీవుడు కూడ దైవమునుండి దిగి వచ్చినాడు. చిత్తము దేహమునకు లోనైనపుడు, తాను దైవ స్వరూపుడనని, జీవుడు శాశ్వతుడని, బుద్ధియను వెలుగు తన సహజమగు గుణమని మానవుడు మరచును. ఇట్టి మరపునకు కారణము బాహ్యమందలి విషయములకు చిత్తము నిష్కారణముగ ఆకర్షింపబడుటయే. ఇట్లాకర్షింప బడినపుడు చిత్తము ప్రవృత్తి మార్గమునందే యుండునుగాని, నివృత్తి మార్గమున ప్రవేశింపదు. యోగవిద్య నుపాసించువారు మొట్టమొదట చిత్తముయొక్క ప్రవృత్తులను నిరోధించవలెనని యోగశాస్త్రము తెలుపుచున్నది. చిత్తము ప్రవృత్తులకు బానిస అయినచో జీవు డధోగతి చెందును. చిత్తము ప్రవృత్తితో దైనందినముగ వ్యవహరించు చున్నప్పటి కిని, నివృత్తి మార్గమున బుద్ధితోను, జీవాత్మతోను, పరమాత్మతోను అనుసంధానము చెందుట ఊర్ధ్వగతి యగును. 🍀
ఉద్ద రేదాత్మనం 2 త్మానాం నాత్మాన మవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః || 5
పంచేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచభూతములతో కూడిన శరీరము బహిఃకరణ మందురు. బహిఃకరణము ప్రపంచముతో ప్రతిస్పందించుటకు ఒక వాహిక. అంతఃకరణమున నున్న మానవుడు బహిఃకరణమగు దేహమును వాహనముగ గొని, పంచభూతాత్మకమైన ప్రపంచమున తిరుగాడుచుండును. వాహనమెక్కి తిరుగుట యనగా, సంకేతార్థ మిదియే. దేవతలందరును వాహనమెక్కియే తిరుగుదురు. నరుడు కూడ దేహమను వాహనమెక్కియే తిరుగుచున్నాడు. ఇది తెలియుట ముఖ్యము.
దేహము తన వాహనమే కాని తాను కాదు. తాను ప్రజ్ఞ, శరీరము తన వాహనము. వాహనమును, తనను అనుసంధానము చేయు ప్రజ్ఞ చిత్తము. ఈ చిత్తము బుద్ధి నుండి దిగివచ్చినది. బుద్ధి దైవమునుండి దిగివచ్చినది. జీవుడు కూడ దైవమునుండి దిగి వచ్చినాడు. చిత్తము దేహమునకు లోనైనపుడు, తాను దైవ స్వరూపుడనని, జీవుడు శాశ్వతుడని, బుద్ధియను వెలుగు తన సహజమగు గుణమని మానవుడు మరచును. ఇట్టి మరపునకు కారణము బాహ్యమందలి విషయములకు చిత్తము నిష్కారణముగ ఆకర్షింపబడుటయే. ఇట్లాకర్షింపబడినపుడు చిత్తము ప్రవృత్తి మార్గమునందే యుండునుగాని, నివృత్తి మార్గమున ప్రవేశింపదు.
యోగవిద్య నుపాసించువారు మొట్టమొదట చిత్తముయొక్క ప్రవృత్తులను నిరోధించవలెనని యోగశాస్త్రము తెలుపుచున్నది. చిత్తము ప్రవృత్తులకు బానిస అయినచో జీవు డధోగతి చెందును. అనగా ప్రపంచమున బంధింపబడును. అన్నిటికన్న మిన్నగ దేహమే బంధించును. అపుడు దేహమే తానను భావముతో జీవించును. ఇదియొక వికృత స్థితి. రౌతు గుఱ్ఱముతో చేరి, గుఱ్ఱముచే బంధింపబడి, గుఱ్ఱమునకు బానిస అయినచో అది వికారమే. గుఱ్ఱము నధిరోహించి తన పనులను చక్క పెట్టుకొనుట మాని, గుఱ్ఱమునకు సేవకు డగుట పతనమే కదా! రాజు సేవకుడగుట, సేవకుడు రాజగుట సామాన్య నరుని స్థితి. ఈ కారణముగనే గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు, తనకు తానే అధోగతి చెందుటను గూర్చి బోధించినాడు.
చిత్తము ప్రవృత్తులకు లోబడి ఉన్నంతకాలము జీవుడు దేహబద్దుడై యుండును. ప్రవృత్తి వర్జనీయము కాదుగాని, జీవితమున ప్రవృత్తియే సమస్తము కారాదు. ప్రవృత్తితో నుండుట అనుభవమును, ఆనందమును యిచ్చును. కాని ప్రవృత్తిలో నుండుట బంధము. ఈ బంధము దుఃఖ హేతువు. సంసార హేతువు. ఇది జరుగకూడదు సుమా! అని దైవము హెచ్చరించు చున్నాడు.
చిత్తము ప్రవృత్తితో దైనందినముగ వ్యవహరించు చున్నప్పటి కిని, నివృత్తి మార్గమున బుద్ధితోను, జీవాత్మతోను, పరమాత్మతోను అనుసంధానము చెందుట ఊర్ధ్వగతి యగును. చిత్తము తానే. కనుక తాను తనను అధోగతికి చేర్చవచ్చును. తనను తాను ఊర్ధ్వ గతికిని చేర్చవచ్చును. అంతఃకరణ మార్గము ఊర్ధ్వగతి నిచ్చును. బహిర్గత మార్గమున యిమిడిపోయినచో అధోగతి కలుగును. తన్ను తాను మరచి, ప్రపంచమే సర్వస్వమని జీవించువాడు తనకు తానే శత్రువగు చున్నాడు.
అంతఃకరణ మార్గమున తన సమగ్ర రూపమును తెలిసి దేహమును వాహనముగ నిర్వర్తించుకొనువాడు తనకు తానే మిత్రుడు, తనకు తానే బంధువు. ఈ శ్లోకము పరమ పవిత్రమగు నొక సత్యము నావిష్కరించును. దీనిని బుద్ధిమంతుడు శ్రద్ధతో చదువుకొనవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
22 Feb 2021
No comments:
Post a Comment