🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 2 🌻
7. మనసు నిర్వికారంగా చేసుకోవాలంటే ప్రకృతి, పురుషులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఒక దీపంతో అనేక దీపాలను ముట్టించుకోవచ్చును. ఆప్రకారంగానే ప్రకృతి బహురూపగుణాలతో ఉంటుంది, పెరుగుతుంది. ఒకదానితో ఒకటి తగిలి పెరుగుతుంది.
8. గుణములు మూడింటిలో సంతోషము, ఆనందము, ఆరోగ్యము, అక్రొధము, అర్జవము, అంటే ఋజుమార్గము; శుద్ధి, ప్రకాశత్వము, సుస్థిరత్వము, అహింస, నిర్మల శ్రద్ధ, వినీతి, లజ్జ, అంటే వినయము; సత్యము, శౌచము, సమత, ఆచారము, అకార్పణ్యము, అంటే కృపణత్వము లేకుండా, పైశునత్వము(లోభత్వము) లేకుండా ఉండటము; అకామవృత్తి(తీవ్రమైన కోరిక లేకుండటము), ఇవన్నీకూడా సత్వగుణముంలు అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.
9. విగ్రహము, దర్పము, తిరస్కార, అభిమానములు(అంటే మరొకరిని తిరస్కరించి యుద్ధం చెయ్యటము), కామక్రోధములు, మాత్సర్యము, కరుణ లేకపోవటము, భోగకాంక్ష, అహంకారము – ఇవన్నీ కూడా రజోగుణలక్షణములు.
10. అప్రకాశము (చీకటి, కాంతి లేకపోవటము), బహుతరాశనము (అతిగా భోజనము చేయటము), మోహము, వాదము, ప్రమాదము, పెద్దలోస్తే లేవకుండా మత్తుగా ఒకచోట కూర్చుని ఉండటము, మూర్ఖత్వము, మందబుద్ధి, మరణమంటే భయము, దుఃఖము మొదలైనివి తమోగుణలక్షణాలు.
11. పురుషుడు లోపలి చేతనుడు, ప్రకృతి జడమైనటువంటిది. ఆత్ముడు తనను తాను తెలుసుకుంటే, వ్యక్తమైన(తనను పరివేష్టించిన) ప్రకృతితో తాదాత్మ్యం చెందడు. ప్రకృతిని సమీక్షించక, ‘అజర శాశ్వత నిరంజన విమలాచ్యుత పదము’న నిజప్రకాశ స్థిరుడై అక్షరుడవుతాడు. అంటే మోక్ష పదవిని పొందుతాడు. ప్రకృతివశంకాడు. ఆత్ముడు తనను తాను తెలుసుకుంటే, పురుషుడు ప్రకృతి యందు, ప్రకృతి పురుషుని యందు నిలుస్తారు.
12. పురుషుడు నీటిలో చేపవలె, ఉదుంబరమశకములు సంగమించిన రీతిగా వికృతి చెందడు. (మేడిపండుపైన దోమ వాలినప్పుడు ఒకటిగా కనబడినా, ఆ రెండూ వేరే అయినట్లు, శరీరానికీ – ఆత్మకూ భిన్నత్వం ఉంది అని అర్థం) అంతరాత్మ ప్రకృతిని పొందినా – నీటిలో కమలము ఉండికూడా నీరు అంటనట్లుగా – వికారము పొందదు.
13. మనసు ఇంద్రియాలతో ఉండి వికారం చెందుతుంది. మనసుననుసరించి ముద్ధి వికారము చెందుతుంది. పాపపుణ్యాలలో ప్రవర్తిస్తోంది. ఈ ప్రకృతిననుసరించి చిత్తము సంక్షుభితమవుతోంది. అంతరాత్మ ఈ ప్రకృతిలో ఉండికూడా, మాలిన్యం లేకుండా విమలంగా ఉంది.
14. మనోబుద్ధి చిత్తహంకారాలు మాత్రం ఈ ప్రకారంగా మాలిన్యం పొందుతుంటే, ఆత్మ వస్తువుకు మరి ఈ ప్రకృతిలో ఉండికూడా విమలత్వం ఎలా వచ్చింది? దాని స్వభావం ఏమిటి? ఇలాంటి విచారణ వల్ల జీవుడికి ఆత్మజ్ఞానము కలుగుతుంది.
15. అహంకారమేమో పునర్జన్మహేతువవుతోంది. దీనిలో పాపపుణ్యాలు ప్రవేశిస్తున్నాయి, లోభమోహాలవుతున్నాయి. కానీ ఎటువంటి పరిస్థితిలోనూ కూడా ప్రకృతివల్ల ఏ దోషం సంక్రమించకుండా ఉండే ఆత్మవస్తువు ఒకటుందే, దాని స్వభావమేది అనే విచారణ మోక్షమార్గం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
22 Feb 2021
No comments:
Post a Comment