శ్రీ శివ మహా పురాణము - 354


🌹 . శ్రీ శివ మహా పురాణము - 354 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

91. అధ్యాయము - 03

🌻. దేవీస్తుతి - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ పర్వతరాజు విష్ణువు మొదలుగా గల ఆ దేవతల మాటలను విని, ప్రసన్నమగు మనస్సు గలవాడై అదరముతో అటులనే అగు గాక! అని పలికెను(23) అపుడు వారు మిక్కిలి అదరముతో ఆ విధివిధానము నంతయు హిమవంతునకు భోదించి తాయుమ శంకరపత్నియగు ఉమాదేవిని శరణము జొచ్చిరి(24). వారు మంచి స్థలములో నిలబడి మనస్సులో ఆ జగన్మాతను స్మరించి, అనేక పర్యాయములు ప్రణమిల్లి శ్రద్ధతో స్తుతించిరి(25)

దేవతలిట్లు పలికిరి-

ఓ ఉమాదేవీ! జగన్మాతా! దుర్గా! మహేశ్వరి! సదాశివునకు ప్రియురాలనవై శివలోకము నందు నివసించు నీకు నమస్కారము (26). పవిత్రము చేయునది. శాంతిస్వరూపురాలు, పుష్టిని కలిగించునది, మహత్తు, ప్రకృతి స్వరూపముగా గలది అగు శ్రీ శక్తిని మేము భక్తితో నమస్కరించుచున్నాము (27) మంగళ స్వరూపురాలు, మంగళము నిచ్చునామె, శుద్ధ, స్థూలరూపిణి(కార్య రూపిణ) సూక్ష్మ (కారణ) రూపిణీ, సర్వశ్రేష్ఠ లక్ష్యము, అంతర్ముఖత్వముచే మరియు అధ్యాత్మ విద్యచే మిక్కలి ప్రీతిని పొందునది అగు నిన్ను నమస్కరించు చున్నాము(28). శ్రద్ధ నీవే, ధైర్యము నీవే, సర్వ ప్రాణములలోని శోభ నీవే. సూర్యుని యందలి ప్రకాశమునీవే. నీ స్వరూపమగు ప్రపంచమును నీవే ప్రకాశింప జేయుచున్నావు (29)

ఏదేవి బ్రహ్మాండమే దేహముగా కలిగియున్నదో, బ్రహ్మాండములోని ప్రాణులన్నింటిలో చలన శక్తిరూపములో నున్నదో, బ్రహ్మగారి నుండి తృణము వలరకు గల సర్వప్రాణులను సంతృప్తి పరచు చున్నదో అట్టి ఆ ఉమాదేవిని నమస్కరించు చున్నాము(30) వేదమాత యగు గాయత్రివి నీవే. సవితృమండలాదధిష్టాన దేవతవు నీవే. సరస్వతివి నీవే. సర్వ ప్రాణులలోని తెలిసే సామర్థ్యము నీవే. ధర్మమూలమగు వేదము నీవే (31).

సర్వ ప్రాణుల యందలి నిద్ర, ఆకలి, మరియు తృప్తి నీవే . ప్రాణుల యందలి తృష్ట, కాంతి, సౌందర్యము మరియు తుష్టి నీవే. నీవు సదా సర్వులకు ఆనందము నిచ్చెదవు (32). పుణ్యాత్ములకు లభించు లక్ష్మివి నీవే. పాపులకు నిశ్చితముగా సంప్రాప్తమయ్యే దారిద్ర్యము నీవే. సర్వప్రాణులలోని శాంతివి నీవే. సర్వ ప్రాణులను పోషించు తల్లివి నీవే (33).

పంచభూతములలోని సారతత్త్వము నీ స్వరూపమే. నీతి శాస్త్రజ్ఞుల, మరియు నీతి మంతుల నీతి నీవే. నిశ్చయాత్మకమగు బుద్ధి నీ స్వరూపమే (34). సామవేదమునందలి గీతి నీవే. యజుర్వేదములోని ఆహుతి నీవే. మరియు బుగ్వేదము యొక్క మాత్ర నీవే. అథర్వణ వేదము యొక్క పరమతాతత్పర్యము నీవే (35). సమస్త దేవతా బృందముల శక్తి నీవే. లోకములకు తల్లి వగు నీ యందు తమోగుణము ఒకానొక రూపములో కనబుడును. రజోగుణ స్వరూపిణి వగు నీ నుండియే ఈ ప్రపంచము పుట్టినది. మాకు మంగళములనిచ్చు నిన్ను ఇచట మేము వేద వాక్కులచే స్తుతించుచున్నాము (36).

సంసార సముద్రములో పుట్టుట యనే భయంకరమగు దుఃఖమును దాటించే పడవ నీవే. అజ్ఞానావరణ నీకు లేదు. ఎనిమిది అంగములోత గూడిన యాగమును పాలించుట అను క్రీడలో సమర్థురాలు, వింధ్య పర్వత నివాసముచే ప్రీతిని పొందునది అగు ఆ దేవిని నమస్కరించుచున్నాము (37) ప్రాణులలో ముక్కు, కన్ను మొదలగు జ్ఞానేంద్రియముల యందు, నోరు, భుజములు మొదలగు కర్మేంద్రియముల యందు మరియు మనస్సునందు ఓ జోరూపముగా నుండి, మరియు ప్రాణుల హృదయ పుండరీకమునందు నివసించి వారికి సదా నీవు సుఖమును కలిగించుచున్నాము. జగదేక సుందరివగు నీవు మా యందు నిద్రా రూపమున ఉన్నావు. అజ్ఞాన రూపములో నున్నావు. అట్టి నీవు ఈ జగుత్తు యొక్క ఉనికిని రక్షించి మమ్ములను పాలించుము(38)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలందురు మహేశ్వరి, జగన్మాత, సతీ దేహధారిణి అగు ఉమాదేవిని ఈ విధముగా స్తుతించి, మిక్కిలి ప్రీతితో నిండిన మనస్సు గలవారై ఆమెను దర్శించు కోరికతో అచటనే వేచి యుండిరి(39) .

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్రసంహితయందు యగు పార్వతీ ఖండలో దేవీస్తుతి అనే మూడవ అధ్యాయము ముగిసినది(3).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


22 Feb 2021

No comments:

Post a Comment