గీతోపనిషత్తు -191


🌹. గీతోపనిషత్తు -191 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 32


🍀 32. సమదర్శనము - ఓ అర్జునా! సర్వప్రాణులను తనవలెనే ఆత్మలుగ భావించుచు, వారి యందలి ఆత్మను దర్శించుచు, వారి సుఖ దుఃఖములను తన సుఖదుఃఖములుగ సమవేదన చెందువాడు యోగులలో శ్రేష్ఠుడని నా మతము. జీవరాసు లన్నిటికిని మూల మాత్మయే. స్వభావ వైవిధ్యము జీవుల పరిపక్వతను బట్టి ఏర్పడినది. పరిపక్వత యందలి భేదము వలన జీవుల యందు సుఖదుఃఖము లేర్పడును. ఇట్టి విధముగ జీవుల స్వభావ భేదమును బట్టి వారి వారికి కలుగు సుఖదుఃఖములను, పక్వత చెందిన ఆత్మయోగి జీవుల యందు సానుభూతి కలిగి యుండును. వారి దుఃఖములను తన దుఃఖములుగ సహవేదన అనుభవించును. ఈ ఆశయము సిద్ధించు వరకు యోగసాధన సాగుచునే యుండ వలెను.🍀

ఆత్మాపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున |
సుఖం వాయది వాదుఃఖం సయోగీ పరమో మతః || 32

ఓ అర్జునా! సర్వప్రాణులను తనవలెనే ఆత్మలుగ భావించుచు, వారి యందలి ఆత్మను దర్శించుచు, వారి సుఖ దుఃఖములను తన సుఖదుఃఖములుగ సమవేదన చెందువాడు యోగులలో శ్రేష్ఠుడని నా మతము. జీవరాసు లన్నిటికిని మూల మాత్మయే. ఆత్మ కేంద్రముగ త్రిగుణములు, పంచభూతములు రూపముగ నేర్పడి, రూప కదలికకు ప్రాణము లేర్పడును.

అందరి యందున్నది ఆత్మయే. అందరి రూపములు త్రిగుణములు మరియు పంచభూతముల సమ్మేళ నమే. అందరియందు కదలిక కలిగించునది ప్రాణమే. అందరి యందలి చైతన్యము కూడ విశ్వచైతన్యమే. జీవుల వైవిధ్యము మరి ఎచ్చటి నుండి ఏర్పడినది? వారి వారి స్వభావమును బట్టి ఏర్పడినది. స్వభావ వైవిధ్యమును బట్టియే గుణ సమ్మేళనము నందు, పంచభూతముల సమ్మేళనము నందు వైవిధ్య మేర్పడినది. తత్కారణముగనే ప్రాణగతుల వైవిధ్య మేర్పడినది.

స్వభావ వైవిధ్యము జీవుల పరిపక్వతను బట్టి ఏర్పడినది. పచ్చికాయ వగరుగ నుండగ, పండు తీయగ, రుచిగ నుండును. పరిపక్వత యందలి భేదము వలన జీవుల యందు సుఖదుఃఖము లేర్పడును. ఇట్టి విధముగ జీవుల స్వభావ భేదమును బట్టి వారి వారికి కలుగు సుఖదుఃఖములను, పక్వత చెందిన ఆత్మయోగి జీవుల యందు సానుభూతి కలిగి యుండును. వారి దుఃఖములను తన దుఃఖములుగ సహవేదన మనుభవించును.

దానికి కారణము, ఇరువురి యందలి మూలము ఆత్మయే కదా! నిజమగు యోగులు ఇతరుల దుఃఖమునకు సంతసించరు. తటస్థముగ గూడ నుండరు. వారియందు సానుభూతి కలిగి తగు విధముగ హితము గావింతురు. ఇట్టి కారుణ్యము గలవారే ఆత్మ యోగమున నుండగలరు. వారే నిజమగు భక్తులు కూడ. కేవలము వాత్సల్యము చూపువారు కపటులు.

ఇట్టి కారుణ్య భావము సోదరత్వము అని పిలువబడును. సోదరుల పైనే కరుణ లేనివాడు ఆత్మ సోదరత్వమెట్లు సాధించ గలడు. ఈ శ్లోకమున “సర్వత్ర సమం పశ్యతి" అని భగవానుడు పలికినాడు. సర్వత్ర అను పదము సమస్తమగు ప్రాణులను సమముగ దర్శించుట అని అర్థమిచ్చును. ఆత్మ దర్శనమే సమదర్శనమని తెలియవలెను.

దేశ కాల మత జాతి భేదముల నధిగమించి ఆత్మను దర్శించువాడే యోగి గాని, ఇతరులెట్లు యోగులు కాగలరు! ఆత్మ దర్శనునకు సర్వము తానుగనే దర్శన మగుచుండును. కనుక వారి బాగోగులు తనకు సహవేదన కలిగించుట సహజము. అట్టి సహజ స్థితి యందున్న వాడు యోగులలో శ్రేష్ఠుడని శ్రీకృష్ణుడు తన అభిప్రాయమును వెల్లడించి నాడు. ఈ ఆశయము సిద్ధించు వరకు యోగసాధన సాగుచునే యుండ వలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


28 Apr 2021

No comments:

Post a Comment