రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 17
🌻. ఇంద్ర మన్మథ సంవాదము - 2 🌻
మన్మథుడు ఇంద్రుని ఈ పలుకులను విని, చిరునవ్వుతో మరియు ప్రేమతో గంభీరముగా నిట్లు పలికెను (16).
మన్మథుడిట్లు పలికెను-
నీవు ఇట్లు ఏల పలుకుచుంటివి? నేను నీకు సమాధానమునీయను. ఉపకారమును చేయు మిత్రుని, కృత్రిమ మిత్రుని లోకమునందు పరిశీలించెదరే గాని, వారి గురించి మాటలాడరు (17). కష్టము కలిగినప్పుడు అధికముగా మాటలాడు వాడు కార్యమునేమి చేయగలడు? మహారాజా! ప్రభూ! అయిననూ చెప్పెదను. వినుము (18). నీ పదవిని లాగుకొనుటకై ఎవరైననూ ఘోరపతపస్సును చేయుచున్నాడా యేమి? ఓ మిత్రమా! అట్టి నీ శత్రువును నిశ్చితముగా పడకొట్టగలను (19). ఒక సుందరి యొక్క వాలు చూపుతో దేవతలను గాని, ఋషులు రాక్షసులు మొదలగు వారిని గాని, క్షణములో భ్రష్టులను చేయగలను. మానవులు నాకు లెక్క కాదు (20).
వజ్రము, ఇతర అనేక ఆయుధములు దూరములో నుండుగాక! మిత్రుడనగు నేను వచ్చిన తరువాత అవి దేనికి పనికి రాగలవు? (21) బ్రహ్మను గాని, విష్ణువును గాని నేను నిస్సంశయముగా భ్రష్టుని చేయగలను. ఇతరుల లెక్కలేదు. నేను శివునియైనను పడగొట్టగలను (22). నాకు అయిదు బాణములు మాత్రమే గలవు. అవి పుష్పములచే చేయబడినవి. మృదువైనవి. నా ధనస్సు పుష్పములచే నిర్మింపబడి మూడు భాగములుగా నున్నది. నారిత్రాడును తుమ్మెదలు సమగూర్చును (23). నాకు మిత్రుడు, మంత్రియగు వసంతుడే నా సైన్యము. అయిదు బాణములే నా బలము. హే దేవా! చంద్రుడు నాకు మిత్రుడు (24).
శృంగారము నాకు సేనాధ్యక్షుడు. హావ భావములే నా సైనికులు. ఇంద్రా! నా బాణములన్నియూ మృదవైనవి. నేను గూడ అట్టివాడనే (25). ఏ కార్యము దేనిచే పూర్తియగునో, బుద్ధిమంతుడు ఆ కార్యమును ఆ సాధనముతో పూర్తి చేయవలెను. నాకు ఏ కార్యము ఉచితమో, దానియందు నన్ను సంపూర్ణముగా నియోగించుము (26).
బ్రహ్మ ఇట్లు పలికెను-
వాని ఈ మాటలను విని ఇంద్రుడు మిక్కిలి ఆనందించి, నమస్కరించి, ప్రేమికులకు సుఖమునిచ్చు మన్మథునితో నిట్లు పలికెను (27).
ఇంద్రుడిట్లు పలికెను-
వత్సా! మన్మథా! నేను నామనస్సులో తలపెట్టిన కార్యమును చేయుటకు నీవే సమర్థుడవై ఉన్నావు. నీవు గాక మరియొకరి వలన ఈ పని సంభవము గాదు (28). మన్మథా! మిత్రశ్రేష్ఠమా! ఈనాడు నిన్ను చూడవలెననే కోరిక కలుగుటకు గల వాస్తవ కారణమును చెప్పెదను. వినుము (29). తారకుడనే మహారాక్షసుడు బ్రహ్మ నుండి అద్భుతమగు వరమును పొంది, అందరికీ దుఃఖమును కలిగించుచున్నాడు. ఆతనిని జయించగలవారు లేరు (30). ఆతడు లోకములను పీడించుచున్నాడు. ధర్మములన్నియూ అనేక విధములుగా భ్రష్టమైనవి. దేవతలు, ఋషులు, ఇతరులు అందరు దుఃఖితులై ఉన్నారు (31).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
28 Apr 2021
No comments:
Post a Comment