గీతోపనిషత్తు -261
🌹. గీతోపనిషత్తు -261 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 5
🍀 5. యోగమహిమ - ప్రాణికోట్లన్నియు పాత్రల వంటివి. అందుండెడి ప్రాణ మొక్కటియే. ఇట్లు ఒకే తత్త్వము యొక్క యోగ మహిమచేత అనేకముగ అది గోచరించుచు నున్నది. నిజమున కున్నది ఒకే ఒక మహాచైతన్యము. అది తన యోగమహిమచే అనేకముగ గోచరించు చున్నది. అనేకమగుటకు అవస్థితు లేర్పడుచున్నవి. రూపాంతరములు చెందుచున్నవి. ఎన్ని విధములుగ గోచరించినను వాటన్నిటికిని మూలమొక్కటే. మూలము దర్శించు వానికి దానిపై ఏర్పడి, మార్పు చెందుచున్న సమస్తము మహిమాన్వితముగ గోచరించును. మూలమును దర్శించుటయే రాజవిద్య. అది గుహ్యతమము. 🍀
నచమఠాని భూతాని పశ్య మే యోగ మైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థా మమాత్మా భూతభావనః || 5
తాత్పర్యము : నా యోగ ఐశ్వర్యమును చూడుము. ఆ యోగ మహిమ నందే సమస్త ప్రాణికోట్లును భరింప బడి యున్నవి. ఉత్పన్న మొనర్చుట, ప్రాణికోట్ల యందుండుట ఇత్యాదివన్నియు ఆ మహిమ నుండియే జరుగుచున్నవి. అవి యన్నియు నాయందే యున్నప్పటికిని వానియందు నేనున్నానను భావన నాకు లేదు.
వివరణము : ముందు తెలిపిన శ్లోకమునకు మరికొంత వివరణమే యిచట యున్నది. ముందు తెలిపిన ఉదాహరణలలో వెండితెరకు సినిమా లేదు. సినిమాకు మాత్రము వెండితెర యున్నది. బంగారమునకు ఉంగరము లేదు. కాని ఉంగరమునకు బంగార మున్నది. సముద్రమునకు అల లేదు. కాని అలకు సముద్ర మున్నది. ఈశ్వరునకు జీవుడు లేడు. కాని జీవున కీశ్వరుడున్నాడు. ఈ వాక్యములను ధ్యానించుటయే మార్గము కాని వివరించుట మార్గము కానేరదు.
అయినప్పటికిని మరియొక ఉదాహరణము : గోదావరి నదిలో ఒక చెంబు ముంచినచో చెంబులో గోదావరి యున్నట్లు వుండును. చెంబులో గోదావరి, చెంబు ఉపరితలము పై ప్రవహించు గోదావరికి తేడా లేదు. చెంబులో గోదావరి వంటగదిలో పెట్టు కొన్నచో మడి నీళ్ళగును. బిందెలో పోసుకొని త్రాగినపుడు మంచి నీరగును. నిజమునకు అది గోదావరి జలమే. దానికి చెంబులో ఉండుట, బిందెలో ఉండుట తేడా లేదు. ప్రాణికోట్లన్నియు పాత్రల వంటివి. అందుండెడి ప్రాణ మొక్కటియే.
ఇట్లు ఒకే తత్త్వము యొక్క యోగ మహిమచేత అనేకముగ అది గోచరించుచు నున్నది. నిజమున కున్నది ఒకే ఒక మహాచైతన్యము. అది తన యోగమహిమచే అనేకముగ గోచరించు చున్నది. అనేకమగుటకు అవస్థితు లేర్పడుచున్నవి. రూపాంతరములు చెందుచున్నవి. ఎన్ని విధములుగ గోచరించినను వాటన్నిటికిని మూలమొక్కటే.
ఆవిరి నీరై, నీరు మంచుగడ్డ అయినపుడు అందలి మూలమొక్కటే. మూలము దర్శించు వానికి దానిపై ఏర్పడి, మార్పు చెందుచున్న సమస్తము మహిమాన్వితముగ గోచరించును. ఈశ్వరుని యోగ మహిమను దర్శించుచు ఆనందించుము. మూలమును దర్శించుటయే రాజవిద్య. అది గుహ్యతమము. ఎప్పటికప్పుడు మరపు సహజముగ వచ్చును. మరచినపుడెల్ల గుర్తు తెచ్చుకొనుటయే మార్గము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
15 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment