శ్రీ శివ మహా పురాణము - 460


🌹 . శ్రీ శివ మహా పురాణము - 460🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 32

🌻. సప్తర్షుల రాక - 4 🌻


ఓ మహర్షులారా! వారి పుత్రికను నేను వివాహమాడ గోరుచున్నాను. ఈ వివాహము నాకంగీకారమే. బ్రహ్మ అట్టి వరమును ఇచ్చి యున్నాడు (36). ఈ విషములో అధిక ప్రసంగముతో బని యేమి గలదు? మీరు మేనా హిమవంతులకు బోధించి దేవతలకు హితమును చేగూర్చుడు (37). మీచే కల్పించబడిన కన్యావరణ విధికంటె అధికమగు వరణమును చేసినట్లగును. ఇది మీ కార్యమే గనుక, దీనిని సిద్ధిపంజేయుటలో మీ భాగము ఉండవలెను (38).

బ్రహ్మ ఇట్లు పలికెను-

పవిత్రమగు హృదయము గలవారు, ప్రభుని అనుగ్రహమును పొందినవారు అగు ఆ మునులందరు ఈ మాటలను విని ఆనందమును పొందిరి (39). మేము ధన్యులము, అన్ని విధములా కృతకృత్యులము అయినాము. మేము అందరికీ ప్రత్యేకించి వందనీయులము, పూజింపదగినవారము అయినాము (40).

బ్రహ్మవిష్ణువులచే నమస్కరింపబడువాడు, సర్వకార్యములను సిద్ధింప జేయువాడు అగు శివుడు, లోకములకు సుఖమును కలుగజేయు కార్యమునకు పంపదగినవారము మేము అని తలంచి మమ్ములను పంపుచున్నాడు (41). ఈ శివుడు లోకములకు ప్రభువు, తండ్రి. ఆమె తల్లి. ఈ యోగ్యమగు సంబంధము శుక్లపక్షచంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమగు గాక! (42)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవర్షులు అపుడు శివునకు నమస్కరించి ఆకాశమార్గముచే హిమవంతుని రాజధానికి వెళ్లిరి (43). ఆ ఋషులు ఆ దివ్య నగరమును చూచి మిక్కలి ఆశ్చర్యమును పొంది వారిలో వారు తమ భాగ్యమును ఇట్లు వర్ణించిరి (44).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


15 Oct 2021

No comments:

Post a Comment