శ్రీ శివ మహా పురాణము - 461


🌹 . శ్రీ శివ మహా పురాణము - 461🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 32

🌻. సప్తర్షుల రాక - 5 🌻


ఋషులిట్లు పలికిరి -

మనము ఈ హిమవంతుని రాజధానిని దర్శించుట, శివుడు స్వయముగా ఇట్టి కార్యమునందు మనలను నియోగించుట మన పుణ్యము. మనము ధన్యులము (45). ఈ నగరము అలకానగరము కంటె, స్వరగము కంటె, భోగవతీ నగరము కంటె, మరియు అమరావతి కంటె ఉత్తమమైనదిగా కన్పట్టుచున్నది (46).

గృహములు అందముగ నున్నవి. వాకిళ్లు వివిధములగు శ్రేష్ఠ స్ఫటికములతో, మరియు మణులతో పొదుగబడి రంగులనీను చున్నవి (47). ప్రతిగృహమునందు సూర్యకాంతమణులు, చంద్రకాంతమణులు, మరియు స్వర్గమునందు పెరిగే విచిత్రములగు వృక్షములు గలవు (48).

ప్రతిగృహమునందు తోరణములు శోభిల్లుచుండెను. గృహములు చిలుకలతో, హంసలతో, విమానములతో చిత్ర విచిత్రములగు రంగులతో విరాజిల్లెను (49). రంగు రంగుల వస్త్రముల తోరణములతో గూడి వితానములు (బాల్కనీలు) ప్రకాశించెను. అనేక జలాశయములు, వివిధములగు దిగుడుబావులు గలవు (50).

ఉద్యానములు రంగురంగుల పుష్పములతో ప్రకాశించెను. అచటి పురుషులందరు దేవతలు. స్త్రీలందరు అప్సరసలు (51). కర్మభూమియందు యాజ్ఞికులు, పౌరాణికులు హిమవంతుని రాజధానిని వీడి స్వర్గము కొరకై వ్యర్థముగా యజ్ఞాదుల ననుష్ఠించుచున్నారు (52). ఇది కంటబడనంత వరకు మాత్రమే మానవులు స్వరగ్గమును కోరెదరు. ఓ విప్రులారా! దీనిని చూచిన తరువాత స్వర్గముతో ప్రయోజనమేమున్నది? (53)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ ఋషిశ్రేష్ఠులు ఆ నగరమునిట్లు వర్ణిస్తూ సర్వసంపదలతో విలసిల్లే హిమవంతుని గృహమునకు వారందరు వెళ్లిరి (54). దూరములో ఆకాశమునందు గొప్ప తేజస్సుతో సూర్యుని వలె వెలుగొందే ఆ ఏడ్గురు మునులను చూచి చకితుడైన హిమవంతుడిట్లనెను (55).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


17 Oct 2021

No comments:

Post a Comment