గీతోపనిషత్తు -262
🌹. గీతోపనిషత్తు -262 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 6-1
🍀 6. రాజవిద్య -1 - నేను ఆధారముగ ఏర్పడిన సమస్త ప్రాణికోట్లకు కదలిక యున్నది. క్షరత్వమున్నది. అవస్థితులు ఉన్నవి. ఆకాశమునకు వాయువు ఆదిగా గల నాలుగు భూతముల కార్యక్రమముతో ఎట్టి సంబంధము లేదు. కాని ఆకాశము లేనిదే వానికస్థిత్వము లేదు, వ్యాపారమును లేదు. అట్లే నేనాధారముగ నేర్పడిన ప్రాణి కోట్ల హెచ్చుతగ్గులతో, ఒడుదొడుకులతో నాకెట్టి సంబంధము లేదు. నీ యందు నేను ఈశ్వరుడనై యుండుట వలన నీ చేష్టలు, నీ ప్రాణస్పందనలు నడుచు చున్నవి. నేను లేనిచో నీవు లేవు. నీ చేష్టలతో నాకు పని లేదు. ఆకాశము నుండి వాయు వేర్పడినట్లు, నానుండి నీవేర్పడినావు. 🍀
యథా కాశస్థితో నిత్యం వాయు స్సర్వత్రలో మహాన్ |
తథా సర్వాణి భూతాని మఠానీ త్యుపధారయ II 6
తాత్పర్యము : ఏ ప్రకారముగ అంతటను చరించు వాయువు ఆకాశము నందు స్థితిగొని యున్నదో, అట్లే సమస్త ప్రాణులును నా యందు స్థితిగొని యున్నవి అని తెలుసుకొనుము.
వివరణము : ఆకాశము నుండి వాయువేర్పడి అంతటను సంచరించు చున్నది. అందుండి పుట్టిన అగ్ని పోషించుట, దహించుట నిర్వర్తించు చున్నది. అగ్నినుండి పుట్టిన నీరు భూమిపై ప్రాణికోట్లను పోషించుచు నున్నది. జలములనుండి పుట్టిన భూమి ఓషధులను, ఇతర దినుసులను, కూరలు పండ్లు ఫలములు వంటి వానిని ఉత్పత్తి చేసి జీవ పోషణమునకు వినియోగపడు చున్నది.
ఇట్లు ఆకాశము నుండి వరుస క్రమమున పుట్టిన నాలుగు భూతములు సృష్టి యందు నిమగ్నమై యున్నవి. ఆకాశము వాటికి అతీతముగ నున్నది. ఆకాశము స్థిరము, నిత్యముగ నున్నది. అందుండి పుట్టిన వానికి అస్థిరత్వము, జీరత్వము ఉన్నవి. ఆకాశమెప్పుడును ఆకాశముగనే యున్నది. దానికవస్థితి లేదు. ఒకే విధముగ వెలుగుచు నుండును. కాని మిగిలిన నాలుగు భూతములకు అనంతమగు వ్యాపారము లున్నవి.
అట్లే నేను ఆధారముగ ఏర్పడిన సమస్త ప్రాణికోట్లకు కదలిక యున్నది. క్షరత్వమున్నది. అవస్థితులు ఉన్నవి. ఆకాశమునకు వాయువు ఆదిగా గల నాలుగు భూతముల కార్యక్రమముతో ఎట్టి సంబంధము లేదు. కాని ఆకాశము లేనిదే వానికస్థిత్వము లేదు, వ్యాపారమును లేదు. అట్లే నేనాధారముగ నేర్పడిన ప్రాణి కోట్ల హెచ్చుతగ్గులతో, ఒడుదొడుకులతో నాకెట్టి సంబంధము లేదు. నీ యందు నేను ఈశ్వరుడనై యుండుట వలన నీ చేష్టలు, నీ ప్రాణస్పందనలు నడుచు చున్నవి. నేను లేనిచో నీవు లేవు. నీ చేష్టలతో నాకు పని లేదు. ఆకాశము నుండి వాయు వేర్పడినట్లు, నానుండి నీవేర్పడినావు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
17 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment