గీతోపనిషత్తు -269
🌹. గీతోపనిషత్తు -269 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 9-2
🍀 9. సాక్షీభూతుడు -2 - ఈశ్వరుడు త్రిమూర్తులకు కూడ అతీతమగు తత్త్వము. త్రిమూర్తులకు కర్మ మున్నది. జ్ఞానముతో నిర్వర్తింప బడనపుడు వానిని కూడ కర్మలు బంధించును. వారు మూడు గుణములకు అధిపతులే అయినను, కాలమును దేశమును ఎరిగి, కర్తవ్య మెరిగి యథార్థముగ కర్మలు నిర్వర్తించుటచే మోక్షస్థితిలో నుందురు. అట్లే బ్రహ్మర్షులు, మహర్షులు, నారదాది యోగులును కూడ. ఈశ్వరుడు తప్ప ఇతరులందరును జ్ఞానము నాశ్రయింప వలసినదే. లేనిచో బంధము తప్పదు. ఈశ్వరుడే జ్ఞానము, జ్ఞాని. “జాని యనగా నేనే" అని ఈశ్వరుడే కృష్ణ భగవానుడిగ పలికినాడు. కనుక జీవులకు తమ యందలి ఈశ్వరుని ఆశ్రయించుటయే ఉపాయము. 🍀
నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |
ఉదాసీనవ దాసీన మసక్తం తేషు కర్మసు II 9
తాత్పర్యము : ప్రకృతి కారణముగ జీవులాచరించు కర్మల యందు నేను తగులుకొనను. తటస్థునివలె యుందును. జీవుల కర్మలు నన్ను బంధింపవు, బంధింపలేవు.
వివరణము : సూర్యుడు సాక్షీభూతుడుగనే, తటస్థుడుగనే జీవుల కార్యములను చూచుచు నుండును. ఏ కార్యము నందు అతని ప్రమేయము లేదు. అతని ప్రభావము వలన మేల్కొనిన జీవులు తమదైన చట్రములలో తమ జీవితములను బిగించుకొను చుందురు. సత్కార్యములకుగాని, దుష్కార్య ములకుగాని ప్రేరణ సూర్యుడు కాదు. జీవుల గుణ సముదాయము ప్రేరణకు కారణము.
ఒకనికి సూర్యోదయమున తినుటయందు గాని, త్రాగుట యందు గాని ఆసక్తి కలుగవచ్చును. మరియొకనికి శరీర వ్యాయామమున ఆసక్తి కలుగవచ్చును. ఇంకొకనికి తూర్పు వెలుగునకు నమస్కరింపవలె ననిపించును. ఇంకొకరికి మరల నిద్రింపవలె ననిపించును. ఇట్లెవరికేమనిపించినను అది వారి ప్రకృతికి సంబంధించినదేగాని సూర్యునికి సంబంధించినది కాదు గదా! అట్లే ఈశ్వరుడు కూడ.
మరియొక ఉదాహరణము : రాత్రి సమయమందు విద్యుత్ దీపపు కాంతితో కొందరు కూడి ముచ్చటలాడుకొన వచ్చును. లేదా గ్రంథపఠనము చేయవచ్చును. లేదా చీట్ల పేక ఆడుకొన వచ్చును. లేదా పోట్లాడుకొనవచ్చును. లేదా టెలివిజను చూడ వచ్చును. విద్యుత్ దీపమే లేనిచో కొన్ని కార్యము లుండక పోవచ్చును. దీపమున్నపుడు జరుగు వైవిధ్యమగు కార్యక్రమములతో దీపమునకు సంబంధము లేదు. అట్లే ఈశ్వరుడు. ఈశ్వరుడు త్రిమూర్తులకు కూడ అతీతమగు తత్త్వము. త్రిమూర్తులకు కర్మ మున్నది.
జ్ఞానముతో నిర్వర్తింప బడనపుడు వానిని కూడ కర్మలు బంధించును. వారు మూడు గుణములకు అధిపతులే అయినను, కాలమును దేశమును ఎరిగి, కర్తవ్య మెరిగి యథార్థముగ కర్మలు నిర్వర్తించుటచే మోక్షస్థితిలో నుందురు. అట్లే బ్రహ్మర్షులు, మహర్షులు, నారదాది యోగులును కూడ. ఈశ్వరుడు తప్ప ఇతరులందరును జ్ఞానము నాశ్రయింపవలసినదే. లేనిచో బంధము తప్పదు. ఈశ్వరుడే జ్ఞానము, జ్ఞాని. “జాని యనగా నేనే" అని ఈశ్వరుడే కృష్ణ భగవానుడిగ పలికినాడు. కనుక జీవులకు తమయందలి ఈశ్వరుని ఆశ్రయించుటయే ఉపాయము. "
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
01 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment