శ్రీ శివ మహా పురాణము - 468

🌹 . శ్రీ శివ మహా పురాణము - 468 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 33

🌻. సప్తర్షుల ఉపదేశము - 5 🌻


మేము నీకు ఉపదేశించుచున్నాము. నీవు రుద్రునకు పార్వతిని ఇమ్ము. ఓ శైలరాజా! అట్లు చేసినచో నీకు మహానందము కలుగ గలదు (53). పర్వతరాజా ! నీవు పార్వతిని ప్రీతి పూర్వకముగా శివునకు ఈయని పక్షములో, వారి వివాహము ఈ కాలములో విధిబలముచేతనే సంపన్నము కాగలదు (54).

వత్సా! శంకరుడు శివాదేవికి తపస్సు చేయుచుండగా వరమునిచ్చెను. ఈశ్వరుని ప్రతిజ్ఞ వమ్ముకాదు గదా! (55) ఈశ్వరభక్తులగు సాధువుల ప్రతిజ్ఞయై ననూ ముల్లోకములలో ఉల్లంఘింప శక్యము కానిదిగా నున్నది. ఓ పర్వతరాజా! ఈశ్వరుని ప్రతిజ్ఞ గురించి చెప్పునదేమున్నది? (56) ఇంద్రడొక్కడే అవలీలగా పర్వతముల రెక్కలను నరికెను. పార్వతి కూడ అవలీలగా మేరవునకు శృంగభంగము చేసెను (57).

ఓ పర్వతరాజా! ఒక్క వ్యక్తి కొరకై సంపదల నన్నిటినీ నాశనము చేయరాదు. కులము కొరకై ఒక వ్యక్తిని విడువవలెనని సనాతనమగు వేదము చెప్పు చున్నది (58). అనరణ్య మహారాజు బ్రాహ్మణుని వలన సంప్రాప్తమైన భయము గలవాడై తన కుమార్తెను ఆ బ్రాహ్మణునకు ఇచ్చి తన సంపదను రక్షించుకొనెను (59). నీతి శాస్త్రజ్ఞులగు జనులు, గురువులు, శ్రేష్టులగు జ్ఞాతులు బ్రాహ్మణుని శాపము వలన మిక్కిలి భయపడినవారై ఆ రాజునకు బోధించిరి (60). ఓ శైలరాజా! ఇదే విధముగా నీవు కూడా నీ కుమార్తెను శివునకు ఇచ్చి బంధువులనందరినీ రక్షించుకొనుము. మరియు దేవతలను వశము చేసుకొనుము (61).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వసిష్ఠుని ఈ మాటను విని ఆయన నవ్వి దుఃఖముతో నిండిన హృదయముతో అనరణ్యుని వృత్తాంతమును గూర్చి ప్రశ్నించెను (62).

హిమవంతుడిట్లు పలికెను-

హే బ్రహ్మన్‌ ! ఆ అనరణ్య మహారాజు జన్మించిన వంశ##మేది? ఆయన కుమార్తెను ఇచ్చి సంపదలనన్నిటినీ రక్షించుకున్న తీరు ఎట్టిది? (63)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ప్రసన్నమగు మనస్సు గల వసిష్ఠుడు పర్వతుని ఆ మాటను విని సుఖదాయకము అగు అనరణ్య చరితమును ఆ పర్వతరాజేనకు చెప్పెను (64).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో హిమవంతునకు సప్తర్షుల ఉపదేశమును వర్ణించే ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


01 Nov 2021

No comments:

Post a Comment