🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 51 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 15 🌻
ఇది, జగత్తే శాశ్వతము. ఈ జగత్తు ఎప్పటికి వుంటుంది. నేను పుట్టక ముందు నుంచీ ఈ జగత్తు వుంది, నేను పోయినాక కూడా ఈ జగత్తు వుంటుంది. కాబట్టి జగత్తు శాశ్వతము - అని నీ జననమరణాల మధ్యలో కనుక నీవు చూచుకున్నట్లయితే జగత్తు శాశ్వత లక్షణంతోనే తోచినట్లుగా కనపడుతుంది.
అంటే సాపేక్ష పద్ధతిగా చూసినప్పుడు, జగత్తు శాశ్వతముగా నీకంటే ముందు నుంచీ వున్నదిగా, నీ తరువాత కూడా వుంటున్నదిగా కనబడుతున్నప్పటికీ, జగత్తు పరిణామశీలమైనటువంటిది. నిరంతరాయం మార్పు చెందుతూ వున్నటువంటిది. అస్థిరమైనటువంటిది. అశాశ్వతమైనటువంటిది. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆత్మవస్తువును గ్రహించటానికి వస్తునిశ్చయజ్ఞానం అవసరం.
ఇటువంటి వస్తునిశ్చయజ్ఞానం ఏదైతే వుందో, అట్టి వస్తునిశ్చయజ్ఞానం చేత జగత్తుయొక్క అశాశ్వతత్వమును, ఆత్మయొక్క శాశ్వతత్వమును గుర్తించిన వాళ్ళు ఎవరైతే వున్నారో.... వాళ్ళు మాత్రమే ఆత్మనిష్ఠులు కాగలుగుతారు.
కాబట్టి ఇక్కడ నచికేతుడు, జగత్తు యొక్క అశాశ్వతత్వమును బాగుగా గుర్తించినటువంటి వాడుగా మనకి యమధర్మరాజు గారు మాట్లాడే సందర్భంలో కనబడుతున్నారు.
ఇంకేమిటట? సాత్విక కర్మల ప్రభావం చేత కలిగేటటుంవంటి పుణ్యవశం చేత, కొన్ని భోగములు లభిస్తాయి సూక్ష్మశరీరానికి, స్థూలశరీరానికి కూడా! కాబట్టి, అవి ఎటువంటివి అట? క్రతువల వలన కలిగెడి ఫలము ఎంతటి విశాలమైనదైననూ అనేక రకాలైనటువంటి క్రతువులు చేస్తూవుంటాం మానవులం.
ఆ యా క్రతువుల యొక్క ఫలితములన్నీ దానము, ధర్మము, యజ్ఞము, తీర్థయాత్ర, సాత్విక కర్మాచరణ.... ఇవన్నీ కూడా పుణ్యఫలములన్నమాట.
ఈ పుణ్యఫలములు అనుభవించేటప్పడు, నీకు ఆ ఐశ్వర్యం సమకూరినట్లు, సుఖభోగాలను అనుభవించినట్లు స్థూలంలో నీకు కనబడుతూ వుంటుంది. ఇంకేమిటి అంటే... అప్పుడు ఆ పుణ్యం ఖర్చు అయిపోతూ వుంటుందన్నమాట.
అట్లాగే, నీకు దుఃఖ కాలం, కష్టకాలం వచ్చినప్పుడు పాపం అనేటటువంటి కర్మ ఖర్చు అయిపోతూ వుంటుంది. కాబట్టి, తన సుఖమే పుణ్యము, తన దుఃఖమే పాపము. ఇంకా వేరే ఏమీ లేదు. పాపాయ పరపీడనం. వేరే ఏమీ లేదు. పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం.
ఇతరులకు ఉపకారమొనర్చడానికి నువ్వు చేసినటువంటి శ్రమ, శ్రద్ధ, ఇచ్ఛ ఏదైతే వుంటుందో అదంతా పుణ్యఫలంగా మారుతుంది.
ఇతరులకు నిరసించినటువంటిది, నిందించినటువంటిది, ఆపత్కాలంలో సహాయం చేయనటువంటి ఇతరత్రా సమస్యలు ఏవైతే వుంటాయో, చేయగలిగి వుండి చేయలేనటువంటి ధర్మరీత్యా భంగం ఏదైతే వుంటుందో అదంతా కూడా, ఆ ధర్మలోపం అంతా కూడా అధర్మాచరణగా, పాపంగా పరిగణించబడుతుంది. దాని ఫలమేమిటి? అనంటే, ప్రకృతి దాని ఫలాన్ని నీకు ఏదో కష్టం రూపంలో అందించేస్తుంది. ఆరకంగా రెండూ ఖర్చు అయిపోతూనే వుంటాయి.
కానీ సాధకుడు ఎలా వుండాలయ్యా? అనంటే ఈ పుణ్యపాపములను రెండింటినీ సాక్షిగా చూడగలిగేటటువంటి స్థితిలోకి ఎదగాలి. అలా ఎదిగినవాడు మాత్రమే, ద్వంద్వాతీతము... సుఖదుఃఖాలకు, పుణ్యపాపములకు, రాత్రి పగలుకు అనేక రకములైన ద్వంద్వాలున్నాయి.
ఇట్లాగ... ఈ రెండు రెండు జ్ఞాన అజ్ఞానములు, వీటన్నిటికీ అతీతంగా వుండేటటువంటి సాక్షిత్వ చైతన్య స్థితిలోకి మానవుడు ఎదగాలి. అలా ఎదగాలి అంటే, క్రతువుల వలన కలిగేటటువంటి, ఇహమందు రాజ్యాధిపత్యము, పరమందు హిరణ్యగర్భ పదవి... ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
11.Sep.2020
No comments:
Post a Comment