శ్రీ శివ మహా పురాణము - 221


🌹 .   శ్రీ శివ మహా పురాణము - 221  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

48. అధ్యాయము - 3

🌻. కామశాపానుగ్రహములు - 6 🌻

బ్రహ్మాణం మాముహచేదం సదక్షాదిసుతం మునే | శృణ్వతాం పితృసంఘానాం సంధ్యాయాశ్చ విగర్వధీః || 67

ఓ మహర్షీ! దక్షుడు మొదలగు కుమారులతో కూడియున్న బ్రహ్మతో (నాతో) గర్వము తొలగిన బుద్ధిగల కాముడు, పితృదేవతలు, సంధ్య వింటూ ఉండగా, ఇట్లు పలికెను (67).

కామ ఉవాచ |

కిమర్ధం భవతా బ్రహ్మన్‌ శప్తోహమతి దారుణమ్‌ |అనాగస్తవ లోకేశ న్యాయ్యమార్గనుసారిణః || 68
త్వయా చోక్తం ను మత్కర్మ యత్తద్బ్రహ్మన్‌ కృతం మయా | తత్ర యోగ్యోన శాపో మే యతో నాన్యత్‌ కృతం మయా || 69
అహం విష్ణుస్తథా శంభుస్సర్వే త్వచ్ఛరగోచరాః |ఇతి యద్భవతా ప్రోక్తం తన్మయాపి పరీక్షితమ్‌ || 70
నాపరాధో మమాప్యత్ర బ్రహ్మన్మయి నిరాగసి | దారుణస్సమయశ్చైవ శాపో దేవ జగత్పతే || 71

ఓ బ్రహ్మా! నీవు నన్ను మిక్కిలి దారుణముగా శపించుటకు కారణమేమి ? ఓ లోక ప్రభూ! నీవు చేయు పనులు పాపరహితములు, న్యాయ్యామార్గమును అనుసరించునవి అయి ఉండును (68).

నేను చేయవలసిన పనిని నీవు నిర్దేశించితివి. ఏ బ్రహ్మా! నేను దానినే చేసితిని. ఆ విషయములో నాకు శాపము నీయదగదు. నేను నీవు చెప్పిన దానికంటె భిన్నమగు పనిని చేయలేదు (69).

నేను, విష్ణువు, శంభుడు, అందరు నీ బాణములకు వశులగుదురు అని నీవు చెప్పిన మాటను మాత్రమే నేను పరీక్షించితిని (70).

ఓ బ్రహ్మా! దీనిలో నా అపరాధము లేదు. ఓ దేవా! జగత్ర్పభూ! తప్పును చేయని నాకు దారుణమగు శాపమునిచ్చితివి (71).

బ్రహ్మో వాచ |

ఇతి తస్య వచశ్ర్శుత్వా బ్రహ్మాహం జగతాం పతిః| ప్రత్యవోచం యతాత్మనం మదనం దమయన్ముహుః || 72
ఆత్మజా మమ సంధ్యేయం యస్మాదేతత్స కామతః | లక్ష్మీకృతోSహం భవతా తతశ్శాపో మయా కృతః || 73
అధునా శాంతరోషోsహం త్వాం వదామి మనోభవ | శృణుష్వ గత సందేహస్సుఖీ భవ భయం త్య జ || 74
త్వం భస్మ భూత్వా మదన భర్గలోచన వహ్నినా | తథైవాశు సమం పశ్చా చ్ఛరీరం ప్రాపయిష్యతి || 75
యదా కరిష్యతి హరోంజసా దారపరిగ్రహమ్‌ | తదా స ఏవ భవతశ్శరీరం ప్రాపయిష్యతి || 76

బ్రహ్మ ఇట్లు పలికెను -

మన్మథుని ఈ మాటలను విని, జగత్ర్పభువు బ్రహ్మ అగు నేను ఆత్మ నియంత్రణము గల మన్మథుని అనేక పర్యాయములు నిగ్రహించి ఇట్లు బదులిడితిని (72).

ఈ సంధ్య నాకు కుమార్తె. నేను ఈమె యందు కామవికారమును పొందునట్లు నీవు నన్ను నీ బాణములకు లక్ష్యము చేసితివి. అందువలననే , నేను శాపమునిచ్చితిని (73).

ఇపుడు నా కోపము తగ్గినది. ఓ మన్మథా! నేను చెప్పు మాటలను వినుము. నీ సందేహములు తొలగును. నీవు సుఖివి కమ్ము. భయమును వీడుము (74).

మన్మథా! శివుని నేత్రము నుండి వచ్చిన అగ్ని నిన్ను భస్మము చేయును. ఆ తరువాత నీవు శీఘ్రముగా మరల శరీరమును పొందగలవు (75).

శివుడు తన ఇచ్ఛచే భార్యను స్వీకరించి, ఆయనయే నీకు శరీరము కలుగునట్లు చేయగలడు (76).

ఏవ ముక్త్వాథ మదనమహం లోకపితామహః | అంతర్దధే మునీంద్రాణాం మానసానాం ప్రపశ్యతామ్‌ || 77
ఇత్యేవం మే వచశ్ర్శుత్వా మదనస్తేSపి మానసాః | సంబభూవుస్సుతాస్సర్వే సుఖినోsరం గృహం గతాః || 78

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కామశాపానుగ్రహో నామ తృతీయోsధ్యాయః (3).

లోకపితామహుడనగు నేను మునీశ్వరులు, మానసపుత్రులు చూచుచుండగా, ఇట్లు పలికి అంతర్ధానమును చెందితిని (77).

ఈ నామాటలను విని, మన్మథుడు, మరియు మానసపుత్రులు అందరు సుఖమును పొంది, శీఘ్రమే గృహములకు వెడలిరి (78).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీ ఖండములో కామశాపానుగ్రహములనే మూడవ అధ్యాయము ముగిసినది (3).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

11.Sep.2020

No comments:

Post a Comment