🌹 28. గీతోపనిషత్తు - స్థిర చిత్తము - మానవుడు లోక అవసరమును బట్టి బహిర్గతుడగుట, అవసరము లేనపుడు అంతర్గతుడగుట తాబేలు వలే నేర్చు కొనవలెను. 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 58 📚వల్ల
యదా సంహరతే చాయం కూర్మోஉంగానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రఙ్ఞా ప్రతిష్ఠితా || 58 ||
తాబేలు ఆధ్యాత్మిక సాధకునకు చక్కని సందేశ మిచ్చుచున్నది.
పరిస్థితులను బట్టి తాబేలు తన సర్వాంగములను తనలోనికి ఉపసంహరించుకొని అనుకూల పరిస్థితులు ఏర్పడి నపుడు మరల అంగములను విస్తరించును. పురోగమనము, తిరోగమనము తెలిసిన ప్రజ్ఞ- తాబేలు ప్రజ్ఞ.
మానవుడు కూడ నట్లే పురోగమనము, తిరోగమనము తెలిసి యుండవలెను. కాలము, దేశము ననుసరించి అనుకూల సమయమున మనస్సు, ఇంద్రియములు, శరీరమును ఉపకరణములుగ బహిర్గతుడవ వలెను. కర్తవ్యము నిర్దేశింపబడని సమయములందు అంతర్గతుడవ వలెను. అవసరమును బట్టి బహిర్గతుడగుట, అవసరము లేనపుడు అంతర్గతుడగుట నేర్చు కొనవలెను.
ఇంద్రియార్థముల వెంటబడు ఇంద్రియ ప్రజ్ఞను ఉపసంహరించుకొనుట వలననే చిత్తము స్థిరమగును. ఇచట దోషము ఇంద్రియముల యందు లేదు. సాధకుని యందే యున్నది.
సాధకుడు తిరోగమనమును సంకల్పించినంతనే ఇంద్రియముల నుండి, మనస్సు నుండి, బుద్ధిలోనికి ప్రజ్ఞ మరలగలదు. అట్లు మరల్చుకొనుటకు దైవచింతన చక్కని ఉపాయము. దైవస్మరణమున నిలచినచో ఇంద్రియార్థముల వెంట ఇంద్రియములు పరుగెత్తవు.
అపుడు ప్రజ్ఞ చంచలము గాక నిలచును. కర్తవ్యమును బట్టి ప్రజ్ఞను బహిర్ముఖము చేయవచ్చును. ఈ కారణముగ తాబేలు బొమ్మను చూచుట- పై సందేశమును గుర్తు తెచ్చుకొనుట సాధకునకు ఉపకరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
11.Sep.2020
No comments:
Post a Comment