🌹. నారద భక్తి సూత్రాలు - 91 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
చతుర్ధాధ్యాయం - సూత్రము - 62
🌻 62. న తల్సిద్దా లోక వ్యవహారో హేయః కింతు ఫలత్యాగః తత్సాధనం చ (కార్యమేవ) || 🌻
భక్తి సిద్ధించాలంటే లోక వ్యవహారం మానాలా ? మానేస్తే ఎలా కుదురుతుంది ? భక్తి సాధన దశలోగాని, భక్తి సిద్ధించిన తరువాత గాని భక్తుడు లోక వ్యవహారం మానవలసిన అవసరం లేదు. సమస్త శుభ కర్మలను చేసూ ఆ కర్మల ఫలితాన్ని భగవదర్పణ చెస్తూ జీవించవచ్చును.
అశుభ కర్మలు చేయడు. ఇతర అత్యవసర కర్మలు చేయక తప్పునప్పుడు భక్త ప్రహ్లాదునివలె, ఏ పని చెస్తున్నా శ్రీహరి స్మరణను వదలక ఉండును. చేసే పని తనకోసం కాదన్నట్లు, తన పనే అయినప్పటికీ, తానొక పని మనిషిగా ఎవరికో చెసి పెట్టినట్లు చేస్తాడు. యజమానిగా భావించడు.
ధనం విషయంలో అది తన కోసమే అయినప్పటికీ, ఎవరి కోసమో అన్నట్లు బ్యాంకు క్యాషియరు వ్యవహరించినట్లు చేస్తారు. గుడి నిర్మాణానికి ట్రస్ట్ వలే, తన పనులకు యజమాని భావన లేకుండా చేస్తాడు. దేనికి స్వతంత్రించడు. “ఒక పని అయిపోయింది” అని అనుకుని ఆ పనిని తలచడు. చెయ్యబోయె పని, మీద పడినట్లుగా భావించి చేస్తాడు. అంత వరకు తలచనే తలచడు.
అసంకల్పిత ప్రతీకార చర్యగా అన్ని పనులూ చేసుకుంటూ పోతాడు. ఎప్పుటి పనికి అప్పుడు క్షణంలో సిద్ధమవుతాడు గాని, ముందస్తు ఆలోచన ఉండదు. భగవచ్చింతనలో ఉంటూ చేసే పనుల్లో పొరపాట్లు కూడా చేయడు.
కర్మను భగవదర్పితంగా చేస్తాడు. కనుక కర్మ ఫలితం తనకు అంటదు. నేను, నాది అనే వాటిని జ్ఞాన మార్గ సాధనలో త్యాగం చేయడం కష్టమేమో గాని, భక్తి సాధకుని విషయంలో మాత్రం భగవదర్పణగా చెస్తాడు గనుక, అది సులభ సాధ్యమవుతుంది.
సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత
కుర్యా ద్విద్వాంస్తథాసక్తః చికిర్చుర్లోకసంగ్రహమ్ ॥
- (3:25) భగవద్దిత
అజ్ఞానులు కర్మలందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా, విద్వాంసులు (అనగా ముఖ్యభక్తులు, జీవన్ముక్తులు, భాగవతోత్తములు, సద్దురువులు, ఆచార్యులు మొదలగువారు) కూడా లోక హితార్థం ఆసక్తి రహితంగా కర్మలను ఆచరిస్తారు. వారి కోసమై వారేమి చేయరు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ
11.Sep.2020
No comments:
Post a Comment