గీతోపనిషత్తు - 45






🌹.   గీతోపనిషత్తు - 45   🌹

🍀 45. ఉపదేశము - యజ్ఞములు చేయుచు వృద్ధిని పొందుడు.” బ్రహ్మదేవుడు యజ్ఞమును చేసి వృద్ధిని పొంది ముక్తుడుగా దైవమందు నిలచినాడు. మీరును అట్లే యజ్ఞార్థముగా జీవించుచు నా వలెనే వృద్ధి పొందుడు అని ఉపదేశమిచ్చినాడు. 🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.   కర్మయోగము - 10     📚

సహ యజ్ఞా: ప్రజా స్పృష్ట్యా పురోవాచ ప్రజాపతిః |

అనేన ప్రసవిష్యధ్వ మేష వో? స్విష్టకామధుక్ || 10

యజేన ప్రసవిష్యధ్వం :

బ్రహ్మదేవుడు సృష్టించినపుడు జీవులు, లోకములు, లోక పాలకులు ఏర్పడిరి. అవ్యక్తమైన తత్త్వము నుండి బ్రహ్మదేవుడు వాహికగ సమస్తము కొనిరాబడినది. బ్రహ్మదేవుడు పై కార్యమెందులకు చేసినాడు? దాని వలన అతనికేమి ప్రయోజనము? వ్యక్తి గతముగ ఏ ప్రయోజనము లేదు.

సృష్టి నిర్మాణము ఒక బృహత్తర పథకము. అట్టి కార్యములు నిర్వర్తించుట వలన బ్రహ్మదేవునకు ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనము లేదు. చతుర్ముఖ బ్రహ్మ స్థితికి (అస్తిత్వమునకు) కారణము సంకల్పము. సంకల్పము అవ్యక్తమగు బ్రహ్మమునుండి పుట్టి బ్రహ్మ నేర్పరచుకొన్నది.

ఆ సంకల్పము ననుసరించి బ్రహ్మదేవు నేర్పరచుకొని అతని నుండి కోటానుకోట్ల జీవులుగాను, సప్తలోకములుగాను, అందలి అంతర్లోకములుగాను, లోకపాలకులుగాను, ప్రకృతి శక్తులుగాను, కాలము దేశములుగాను, శబ్దముగాను వర్ణముగాను, అంకెలుగాను, రూపములు గాను ఏర్పడినది. ఆ దివ్యసంకల్పమును అనుసరించి వ్యక్తిగత ప్రయోజనములను చూడక అత్యంత బాధ్యతాయుతమైనటు వంటి కార్యమును బ్రహ్మదేవుడు నిర్వర్తించినాడు.

అందు బ్రహ్మ దేవునకు ఎట్టి కామము లేదు. సంగము లేదు. మోహము లేదు. లోభముగూడ లేదు. ఇట్లు నిర్వర్తించు కార్యమునే యజ్ఞ మనిరి. పై విధముగ నిర్వర్తించుటచే సమస్త సృష్టికిని చతుర్ముఖ బ్రహ్మ

ఆరాధ్యుడైనాడు. అట్టి బ్రహ్మ చేసిన ఉపదేశమొకటి గలదు.

అదియే "యజేన ప్రసవిష్యధ్వం" అనగా "యజ్ఞములు చేయుచు వృద్ధిని పొందుడు.” బ్రహ్మదేవుడు యజ్ఞమును చేసి వృద్ధిని పొంది ముక్తుడుగా

దైవమందు నిలచినాడు. మీరును అట్లే యజ్ఞార్థముగా జీవించుచు నా వలెనే వృద్ధి పొందుడు అని ఉపదేశమిచ్చినాడు.

బుద్ధిమంతులైన వారు ఈ విషయమును గ్రహించి తదనుగుణ్యముగ జీవితమును క్రమశః మలచుకొనవలెను. తాను నిర్వర్తించి తద్వారా వృద్ధి పొంది అనుభవ పూర్వకముగ అందించిన ఉపదేశమిది. సృష్టికి చతుర్ముఖ బ్రహ్మ ప్రథమస్థానమున నుండుట కిదియే ఉపాయము.

కావున యజ్ఞార్థ కర్మము మనసునకు పట్టునట్లుగ అవగాహన చేసుకొనవలెను. అటుపై ఆచరించవలెను. అట్లు కానిచో బంధములు తప్పవు. (3-10)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


05 Oct 2020

No comments:

Post a Comment