శ్రీ శివ మహా పురాణము - 239



🌹 .   శ్రీ శివ మహా పురాణము - 239   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

53. అధ్యాయము - 8

🌻. వసంతుడు - 2 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

హరి లక్ష్మితో, లక్ష్మి హరితో, రాత్రి చంద్రునితో, చంద్రుడు రాత్రితో ప్రకాశించినట్లుగా (25),

మీరిద్దరు కూడా అటులనే శోభిల్లుచున్నారు. మీ దాంపత్యము శ్లాఘనీయము. కావున నీవు ఈ జగత్తునకు అధినాయకుడవు కాగలవు (26).

హే వత్సా! నీవు జగత్తునకు మేలుగోరి, శివుని మోహింపజేసి, ఆయన ప్రనన్నమగు మనస్సుతో భార్యను శీఘ్రముగా స్వీకరించునట్లు చేయుము (27).

శివుడు ఏకాంతమైన సుందరప్రదేశమునకు గాని, పర్వతమునకు గాని, సరస్సునకు గాని, ఇతర స్థలములకు గాని ఎచటకు వెళ్లిననూ, నీవు ఈమెతో కూడి వెంబడించుము (28).

ఆత్మనిగ్రహము కల్గి స్త్రీ విముఖుడైయున్న ఈ శివునినీవు మోహింపజేయుము. ఆయనను మోహింపజేయగల వ్యక్తి నీవు తక్క మరియొకరు లేరు (29).

హే మన్మథా! శివుడు అనురాగము కలవాడైనచో, నీశాపమునకు కూడ ఉపశాంతి కలుగును. కావున, నీవు నీ హితమును గోరి అట్లు చేయుము (30).

మహేశ్వరుడు దయాళువగు దైవము. ఆయన ఒక సుందరి యందు అనురాగమును పొందినచో, నిన్ను గూడ తరింపజేయగలడు (31).

కావున, నీవు భార్యతో గూడి శివుని మోహింపజేయుటకై యత్నించుము. మహేశ్వరుని మోహింపజేసి, నీవు జగత్తునకు నాయకుడవు కమ్ము (32).

జగత్ర్పభువు, తండ్రియగు నా ఈ మాటలను విని మన్మథుడు నాతో ఈ సత్యవాక్యమును పలికెను (33).

మన్మథుడిట్లు పలికెను -

హే విభో! నీ మాటను బట్టి నేను శంభుని మోహింపజేసెదను. కాని, నా మహాస్త్రము స్త్రీ. కాన, హే భగవన్‌! ,అట్టి స్త్రీని సృష్టింపుము (34).

నేను ముందుగా శంభుని మోహింపజేసిన తరువాత ఆమె ఆయనను మరల మోహింపజేయ వలయును. హే బ్రహ్మన్‌! కావున ఇపుడీ విషయములో చక్కని ఉపాయమును చేయుము (35).

బ్రహ్మ ఇట్లు పలికెను -

మన్మథుడు ఇట్లు పలుకగా, ప్రజాపతియగు నేను 'ఈ శివుని సమ్మోహింపజేయగల స్త్రీ ఎవరు గలరు?' అను చింతను పొందితిని (36).

ఇట్లు చింతిల్లు చున్న నాయొక్క నిశ్శ్వాసనుండి వసంతుడు పుట్టెను. అతడు పుష్పమాలలచే అలంకరింపబడి (37),

ఎర్రని పద్మము వలె భాసించెను. ఆతని కన్నులు వికసించిన పద్మముల వలె నుండెను అందమగు ముక్కు గల ఆతడు సంధ్యా కాలముందు ఉదయించిన పూర్ణ చంద్రుని వంటి ముఖమును కలిగియుండెను (38).

ఆతని పాదముల క్రింద ధనస్సు ఆకారముగల రేఖలు ఉండెను. ఆతని శిరోజములు నల్లగా వంకరలు తిరిగి యుండెను. సంధ్యాకాలమందలి సూర్యుని వలె నున్న అతని ముఖము రెండు కుండలములతో అలంకరింపబడెను (39).

బలిసిన పొడవైన బాహువులు, ఎతైన భూజములు గల ఆతడు మదించిన ఏనుగువలె మందగమనమును కలిగి యుండెను. ఆతని మెడ శంఖమును పోలి యుండెను. అతని వక్షస్థ్సలము మిక్కిలి విశాలముగ నుండెను. ఆతని ముఖము మంచి ఆరోగ్యముతో భాసిల్లెను (40).

సర్వాంగ సుందరుడు, శ్యామవర్ణము కలవాడు, సర్వలక్షణములతో సంపూర్ణమైనవాడు, మిక్కిలి సుందరుడునగు ఆతడు అందరిని మోహింపజేయుచూ, కామమును వృద్ధి పొందించును (41).

పుష్పములకు ఆశ్రయమగు ఇట్టి వసంతుడు, పుట్టగానే, సుగంధభరితమగు వాయువు వీచెను. చెట్లన్నియూ పుష్పములతో నిండెను (42).

మధురమగు శబ్దమును చేసే వందలాది కోయిలలు పంచమస్వరముతో కూడినవి. స్వచ్ఛమగు నీటితో కూడిన సరస్సులలో పద్మములు వికసించెను (43).

అట్టి ఉత్తముడగు వసంతుని పుట్టుకనుచూడగానే, హిరణ్యగర్భుడనగు నేను మదనునితో మధురమగు ఈ మాటను పలికితిని (44).

హే మన్మథా! నీతో సమానమైన ఈతడు నీకు తోడుగా నుండి సర్వమును నీకు అనుకూలముగా చేయగలడు (45).

అగ్నికి వాయువు సర్వత్రా మిత్రుడై ఉపకరించు తీరున, ఈతడు నీకు మిత్రుడై సదా నిన్ను అనుసరించి ఉండగలడు (46).

ప్రసన్న చిత్తుల ప్రసన్నతను అంతమొందించువాడు గనుక ఈతనికి వసంతుడను పేరు కలుగుగాక! సర్వదా నిన్ను అనుసరిస్తూ లోకములను రంజింపజేయుట ఈతని కర్తవ్యము (47).

ఈ వసంతుడు, వసంతకాలములో నుండే మలయవాయువు సదా నీకు వశవర్తులై నీయందు స్నేహభావమును కలిగియుందురు (48).

భావ ప్రకటనము, హావభావములు, అరువది నాలుగు కళలు మొదలగునవి కూడ నీకు సహకరించును. వీరు నీకు స్నేహితులైనట్లే రతికి కూడా స్నేహితులుగ నుండగలరు (49).

ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సతీ చరిత్రే ద్వితీయే సతీఖండే వసంత స్వరూపవర్ణనం నామాష్టమోsధ్యాయః (8).

హే మన్మథా! నీవు వసంతుడు మొదలగు సహచరులతో, మరియు రతీదేవితో గూడినవాడవై ఈ గొప్ప కార్యమును ఉత్సాహముతో చేపట్టి మహాదేవుని మోహింపజేయుము (50).

వత్సా! హరుని మోహింప జేయగల సుందరిని గూర్చి బాగుగా ఆలోచించి ప్రయత్నపూర్వకముగా సృష్టించగలను (51).

దేవనాయకుడనగు నేను ఇట్లు పలుకగా, కాముడు చాల సంతసించి, భార్యతో గూడి అపుడు నా పాదములకు నమస్కరించెను (52).

మన్మథుడు దక్షునకు, ఇతర బ్రహ్మమానసపుత్రులందరికీ నమస్కరించి, శంభుడు వెళ్లిన స్థానమునకు పయనమయ్యెను (53).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో వసంతస్వరూపవర్ణనమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణం


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


05 Oct 2020


No comments:

Post a Comment