✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -19 🌻
పగ్గములను తన చేతిలో దృఢముగా నుంచుకొను సారధి, గుర్రములను తన వశమందు ఉంచుకుని, రధమును సక్రమమార్గమున నడిపి, సుఖముగా గమ్యస్థానము చేర్చునటులనే, విజ్ఞానవంతుడు నిశ్చలమైన బుద్ధితో మనస్సును నిగ్రహించి, ఇంద్రియములను విషయాదులనుండి మరలించి, జనన మరణ రహిత, గమ్యస్థానమైన పరమాత్మను చేర్చును. అతనికి పునర్జన్మలేదు.
ఇది ఒక ఆశీర్వచన వాక్యం. ఎవరైతే పరమాత్మస్థితిని తెలుసుకున్నారో, వారికి పునర్జన్మ లేదు. అనేటటువంటి ఆశీర్వచన వాక్యాన్ని చెబుతున్నారు. ఎవరైతే ఈ ఆత్మానుభూతిని, ఎవరైతే ఈ బ్రహ్మనిష్ఠను, ఎవరైతే ఈ పరబ్రహ్మనిర్ణయాన్ని పొందారో, వారికి పునర్జన్మలేదు. వారు ఈ శరీరమనే రధాన్ని సరియైన రీతిగా వినియోగించుకున్నటువంటి వారు.
వారు పగ్గములను తమ చేతిలో, దృఢముగా పట్టుకున్నవారు. మనసు అనేటటువంటి దానిని తమ చేతిలో స్వాధీనపరచు కున్నటువంటి వారు. గుర్రాలను, ఇంద్రియములను తమ వశమున ఒనర్చుకున్నవారు. వాటిని వాటి ఇష్టం వచ్చినట్లు పోనివ్వకుండా, సరియైన మార్గంలో నడిపేటటువంటి వారు.
ఇంద్రియములను ఇంద్రియార్థములలోకి, ప్రవేశింపనీయక విషయములందు, ఆశపడనీయక, ఆసక్తిని పొందనీయక సంగత్వ దోషాన్ని పొందనీయక, సంతృప్తి అసంతృప్తులకు పొంగక, కుంగక సమత్వబుద్ధితో, భేద బుద్ధి లేకుండా సరియైనటువంటి మార్గములో ప్రయాణము చేసి, విజ్ఞానవంతుడై, నిశ్చలమైనటువంటి బుద్ధితో, మనస్సుని నిగ్రహించి, ఇంద్రియాదులను విషయాదులనుండి మరలించి, తన స్వస్థానమైనటువంటి, తన స్వరూపజ్ఞానాన్ని పొందుతున్నాడు. అలా పొందినటువంటి వారికి పునర్జన్మ లేదు. అనేటటువంటి ఆశీర్వచన వాక్యంతో, ఈ నాటి ప్రసంగాన్ని విరమిస్తూ ...
పగ్గములను తన చేతిలో దృఢముగా నుంచుకొను సారధి గుర్రములను తన వశమునందుంచుకుని, రథమును సక్రమ మార్గమున నడిపి, సుఖముగా గమ్యస్థానము చేర్చునటులనే, విజ్ఞానవంతుడు నిశ్చలమైన బుద్ధితో, మనస్సును నిగ్రహించి ఇంద్రియములను విషయాదుల నుండి మరలించి జనన మరణ రహిత గమ్యస్థానమైన పరమాత్మను చేర్చును. అతనికి పునర్జన్మ లేదు.
ఉఁ... ఇప్పటి వరకూ చెప్పనటువంటి సాధనా విధిని కొనసాగిస్తూ ఉన్నారు. శరీరము రథము వంటిది. ఆత్మ రధికుడు, బుద్ధి సారధి, మనస్సను పగ్గాలు, ఇంద్రియములు గుర్రాలు. వీటిని జాగ్రత్తగా పరిగెత్తించాలి. ఏ దిశగా పరిగెత్తించాలి? ఇప్పటి వరకూ చెప్పిన నాలుగు వాక్యాలలో ముఖ్యమైనటువంటివి రెండు పదాలున్నాయి. ‘విజ్ఞానవంతుడు’ - మనం ఎలా ఉండాలట మానవుడనేవాడు? విజ్ఞానవంతుడుగా ఉండాలి. విజ్ఞానవంతుడని ఎవరిని అంటాం? అంటే, నిశ్చలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే విజ్ఞానవంతులౌతారు.
బుద్ధి చంచలంగా ఉందనుకోండి, రజోగుణ ధర్మంతోటి, తమోగుణ ధర్మంతోటి.... తమోగుణ ధర్మంతో ఉన్నప్పుడేమో, జడ స్వరూపంగా ఉంటాము. మందకొడిగా ఉంటాడు. రజోగుణ ధర్మంగా ఉన్నప్పుడు విక్షేప శక్తితో కూడుకుని చంచలంగా ఉంటాడు. సత్వగుణమైనటువంటి సాత్విక శక్తితో కూడుకుని ఉన్నప్పుడు ఆ చంచలమంతా ఉడిగిపోతుందున్నమాట. ఉడిగిపోయి నిశ్చలంగా ఉంటాడు. స్థిరంగా ఉంటాడు. ఆ స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే మనస్సును నిగ్రహించగలుగుతారు.
మనో నిగ్రహోపాయం గురించి ఆలోచించాలి అంటేనే నువ్వు బుద్ధి పరిధిలో ఉండాలి. సత్వగుణ పరిధిలో ఉండాలి. ఆ వివేకాన్ని నువ్వు సంపాదిస్తే తప్ప, ఏ గుణధర్మం ద్వారా నీలో, ఏ రకమైనటువంటి చంచల స్వభావం కలుగుతోందో, నువ్వు గుర్తించి విరమించితే తప్ప, నీవు బుద్ధి పరిధిలో స్థిరంగా ఉండలేవు.
బుద్ధి పరిధిలో స్థిరంగా ఉంటే కానీ, నువ్వు ఇంద్రియాలనే గుర్రాలని ఏ మార్గంలో నువ్వు సరిగ్గా ప్రయాణింపచేయాలి అనేటువంటిది నీవు సరిగ్గా గుర్తించలేవు. అందుకని పెద్దలు ఏం చెప్పారంటే, భారతీయుల అందరి ఇళ్ళల్లో శ్రీ కృష్ణుడు రథసారధిగా, అర్జునుడు రథమును అధివసించినటువంటి ఫోటో అది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాలి. విజయసారధి అయిన ఆ ఫోటో గీతాబోధ చెప్పేటటువంటి ఫోటో.
ఈ ఫోటో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాలి అంటారు. కారణం ఏమిటంటే ఈ ఆత్మోపదేశాన్ని, ఈ రధాన్ని ఉపమానంగా చేసుకుని చెప్పారు అన్నమాట ఇక్కడ. పరమాత్మయే అక్కడ సారధిగా వ్యవహరించారు. అందువల్ల అర్జునుడికి విజయం వరించడంలో పెద్ద విశేషమేమీ లేదు.
అట్లాగే మనం కూడా బుద్ధి... నిశ్చల బుద్ధిని, సారధిగా గనుక పెట్టుకున్నట్లయితే, అది పరమాత్మ వైపు, జనన మరణ రాహిత్యం వైపు, మోక్షం వైపు, ముక్తి వైపు, మనల్ని నడిపిస్తుంది. అదే చంచలబుద్ధి గనుక ఉన్నట్లయితే, ఇంద్రియములను, ఇంద్రియార్థములైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాల వైపు పరిగెత్తిస్తుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
30 Oct 2020
No comments:
Post a Comment