🌹 . శ్రీ శివ మహా పురాణము - 260 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
61. అధ్యాయము - 16
🌻.విష్ణువు, బ్రహ్మ శివుని స్తుతించుట - 2 🌻
హే స్వామిన్! సృష్టిని చేసి నేను, స్థితిని చేసి విష్ణువు నీ ఆజ్ఞను పాలించినాము. శివుడే స్వయముగా నీ రూపముతో ఆవిర్భవించి లయకర్త అగుచున్నాడు (24). నీతోడు లేనిదే మేమిద్దరము మాకర్తవ్యములను నెరవేర్చ జాలము. కావున, నీవు జగత్కార్యమును నిర్వర్తించుటకై ఒక సుందరిని భార్యగా స్వీకరించుము (25).
ఈశ్వరుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్!ఓ హరీ! మీరిద్దరు నాకు ఎల్లవేళలా మిక్కిలి ప్రియమైన వారు గదా! నిన్ను చూచినప్పుడు నాకు గొప్ప ఆనందము కలుగును (28). మీరిద్దరు దేవతలలో ప్రముఖులు, ముల్లోకములకు ప్రభువులు. జగత్కార్యమునందు లగ్నమైనన మనస్సు గల మీరు చెప్పిన మాట చాల యోగ్యమైనది (29).
దేవతాశ్రేష్ఠులారా! నాకు వివాహము ఉచితము కాదు. నేను తపోనిష్ఠుడను. విరాగిని. సర్వదా యోగమార్గమునందుండు వాడను (30). నేను పవిత్రమైన నివృత్తి మార్గములో నిర్వికారముగా నాయందు నేను రమించుచూ ఉన్నవాడను. జ్ఞానినగు నా రూపము అవధూతను పోలియుండును. నాకు కామములు లేవు. నేను ఆత్మాలోకన పరుడను (31).
నేను వికారములు లేని వాడను, భోగముల అక్కర లేనివాడను, నేను సర్వదా అశుభ్ర అమంగళ వేషమును ధరించువాడను. అట్టి నాకిపుడు ఈ లోకములో భార్యతో నేమి ప్రయోజనము గలదో చెప్పుము (32). నిత్యయోగ నిష్ఠుడనగు నాకు ఆనందము నిత్యముగనుండును గదా! జ్ఞాన విహీనుడైన పురుషుడైతే అనేక కోర్కెలను మనస్సులో భావించుచుండును (33).
లోకములో వివాహమును చేసుకొనుట ఇతరుల బంధములో చిక్కుకొనుటయేనని తెలియవలెను. కావున నాకు వివాహమునందు రుచి లేదు. నేను ముమ్మాటికీ సత్యమును పలుకుచున్నాను (34). ఆత్మ నిష్ఠుడను, సమ్యగ్దర్శన నిష్ఠుడను అగు నా ప్రవృత్తి నా కొరకై ఉండదు గదా! అయినప్పటికీ లోకకల్యాణ కొరకై మీరు చెప్పినట్లు చేయగలను (35).
సర్వదా భక్తులకు వశుడనై ఉండే నేను నీ మాటను గొప్ప మాటగా స్వీకరించి, ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుట కొరకై వివాహమును చేసుకొనగలను (36). కాని, నేను ఎటువంటి సుందరిని ఏ షరతులపై వివాహమాడెదనో చెప్పెదను. వినుము. ఓ బ్రహ్మా! విష్ణో! నేను యోగ్యమగు మాటను మాత్రమే చెప్పెదను (37).
ఏ స్త్రీ నా తేజస్సును వివేకముతో ధరింప సమర్థురాలగునో, అట్టి యోగశక్తి గల, ఇచ్చవచ్చిన రూపమును ధరించగల యువతిని నాకు భార్యగా స్వీకరించుటకై చూపించుడు (38). నేను యోగనిష్ఠుడనై యుండగా ఆమె కూడ యోగ నిష్ఠురాలు గావలెను. మరియు,నేను కామాసక్తుడనైనచో, ఆమె కూడా కామసక్తురాలు కావలెను (39).
వేద వేత్తలగు విద్వాంసులు ఏ శివుని జ్యోతిస్స్వరూపమగు అక్షరపరబ్రహ్మమని వర్ణించెదరో, సనాతనుడగు శివుని ధ్యానించెదరో (40), అట్టి శివుని ధ్యానించని సమయములో నేను ఆమెతో విహరించెదను హే బ్రహ్మన్! నా ధ్యానమునందు విఘ్నమును కలిగించు స్త్రీ నాచే నశింపజేయబడును (41). నీవు, విష్ణువు మరియు నేను పరబ్రహ్మ యగు శివుని అంశములము. కాన, మనము మహాత్ములము. కావున మనము ఆయనను ధ్యానించుట ఉచితము (42).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
30 Oct 2020
No comments:
Post a Comment