🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 22 🌻
157. దేవతలను పరమేశ్వరుని అంగములుగా భావిస్తేనే తత్ఫలితం కలుగుతుందని తెలుసుకోవాలి! ఈతడే దేహాలలో ఆత్మగా ఉన్నాడు. ‘భౌవనశ్చ భువనశ్చాధిపతిశ్చ’ అంటే, భువనముల యొక్క స్వరూపము అతడే; వాటి యొక్క అధిపతికూడా అతడే అని అర్థం. అతడు నియామకుడిగాకూడా ఉన్నాడు.
158. ‘యంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే’ – అనే మంత్రానికి అర్థం, “అతడే నాకు నియామకుడూ – నేను ఏం తినాలి? ఎక్కడ ఉండాలి? ఎలా బతకాలి? అనేవి నిర్ణయిస్తూ నాకు ‘నియంతగా’ ఉన్నాడు. అతడియందు తదధీనవృత్తి నాకు ఉంది.
159. నాకు అతడు ‘ధర్త’ – అంటే, నన్ను ధరించిన వాడుగా ఉన్నాడు. ఆ విధంగా నాకు పరమేశ్వరుడు ‘యంత'(నియంత)గా, ‘ధర్త'(ధరించిన వాడు)గా ఉండటంచేత, నాకు ‘క్షేమం’ కలుగుతుంది(క్షేమశ్చమే)” అని. “ఇలాంటి భావనతో ఎవరయితే ఉంటాడో, అతడిని వేదమాత రక్షిస్తుంది. అప్పుడు ఈ కర్మలన్నీ అర్థవంతమై, మంగళప్రదమవుతాయి” అన్నాడు నారదుడు.
160. “కామ్యకర్మలు వదిలిపెట్టి నీవు చేసిన కర్మలు ఎవరిని గురించి చేసావో, వాటి గతి ఎలా పరిణమిస్తుందో తెలుసుకో! సర్వదేవ నమస్కారములూ ‘కేశవం ప్రతిగఛ్ఛతి’ – అంటె కేశవుడినే చేరతాయి. అంతేకాదు, సర్వ నమస్కారములూ – ఎవరు ఎవరికి చేఇసినాకూడా – లోపలి వస్తువునకు, అంటే అందరిలోపలా ఉండే కేశవునికే చెందుతున్నాయి. అది క్షేమకరం అవుతుంది.
161. కాబట్టి ఇంద్రియలోలుడవై ఉండవద్దు. అలా ఉంటే అది మృగచేష్టతో సమానం.””అంతా అస్త్పదార్థముతో నిండిఉన్న ఈ దేహం నది అనుకోరాదు. ఈ అస్త్పదార్థములతో ఎలాగైనా, ఎప్పటికైనా వియోగం తప్పదు. ఈ అస్త్పదార్థమునందున్న మనసుని వదిలి పెట్టుకుని, శాశ్వతమయిన, సమస్త జీవకోటికీ ఆశ్రయుడైన ఆ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ ఈ లౌకిక జీవన విధానములో అన్నింటియందూ విరక్తుడివై నీవు తరించు.
162. శ్వేతద్వీపమని వైకుంఠానికిపేరు. వైకుంఠం శుద్ధసత్వగుణంచేత నిర్మితమై ఉంటుంది. శుద్ధసత్త్వగుణం అనేది భూలోకంలోని జీవుడియందుండదు. సత్త్వ గుణాధిక్యత ఉంటే ఉండవచ్చు. జీవాహంకారములో దేహాత్మభావన, దేహాభిమానము, అహము ఇవన్నీ ఉన్నప్పుడు శుద్ధసత్త్వం ఉండదు. యోగికూడా తురీయావస్థలో సత్త్వగుణాన్ని ఆశ్రయించడు. త్రిగుణములకు అతీతుడై ఉంటాడు. పైకివెళ్ళి తురీయస్థితిలో ఉంటాడేతప్ప, శుద్ధ సత్త్వగుణసంపన్నుడు కాదు.
163. అందుకనే అతనికి తపోభంగం కలిగినప్పుడు అతడు శపిస్తాడు. తన జీవలక్షణంలోని అహాన్ని చంపలేడు. త్రిగుణములను దాటలేడు. వాటిని కాసేపు విడిచి ఎక్కడికో వెళతాడంతే. కాబట్టి యోగి తురీయస్థితినుంచీ మళ్ళీ దేహాత్మభావన కొచ్చి – ఈ చైతన్యానికొచ్చి-జ్ఞానముచేత ఉద్దీప్తుడై, క్రమంగా సత్త్వగుణ ఆధిక్యతను పెంచుకుని మోక్షమార్గంలో వెళ్ళాలి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
30 Oct 2020
No comments:
Post a Comment