✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 26 - 5 . ప్రాణాయామ యజ్ఞము - ప్రణవము ప్రాణమై, ప్రాణము స్పందనమై పంచ ప్రాణములుగ నేర్పడి దేహమును నిర్వర్తించుచు నుండును. వీనిననుసరించి మరి ఐదు చిల్లర ప్రాణములు వున్నవి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి పంచప్రాణములు. ఇవి ఆధారముగనే జీవుడు దేహము నందుండును. 🍀
📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚
Part 5
తాననగ తనయందు జరుగు స్పందనమే అని తెలియును. స్పందనము నుండే అనగా తననుండే మనసు, శ్వాస రెండు ప్రవాహములుగ నేర్పడి దేహ మేర్పడినదని తెలియును. దేహము తన నివాసమేకాని, తాను కాదనియు తెలియును. నివాస పరిణామము నివసించువాని పరిణామము కన్న చాల పెద్దది.
ప్రతి జీవియు అతని శరీరమున అతని బొటన వేలంత మాత్రమే యుండును. బొటన వ్రేలికి, శరీరమునకు గల వ్యత్యాసమే నివాసమునకు, నివాసికి కూడ కలదు. తాను నివసించు దేహము తనకొక వసతియేగాని, బంధము కాదని తెలియును. వసతి గృహము నుండి బయటకు, లోనికి ఎట్లు రాకపోకలు చేయ వచ్చునో అట్లే దేహము నుండి తాను రాకపోకలు చేయవచ్చును అని తెలియును.
తాను 'హంస స్వరూపు'డని లేక 'పక్షి' యని, ద్వంద్వ శబ్దము తన రెక్కలని, తన శరీరము అస్థికలతో కూడిన పంజరమని, పంజరమున బంధింపబడి నుండనవసరము లేదని తెలియును.
పై తెలియుట లన్నియు యింకను సిద్ధించుట కాదు. ఈ తెలియుట ప్రాణాయామ యజ్ఞమున ఒక శుభ పరిణామము. దీని వలన ఒక నూతన వికాసము, నూతనమైన రుచి సాధకునకు కలిగి ప్రాణాయామ హోమమునకు మరింత ఉద్యుక్తుడు కాగలడు.
ప్రణవము ప్రాణమై, ప్రాణము స్పందనమై పంచ ప్రాణములుగ నేర్పడి దేహమును నిర్వర్తించుచు నుండును. ఈ పంచప్రాణములు ముఖ్యప్రాణములు. వీని ననుసరించి మరి ఐదు చిల్లర ప్రాణములు వున్నవి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి పంచప్రాణములు. ఇవి ఆధారముగనే జీవుడు దేహము నందుండును.
పంచప్రాణములు సరిగ దేహమునందు పనిచేయుచున్నప్పుడు జీవుడు దేహమున స్వత చెంది యుండును. వీని సామ్యమును జీవుడు తన ప్రవర్తన ద్వారా నిలుపుకొనవలెనే గాని చెదరగొట్టుకొనకూడదు.
కావుననే జీవుని ప్రవర్తనమునకు, అతని స్వస్థత లేక అస్వస్థతకు సంబంధమున్నది. ప్రాణము బలముగ నున్నచో మనసునకు బలము
కలుగును.
ప్రాణము బలముగ లేనిచో మనసు బలహీనపడి ప్రాణమును మరింత బలహీన పరచును. మనసు దుర్బలత ప్రాణమునకు సహితము హాని కలిగించ కలదని తెలియవలెను. “క్షుద్రం హృదయ దౌర్బల్యమ్" అని భగవద్గీత తెలుపుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
06 Dec 2020
No comments:
Post a Comment