రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
69. అధ్యాయము - 24
🌻. శ్రీరామునకు పరీక్ష - 4 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
శివుని యాజ్ఞచే ఈశ్వరి యగు సతి అచటకు వెళ్లి ఇట్లు తలపోసెను. వనములో సంచరించే రాముని ఏవిధముగా పరీక్షించవలెను? (45). నేను సీతారూపమును ధరించి రాముని వద్దకు వెళ్ళెదను. రాముడు విష్ణువు అయినచో, ఆయనకు అంతయూ తెలియగలదు. కానిచో తెలియదు (46).
ఇట్లు తలంచి ఆమె సీతారూపమును దాల్చి రాముని వద్దకు వెళ్లెను. మోహపరాయణయైన సతి ఈ తీరున రాముని పరీక్షించుటకు పూనుకొనెను (47). రఘురాముడు సీతా రూపములో నున్న సతిని చూచి శివానామమును జపించుచూ నవ్వి ఆ సత్యమునెరింగి నమస్కరించి ఇట్లు పలికెను (48).
రాముడిట్లు పలికెను -
సతీ! నీవు అను రాగముతో చెప్పుము. నీకు నమస్కారము. శివుడు ఎచటకు వెళ్లినాడు? నీవు భర్త తోడు లేకుండా ఒంటరిగా ఈ అడవిలోనికి ఏల వచ్చితివి?(49). ఓ సతీ! నీవు నీ రూపమును వీడి ఈ రూపము నేల ధరించితివి? ఓ దేవీ! నీవు నాయందు దయను చేసి ఇట్లు చేయుటకు గల కారణమును చెప్పుము (50).
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు సతీదేవి రాముని ఈ మాటలను విని విస్మితురాలాయెను. శివుని వచనము అమోఘమని ఆమెకు తలపునకు వచ్చి, చాల సిగ్గుపడెను (51). రాముడు విష్ణువేయని ఎరింగి, తన రూపమును మరల పొంది, మనస్సులో శివుని పాదములను స్మరించి, ప్రసన్నమైన బుద్ధిగలదై సతీదేవి ఇట్లు పలికెను (52).
స్వతంత్రుడు, పరమేశ్వరుడునగు శివ ప్రభుడు నాతో, మరియు గణములతో గూడి భూమిని పర్యటిస్తూ, ఈ అడవికి కూడా వచ్చినాడు (53). ఆయన ఇచట లక్ష్మణునితో గూడి సీతను వెదుకుటలో తత్పరుడై ఉన్నట్టియు, సీతా విరహముచే దుఃఖితమగు మనస్సు గల్గిన నిన్ను చూచినాడు (54).
ఆయన నీకు నమస్కరించి, విష్ణువు యొక్క గొప్ప మహిమను ఆనందముతో ప్రశంసించి, ఆ మర్రిచెట్టు క్రింద నిలబడి యున్నాడు (55). ఆయన ఇప్పుడు చతుర్భుజుడగు విష్ణువును చూడక పోయిననూ చూచినట్లే సంతసించెను. నీ ఈ పవిత్రమగు రూపమును చూచి, ఆయన ఆనందమును పొందినాడు (56).
శంభుని ఆ మాటలను విన్న పిదప, నాకు మనస్సులో భ్రాంతి కలిగినది . ఓ రామా! ఆయన ఆజ్ఞచే నేను నిన్ను పరీక్షించితిని (57). రామా! నీవు విష్ణువే యని నాకు తెలిసినది. నీ ప్రభుశక్తిని పూర్ణముగా నేను చూచితిని. నా సందేహము తొలగినది. ఓ మహా బుద్ధిశాలీ! అయినను, నా మాటను నీవు వినుము (58).
నీవు శివునకు నమస్కరింపదగినవాడవు ఎట్లు అగుదువు? నా ఎదుట సత్యమును పలుకుము. నా ఈ సంశయమును నివారింపుము. నాకు వెంటనే మనశ్శాంతిని కలిగించుము (59).
బ్రహ్మ ఇట్లు పలికెను -
వికసించిన పద్మముల వంటి నేత్రములు గల శ్రీరాముడు ఆమె ఈ మాటను విని, తన ప్రభువగు శంభు విస్మరించెను. ఆయనకు హృదయములో ప్రేమ ఉప్పొంగెను (60). ఓ మహర్షీ! రాముడు సతి అనుజ్ఞ లేకుండుటచే, శివుని వద్దకు వెళ్లలేదు. ఆయన మహిమను మనస్సులో భావన చేసి రాఘవుడు సతీదేవితో నిట్లనెను (61).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు సతీ ఖండలో రామ పరీక్షా వర్ణన మనే ఇరుది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
06 Dec 2020
No comments:
Post a Comment