🌹. గీతోపనిషత్తు -119 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 3
🍀. 2. సన్న్యాసము - దేనిని కోరనివాడు, ద్వేషింపనివాడు సన్న్యాసి అని తెలియుము. అతడే నిత్య సన్న్యాసి. అతనికి రాగద్వేషములు లేవు కనుక బంధము లేదు. కోరుట రాగము. తనకిది అక్కర లేదనుకొనుట ద్వేషము. తనకిది కావలె ననుకొనుట రాగము. జీవితము కర్మానుసారము సాగుచుండగ, కేవలము అందు తన కర్తవ్యమును నిర్వర్తించుచు జీవించువాడు బంధముల నుండి బయల్పడుట కవకాశమున్నది. కర్తవ్యములను నిర్వర్తించినపుడు ఫలితములు కోరుట రాగము . దృష్టి ఫలితములపై నున్నపుడు సత్ఫలితము కొరకై ప్రక్కదారులు తొక్కుట బంధము. కర్మము సత్ఫలితముల నిచ్చినపుడు వానియందు తగుల్కొనుట మరల రాగము. సన్యసించిన బుద్ధితో కర్మల నాచరించుట కర్మసన్న్యాసము. 🍀
3. జేయస్స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |
నిర్ద్వంద్వా హి మహాబాహో సుఖం బంధా త్రముచ్యతే || 3
దేనిని కోరనివాడు, ద్వేషింపనివాడు సన్న్యాసి అని తెలియుము. అతడే నిత్య సన్న్యాసి. అతనికి రాగద్వేషములు లేవు కనుక బంధము లేదు. కోరుట రాగము. తనకిది అక్కర లేదనుకొనుట ద్వేషము. తనకిది కావలె ననుకొనుట రాగము. ప్రతి జీవికిని జీవితమున కొన్ని జరగవలెనని, కొన్ని జరుగకూడదని అనిపించు చుండును. జరుగవలెనని కోరినవి జరుగుట అంతంతమాత్రమే.
అట్లే జరుగ కూడదనుకున్నవి జరుగుట లోకవిదితమే. కష్టము, నష్టము, మృత్యువు రాకూడదని; సుఖము, లాభము, జీవనము సాగవలెనని సామాన్య జీవు లందరును కోరుదురు. కాని జీవితమున నిత్య సత్యమైన చేదు నిజమొకటి తారసిల్లుచునే యుండును.
ఆరోగ్యము కోరినను అనారోగ్యము వచ్చును. లాభము కోరినను నష్టము వచ్చును. ఆయుషు కోరినను మృత్యువు వచ్చును. జీవునికి తీరని కోరిక లెప్పుడును మిగిలిపోవును. కోరని బంధములు ఎప్పుడును ఏర్పడుచుండును.
తీరని కోరికలు, వదలని బంధములు జన్మపరంపరలు కలిగించు చుండును. వీటన్నిటికిని రాగద్వేషములే కారణము. జీవితము కర్మానుసారము సాగుచుండగ, కేవలము అందు తన కర్తవ్యమును నిర్వర్తించుచు జీవించువాడు బంధముల నుండి బయల్పడుట కవకాశమున్నది. కర్తవ్యములను నిర్వర్తించినపుడు ఫలితములు కోరుట రాగము.
దృష్టి ఫలితములపై నున్నపుడు సత్ఫలితము కొరకై ప్రక్కదారులు తొక్కుట బంధము. కర్మము సత్ఫలితముల నిచ్చినపుడు వానియందు తగుల్కొనుట మరల రాగము.
కర్మలు ఫలించనపుడు కలుగునది క్రోధము, ద్వేషము. ఇట్టి ఒడుదొడుకుల జీవితములే అన్నియును. కర్తవ్యమే తనవంతని, మిగిలిన దంతయు దైవమని భావించి కాలక్రమమున తనను సమీపించు కార్యములను రాగ ద్వేషములు లేక నిర్వర్తించుట నిజమగు సన్న్యాసము.
సన్యసించిన బుద్ధితో కర్మల నాచరించుట కర్మసన్న్యాసము. అనగ రాగద్వేషముల నంటనీయక ఆసాంతము కర్తవ్యకర్మలనే నిర్వర్తించుట ఈ శ్లోకమున సూచింప బడినది. అట్లు నిర్వర్తించువారు సంసార మందున్నను సన్న్యాసియే. రాగద్వేషములకు చిక్కినవారు సన్యసించిననూ సంసారులే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Jan 2021
No comments:
Post a Comment