🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. చ్యవనమహర్షి-సుకన్య - 1 🌻
జ్ఞానం:
01. భృగుమహర్షి చ్యవనుడితో “నాయనా! ఈ సృష్టిలో చిట్టచివరికి పొందదగింది జ్ఞానమొక్కటే! ఇంకేమీ లేదు. సృష్టిలో ప్రతీజీవుడు కోరుకోదగిన ఆత్యంతిక వస్తువు ఒక్కటే ఉంది. అదే జ్ఞానం, మోక్షం. అది తప్ప ఇక కావలసింది ఏముంది ఇందులో! నీవు తపస్సుకు వెళ్ళిపో” అని ప్రేరణ చేసాడు.
02. అశ్వినీ దేవతలు వైద్యులు కాబట్టి యజ్ఞంలో వాళ్ళకు హవిర్భాగాలు లేవు. స్వాహాకారంతో అగ్నిహోత్రంలో నెయ్యివేస్తాం. ‘అగ్నయే స్వాహా అగ్నయ ఇదం న మమ’ అంటాం. అగ్నిహోత్రుడికి, ఇతర దేవతలకు హవిస్సులు ఇస్తాం. అశ్వినులకు అలా లేవు. వాళ్ళు వైద్యులు కావటమే ఇందుకు కారణం.
03. ఆర్యసంస్కృతిలో మొదటనుంచీ వైద్యుడికి, సంగీతం పాడేవాడికి, నాట్యంచేసేవాడికి-ఇలాంటివాళ్ళను అపాంక్తేయులని-బ్రాహ్మణపంక్తిలో వాళ్ళు పనికిరారు. వాళ్ళను తక్కువగా చూసేవారు. ఎందుకంటే, ఉదాహరణకు వైద్యుడు సంఘానికి ఎంతసేవచేసినా, అతడు చేసే వృత్తి ఎలాంటిదంటే; రోగంలో స్థితినిబట్టి, విచక్షణలేకుండావెళ్ళి వైద్యంచేయాలి.
04. ఏ కులమైనా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడయినా ఎండిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండి శవాకారంగా ఉండేవాడికి అయినా సరేవెళ్ళి చేయాలి. అదంతా శౌచంకాదు. శౌచవిధికాదు. అశుచికరమైనటువంటి వృత్తి అది. కాబట్టి వైద్యవృత్తిని ఉత్తమకులానికికాని, లేకపోతే బ్రాహ్మణ ధర్మానికి నిషేధంగా భావించారు.
05. ఇప్పుడు ఎంత ఉత్తమ కులస్థుడు అయితే అంతపోటీగా వెళ్ళి వైద్యవృత్తికికై ప్రయత్నంచేసే యుగంమనది! నేడు వైద్యవృత్తి అంత పవిత్రమయినది ఇంకొకటి లేదు. కాని ఆనాడు మాత్రం ‘అపవిత్రం భేషజం'(భేషజం అంటే వైద్యం). సంగీతం కూడా అటువంటిదే.
06. వీళ్ళను ‘నటవిటగాయకులు’ అనేవారు; వారందరూ అలాంటివాళ్ళే! వీళ్ళు అందరినీ వినోదింపచెయ్యాలి. రాజు కొలువులో కూడా పాడాలి. ఎవరు ధనవంతులయితే వారి ఇంటికి, పిలిస్తే వచ్చి పాడాలి. ఇక అట్టివాడికి నిత్యఆహ్నికాలెలా ఉంటాయి? వాడి వృత్తే అది. వీళ్ళందరూ (నటవిట గాయకులందరూ) కూడా వైద్యుడితో సహా తక్కువగా పరిగణించబడ్డారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
09 Jan 2021
No comments:
Post a Comment