శ్రీ శివ మహా పురాణము - 319


🌹 . శ్రీ శివ మహా పురాణము - 319 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

80. అధ్యాయము - 35

🌻. విష్ణువు పలుకులు - 2 🌻

దక్షుడిట్లు పలికెను -


హే విష్ణో! మహాప్రభో! నీ బలము చేతనే నేనీ మహాయజ్ఞము నారంభించితిని. సత్కర్మల ఫలము లభించుటలో నీవే ప్రమాణమై యున్నావు (20). హే విష్ణో! నీవు కర్మసాక్షివి. హే మహాప్రభో! నీవు వేద ప్రోక్తములైన ధర్మములకు, యజ్ఞములకు, వేదములకు కూడ రక్షకుడవు (21). హే ప్రభో! కావున నీవు ఆ ఈ యజ్ఞమును కాపాడవలెను. ఈ పనికి సమర్థుడు నీకంటె మరియొకడు లేడు. సర్వమునకు ప్రభువు నీవే గదా! (22)

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుని వచనమును విని అపుడు విష్ణువు మిక్కిలి దీనుడు, శివతత్త్వమునందు అభిరుచి లేనివాడు నగు దక్షునికి శివతత్త్వమును బోధించుచున్నవాడై ఇట్లు పలికెను (23).

విష్ణువు ఇట్లు పలికెను -

ఓయీ దక్షా! నేను నీ యజ్ఞమును రక్షించవలసిన వాడనే. ధర్మమును నేను రక్షించెదను. ఇది నా శపథము. ఇది సత్యమని అందరికీ తెలియును (24). కాన నీవు చెప్పిన ఆ మాట సత్యమే. దాని ఉల్లంఘనము ఏమి కలిగినది? ఓయీ దక్షా! నేను చెప్పెదను. నీవు వినుము. నీవు ఇపుడు నీ క్రూర బుద్ధిని వీడుము (25).

ఓ యీ దక్షా! నైమిషారణ్యములో నిమిష క్షేత్రమునందు జరిగిన అద్భుతమగు వృత్తాంతము నీకు గుర్తు లేదా? దుష్ట బుద్ధివి అగు నీవు దానిని విస్మరించితివా? (26).రుద్రుని కోపమునుండి నిన్ను రక్షించగల మొనగాడు ఇక్కడ ఎవ్వరు గలరు? ఓయీ దక్షా! నిన్ను రక్షించవలెననే ఇచ్ఛలేని వారెవ్వరు? కాని, దుర్మార్గుడు మాత్రమే నిన్ను రక్షింప బూనుకొనును (27).

ఓరీ దుష్టబుద్ధీ! ఏ పనిని చేయవలెను? దేనిని చేయకూడదు? అను వివేకము నీకు లేదు. కర్మను చేసినంత మాత్రాన అన్ని వేళలా కేవల కర్మ ఫలము నీయజాలదు (28). ఏ కర్మను చేసి మానవుడు ఉన్నతిని పొందునో అది ఆతనికి కర్తవ్య కర్మయగునని తెలియును. కర్మలకు శుభఫలములను ఇచ్చువాడు ఈశ్వరుడు తక్క మరియొకడు గాడు (29). ఎవడైతే మనస్సును శివునిపై నిలిపి శాంతముగా ఈశ్వరుని ఆరాధించునో, వానికి శివుడు కర్మాంతమునందు కర్మఫలము ననుగ్రహించును (30).

కేవల జ్ఞానమును ఆశ్రయించి, ఈశ్వర సేవించని నరులు వందకోటి కల్పముల కాలము వరకు నరకములో నుందురు (31). కేవల కర్మఠులు కర్మలు అనుపాశములచే బంధింపబడిన వారై జన్మ జన్మలయందు నరక ప్రాయమగు బ్రతుకులలో పచనము చేయబడుదురు (32).

రుద్రగణములకు అధిపతి, శత్రుసంహారకర్త, రుద్రుని కోపమనే అగ్నినుండి పుట్టినవాడు అగు వీరభద్రుడు యజ్ఞసాలవద్దకు వచ్చుచున్నాడు (33). ఈతడు మనలను నాశము చేయుటకై వచ్చినాడనుటలో సందేహము లేదు. ఎట్టి కార్యమైననూ, ఈతనికి శక్యము కానిది లేనేలేదు (34).

మహాప్రభుడగు ఈ వీరభద్రుడు మనలనందరినీ నిశ్చయముగా కాల్చి చంపి, అటు పిమ్మట ప్రసన్నమైన మనస్సు కలవాడు కాగలడనుటలో సంశయము లేదు (35). నేను మహాదేవునిపై దధీచి చేసిన శపథమును భ్రమచే ఉల్లంఘించి ఇక్కడనే ఉన్న కారణముచే నీతోబాటు దుఃఖప్రాప్తి అనివార్యమగుచున్నది (36).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Jan 2021

No comments:

Post a Comment