గీతోపనిషత్తు -128


🌹. గీతోపనిషత్తు -128 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 13


🍀. 11. మానసిక సన్న్యాసము - మనసున సన్న్యాసము స్థిరపడిన జీవుడు నవద్వారపురమగు దేహమందు సుఖముగ జీవించును. సుఖ మతని వశమున నుండును. సర్వకర్మలు అతని నుండి నిర్వర్తింపబడు చున్నను అతడు కర్త కాడు, కారణము కూడ కాడు. దైనందిన కార్యము లన్నియు తన మనసున ఆలోచనల రూపముగ వచ్చి, నిర్వర్తింపబడి పోవుచున్నవని గ్రహించువాడు నీటి బిందువులచే అంటబడని తామరాకువలె నుండును. కర్మ ఫలములను త్యజించినవాడు సన్న్యాసి. మననముతో దైవ యుక్తుడగుటచే ఇది సాధ్యపడును. 🍀

సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ II 13


మనసున సన్న్యాసము స్థిరపడిన జీవుడు నవద్వారపురమగు దేహమందు సుఖముగ జీవించును. సుఖ మతని వశమున నుండును. సర్వకర్మలు అతని నుండి నిర్వర్తింపబడు చున్నను అతడు కర్త కాడు, కారణము కూడ కాడు. సన్న్యాస మనగ ముందు శ్లోకముల యందు దైవము నిర్వచన మందించినాడు.

1. దేనిని కాంక్షింపనివాడు, ద్వేషింపని వాడు సన్న్యాసి.

2. సతతము దైవముతో మనన మార్గమున యోగయుక్తుడైనవాడు సన్న్యాసి. సన్న్యాస దీక్ష వలన యింద్రియములు నియమమున నుండగలవు. మనసు పరిశుద్ధమగును.

3. సన్న్యాసి సర్వజీవుల యందలి దైవమునే దర్శించుచుండును.

4. తన నుండి జరుగుచున్న మనో దేహేంద్రియ వ్యాపారములను

మననమున నుండి వీక్షించువాడు సన్న్యాసి.

5. దైనందిన కార్యము లన్నియు తన మనసున ఆలోచనల రూపముగ వచ్చి, నిర్వర్తింపబడి పోవుచున్నవని గ్రహించువాడు సన్న్యాసి. అట్టివాడు నీటి బిందువులచే అంటబడని తామరాకువలె నుండును.

6. 6. కర్మ ఫలములను త్యజించినవాడు సన్న్యాసి. మననముతో దైవ యుక్తుడగుటచే ఇది సాధ్యపడును.

పై ఆరు గుణములు కల జీవుని మనసున సన్న్యాసము స్థిరపడి యుండును. సుఖ మతని వశమున నుండును. అట్టివాడు దేహము నందుండుటకు ఎట్టి అసౌకర్యముండదు. నిజమున

కిట్టి సన్న్యాసియే మానవదేహ సౌలభ్యము, సౌకర్యము అనుభూతి పరముగ నెరిగి యుండును.

పై సర్వమును గృహస్థు అయినను నిర్వర్తించుకొన వచ్చును. గృహము, సంఘము, దేహము బంధములు కావు. ప్రతిబంధకములు కానే కావు. కావున సన్న్యాసమను పేర భార్యాపిల్లలను

విసర్జించుట, వృత్తి వ్యాపారములను వదలివేయుట, సంఘమున వేరుపడి వెలిగ నుండమని భగవంతుడు చెప్పలేదు.

“మనసా సన్న్యస్య" అని పలుకుటలో, మనసున సన్న్యసించిన చాలునని, భౌతిక సన్న్యాసము అవసరము కాదని తెలిపినాడు. తానట్లే ఆచరించి చూపినాడు. రాజర్షులు, మహర్షులుకూడ నట్లే ఆచరించిరని తెలిపినాడు. సంసారమధ్యమున కూడ సన్న్యాసిగ నుండవచ్చునని తెలిపినాడు.

“సన్న్యాసులందు కూడ చాలమంది సంసారులే” అని అనుచు అప్పుడప్పుడు మాస్టర్ ఇ.కె. గారు పలుకుచుండెడి వారు. మాస్టర్ ఇ.కె. గారు సంసారమందు సన్న్యాసిగ ఎట్లుండ వచ్చునో జీవించి చూపించినారు. సన్న్యాసము మానసికమే అని తెలియవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Jan 2021

No comments:

Post a Comment