దేవాపి మహర్షి బోధనలు - 7


🌹. దేవాపి మహర్షి బోధనలు - 7 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 3. గుప్తవిద్య - ప్రయోజనము - 1 🌻


జీవుల పుట్టుకవేళ ఆ జీవులపై ఆ సమయము యొక్క ముద్ర పడును. ఈ ముద్రలు క్షుద్రజంతువులలో కన్పింపవు. పాదములు గల జంతువులలో చివర వ్రేళ్ళపై పడును. మానవుల చేతి, కాలివేళ్ళ చివర ఈ ముద్రలు స్పష్టముగా కనపడును.

ఈ ముద్రలను బట్టి మానవుడు జీవితమున ఎందుకు పుట్టెనో తెలియుటయు, అతడు పుట్టిన తిథి, వారము, నక్షత్రము, గ్రహస్థితి, అతని పేరులోని ధ్వనులను గుణించి జీవిత ప్రయోజనము కనుగొనుటయు శాస్త్రకారులెరిగిన విషయము.

ఈ విధమైన సంబంధము బ్రహ్మాండ పిండాండములలో కలదని కనుగొని మానవుడు తన కర్తవ్యమును గుర్తెరుగుటకే ఈ గుప్త విద్యలు, అర్హులగు వారి చేతిలో గురు పరంపరగా వచ్చు చున్నవి. ఈ విధముగ కాలము ఒక చక్రముగా ఉపాసింపబడు చున్నది. అందలి భూత, భవిష్యత్, వర్తమానములు ఆ చక్రమున సమదూరములగు మూడు బిందువులు.

సమకోణ త్రిభుజము, వృత్తమును ఇమడ్చబడిన పైథాగరస్ చిహ్న మిదియే. దీనినే భారతీయులు ఆత్మ, బుద్ధి, మనస్సు చక్రము గను, గురుచక్రముగను, త్రిగుణాత్మక చక్రముగను బోధించిరి. భారతీయ జ్యోతిశాస్త్రమున ఈ త్రిభుజము నందలి కోణములను ప్రత్యేకముగా వివరించిరి.

జీవి పుట్టిన సమయమున ఆ ప్రదేశమున తూర్పు రేఖ వర్తమానమును, అచటనుండి మిగిలిన రెండు కోణముల భూత భవిష్యత్తులను దర్శింప చేయును. దీని మీదనే హస్త రేఖలలోని త్రిభుజ ముద్ర లాధారపడి యున్నవి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Jan 2021

No comments:

Post a Comment