రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
82. అధ్యాయము - 37
🌻. యజ్ఞ విధ్వంసము - 4 🌻
దక్షుడు శివుని నిందించిన సమయములో కనుసైగలతో ప్రోత్సహించిన భగుని నందికోపముతో నేలపై బడవేసి, అతని నేత్రములను గిల్లివేసెను(54) శివ గణనాయకులు ఆ యజ్ఞశాలయందు ఉన్న స్వాహ, స్వదా, దక్షిణా అను దేవతలను, మంత్ర తంత్రాదిష్టాన దేవతలను, ఇతరులను దురవస్థకు గురిచేసిరి(55) ఆ గణములు కోపముతో అగ్నివేదికయందు మాలిన్యమును జల్లిరి. ఆ యజ్ఞమును శివగణములు ధ్వంసము చేసిన తీరు వర్ణనాతీతముగ నుండెను(56).
వేది లోపల ఒక రంధ్రములో వీరభద్రుని భయముచే దాగియున్న బ్రహ్మపుత్రుడగు దక్షుని ఆ గణములు బలముగా బయటకు లాగి ఆ వీర భద్రుని సన్నిధిలో నిలబెట్టిరి(57)
వీరభద్రుడు అతనిని చెక్కిళ్ళయందు పట్టుకొని కత్తితో తలను కోయబోగా, యోగమహిమచే ఆతలను నరకుట సంభవము కాలేదు(58) ఆ శిరస్సును శస్త్రములచే గాని అస్త్రములచేగాని నరుకుట సర్వథా అసంభవమని భావించి, అతడు గుండెపై రెండు కాళ్లతో నిలబడి చేతితో పెరికివేసేను(59)
గణాధ్యక్షుడగు వీరభద్రుడు దుష్టుడు, శివద్రోహియగు ఆ దక్షుని ఆ శిరస్సునను అగ్ని కుండమునందు బారవైచెను(60) అపుడు వీరభద్రుడు చేతిలో త్రిశూలమును త్రిప్పుచూ ప్రకాశించెను. పర్వతాకారుడగు వీరభద్రుడు క్రోథముతో సర్వమును తగులబెట్టి ప్రళయాకాలాగ్నిని బోలియుండెను(61)
వీరభద్రుడు వారిని తేలికగా సంహరించి, తరువాత క్రోథముతో వారికి నిప్పుపెట్టి, అగ్నిహోత్రము మిడతలను వలె తగుల బెట్టెను(62) అపుడు దక్షుడు మొదలగు వారు తగులబడుటను గాంచి వీరభద్రుడు ముల్లోకములను పూరించువాడై పెద్ద అట్టహాసము చేసెను(63)
అపుడాతడు వీరశోభతో ప్రకాశించెను గణములతో కూడియున్న వీరభద్రునిపై నందన వనమునందు పుట్టిన దివ్యపుష్పములు వర్ణించెను(64) పరిమళభరితమై సుఖమును కలిగించే చల్లని గాలులు మెల్లగా వీచినవి. అదే సమయములో దేవదుందుభులు అద్భుతముగా మ్రోగినవి(65)
చీకట్లను పూర్తిగా పారద్రోలిన సూర్యుడు వలె ప్రకాశించే ఆ వీరుడు కార్యమును పూర్తిచేసుకొని శీఘ్రముమే కైలాసమునకు వెళ్ళెను(66) పరమేశ్వరుడగు శంభుడు కార్యమును పూర్తిచేసి వచ్చిన వీరభద్రుని గాంచి సంతసించిన మనస్సుగలవాడై అతనిని వీరగణములకు అధ్యక్షునిగా చేసెను(67).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్రసనంహితయందు రెండవది యగు సతీఖండలో యజ్ఞ విద్వంస వర్ణనమనే ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది(37)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
19 Jan 2021
No comments:
Post a Comment