🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శుకమహర్షి - 1 🌻
జ్ఞానం:
01. జీవుడి పరిణామం ఎలా ఉందంటే, భౌతికంనుంచీ ఆధ్యాత్మికానికి వెళ్ళటమే. అంటే, ధర్మబద్ధమైన భౌతికజీవనమునుంచీ ఆధ్యాత్మికానికి వెళ్ళటము జరుగుతున్నది. ఈ రెండిటినీ చెప్పిన వేదవ్యాసుడు ఐహిక-ఆముష్మిక మార్గములు రెండింటికీ జగద్గురువు అయ్యాడు. వేదవిజ్ఞాన్నంతా మనకు ప్రసాదించాడు.
02. శుకుడు ఆయన కుమారుడు. అతడు ఆధ్యాత్మికస్థితిలోనివాడిగా, బ్రహ్మజ్ఞానిగా పుట్టాడు. వ్యాసమహర్షికి – ఈ సర్మకాండలతోటి, వేదవాజ్ఞ్మయంతోటి నిమిత్తంలేకుండా ఉన్నటువంటి, వాటియొక్క పరిణామదశయైన స్థితిలోఉన్న శుకుడు కుమారుడిగా జన్మించాడు.
03. అంటే, అది ఆయనయొక్క పరిణామదశ. ‘ఆత్మావై పుత్రనామాసి’ అన్నట్లుగా, వ్యాసుడివిషయంలో పరమాత్మయే పుత్రనామంతో వచ్చినట్లుగా శుకుడి వృత్తాంతం సంభవించింది. తండ్రియైన వ్యాసమహర్షి ఆజ్ఞప్రకారం, జనకమహారాజుని “బ్రాహ్మణుడి కర్తవ్యం ఏమిటి? ఆయన మోక్షం ఎట్లా పొందుతాడు?” అని అడిగాడు.
04. జనకుడు ఆయనతో, “బ్రాహ్మణుడు ఊపనీతుడై, బ్రహ్మచర్యము, వేదాభ్యాసము నడిపి వివాహంచేసుకుని సంతానం పొంది, దేవపితృవిధులాచరించి, వానప్రస్థాశ్రమానికి వెళ్ళి హుతవహ ప్రయత్నముగా వ్రతపాలనచేసి, ఆ తర్వాత సన్యాసస్వీకారముచేసి బ్రహ్మాశ్రమ పదము పొంది, అనంతరం జీవన్ముక్తికి తపస్సుచేయాలి” అని చెప్పాడు.
05. శుకుడు, “కానీ జ్ఞానోదయమై ఉండగా ఆశ్రమ త్రయాన్ని క్రమంగా నడుపవలేనా? జ్ఞానియైనా ఆశ్రమములు విడువరాదని వేదములు చెబుతాయా?” అని అడిగాడు. దానికి జనకుడు, “మునీంద్రా! జ్ఞాన విజ్ఞానములు మోక్షసాధనములే! గురూపదేశంతో అవి లభించగా మోక్షం పొందినవాడు వాటిని విడిచిపెడతాడు.
06. కానీ లోకోఛ్ఛేదకము, కర్మవ్యాకులత వాటిల్లకుండా ఉండటంకోసం లోకానికతడు ఉదాహరణగా, ఆదర్శప్రాయంగా ఉండాలి. అంతేగాని, కర్మభ్రష్టుడనే భ్రాంతిలోకానికి కలగరాదు. కాబట్టే పూర్వమునులు నాలుగు ఆశ్రమాలనూ క్రమంగా నడిపించారు. కాని ప్రథమ ఆశ్రమంలోనే సుస్థిరజ్ఞానం లభించిన వాడికి మిగిలిన ఆశ్రమాలతో పనిలేదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
19 Jan 2021
No comments:
Post a Comment