గీతోపనిషత్తు -129


🌹. గీతోపనిషత్తు -129 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 14

🍀. 12. సన్న్యాసము - భగవంతుడు జీవులకు కర్తృత్వము, కర్మములను సృజింప లేదు. కర్తృత్వము, కర్మము, ఫలములందాసక్తి ఆయన స్వభావము నుండి ఏర్పడుచున్నవి. పరతత్వము కేవలము ఉండుటగ నుండును. పరతత్వము నుండి పుట్టిన కాలము, పరతత్వము నుండి ప్రకృతి శక్తిని గొని త్రిశక్తులుగ మారి కాలక్రమమున జీవుల నుద్భవింపజేయు చున్నది. రజస్తమస్సులను సమన్వయపరచి, సత్వమున సంయమము చెందుట ద్వారా జీవులు కూడ వారి వారి స్వభావములను దాటవచ్చును. అట్లు దాటినవారు తమ స్వభావముకన్న వేరుగ తమ అస్తిత్వమును గుర్తింతురు. వారు స్వభావమునకు లోబడరు. 🍀

14. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే || 14


భగవంతుడు జీవులకు కర్తృత్వము, కర్మములను సృజింప లేదు. కర్తృత్వము, కర్మము, ఫలములందాసక్తి ఆయన స్వభావము నుండి ఏర్పడుచున్నవి.

శ్రద్ధగల వారికే ఈ సున్నితము, సూక్ష్మమగు విషయము అవగాహన కాగలదు. పరతత్వము కేవలము ఉండుటగ నుండును. అతని నాధారముగ గొని అనేకానేక విషయములను ప్రకృతి నిర్మించుచున్నది. పరతత్వము నుండి పుట్టిన కాలము, ప్రకృతి సృష్టి సమస్తమును అల్లిక చేయుచు నుండును.

పరతత్వము నుండి ప్రకృతి శక్తిని గొని త్రిశక్తులుగ మారి కాలక్రమమున జీవుల నుద్భవింపజేయు చున్నది. జీవులు ప్రకృతి నుండి పుట్టినవారే అయినప్పటికి వారు వస్తుతహ పరతత్వాంశమే. అందువలన వారికిని ప్రకృతిని దాటు సౌలభ్యమున్నది. వశిష్ఠాది మహర్షులట్టివారు.

ప్రకృతి, త్రిశక్తులే త్రిగుణాత్మకముగ సృష్టిని నిర్మాణము చేయును. సప్తలోకములను త్రిగుణములతో నిర్మించును. అందు జీవులు వసింతురు.

రజస్తమస్సులను సమన్వయపరచి, సత్వమున సంయమము చెందుట ద్వారా జీవులు కూడ వారి వారి స్వభావములను దాటవచ్చును. అట్లు దాటినవారు తమ స్వభావముకన్న వేరుగ తమ అస్తిత్వమును గుర్తింతురు. వారు స్వభావమునకు లోబడరు.

కార్యములు తమ స్వభావము నిర్వర్తించు చుండగ ఉదాసీనులై అవలోకింతురు. ఇట్టి వారినే అవలోకితేశ్వరులు అందురు. వారి నుండి కార్యములు జరుగును. వారికి చేయు చున్నామను భ్రమ యుండదు.

సర్వము ప్రకృతి సంకల్పమే. ప్రకృతి దివ్యత్వమునుండి వెలువడిన సంకల్పమే అని తెలిసియుండును. తమ తమ స్వభావములు ప్రకృతి స్వభావముతో సమన్వయింప బడి కార్యములు జరుగుచుండగ, తాము వీక్షించుచు నుందురు. దైవసృష్టి కవిసృష్టి వంటిది.

కవి నుండి ఎన్నిరకముల పాత్రలు, సన్నివేశములు, వివిధములగు ఘట్టములు వ్యక్తమగు చున్నను, అందు తానొక పాత్రధారిగ నున్నను తన నుండి వెలు వడిన కథ తనను బద్దుని చేయదు.

హాస్య ఘట్టము, శోక ఘట్టము, విజయ ఘట్టము, పరాజయ ఘట్టములు, లాభనష్ట ఘట్ట ములు యిట్లెన్నియో ఘట్టములు కథ నుండి వెలువడు చున్నప్పుడు ఆ ఘట్టములు ప్రభావము కవిపై నుండవు గదా! అట్లే దైవము కూడ. జీవుడు కూడ నట్లే యుండవచ్చునని, అట్టివారే సన్న్యాసులని దైవము తెలుపుచున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


20 Jan 2021

No comments:

Post a Comment