శ్రీ శివ మహా పురాణము - 329


🌹 . శ్రీ శివ మహా పురాణము - 329 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

83. అధ్యాయము - 38

🌻. క్షువదధీచుల వివాదము - 1 🌻

సూతుడిట్లు పలికెను


మహాప్రాజ్ఞుడగు బ్రహ్మ యొక్క ఈ మాటలను ద్విజశ్రేష్టుడుగు నారదుడు విస్మితుడై ప్రేమతో నిట్లు ప్రశ్నించెను(1)

నారదుడిట్లు పలికెను

విష్ణువు శివుడు లేని దక్షుని యజ్ఞమునకు దేవతలతో గూడి వెళ్ళి, అచట పరాభవమును పొందెను. దీనికి కారణముమేమియో చెప్పుము (2) సర్వసంహారకారకుడుగు శంభుని పరాక్రముమును విష్ణువు ఎరుంగడా? మూర్ఖునివలె ఆయన శివుని గణములతో యుద్ధము నెట్టు చేసెను?(3) ఇది నాకు గల పెద్ద సందేహము ఓ దయానిధీ! నాసందేహము తొలగించుము. హే ప్రభో! మనస్సునకు ఉత్సాహమును కలిగించే శంభుని చిరితమును చెప్పుము(4)

బ్రహ్మ ఇట్లు పలికెను

ఓ ద్విజశ్రేష్టా! చంద్రశేఖరుని చరితమును ప్రీతితో వినుము. ఈ చరితము అడిగినవారికి, విన్నవారికి, సంశయముల నన్నిటినీ వారించును(5). దధీచ మహర్షి యొక్క శాపముచే పూర్వము జ్ఞాన భ్రష్టుడైన విష్ణువు దేవతలతో గూడి దక్షుని యజ్ఞమునకు వెళ్లెను. విష్ణువు క్షువునకు సహయమును చేయబోయి దధీచుని శాపమును పొందెను(6)

నారదుడిట్లు పలికెను

మహర్షిశ్రేష్ఠుడగు దధీచుడు విష్ణువును శపించుటకు కారణమేమి? ఆ క్షువునకు సహాయమును చేసిన విష్ణువు ఆయనకు కోపము కలిగే పనిని దేనిని చేసెను? (7)

బ్రహ్మ ఇట్లు పలికెను

క్షువుడను మహేతేజస్వియగు రాజు ఒకడు ఉండెడివాడు. ఆయనకు మహాప్రభుడగు దధీచ మహర్షితో మైత్రి కలిగెను(8) దీర్ఘకాల తపస్సు అను విషయములో పూర్వము క్షువ దధీచులిద్దరికీ వాదము చెలరేగెను. గొప్ప అనర్ధమును కలిగించు వా వాదము ముల్లోకములలో ప్రసిద్ది గాంచెను(9) మూడు వర్ణముల కంటె శ్రేష్టుడగు బ్రాహ్మణుడే తపస్సునందే సమర్ధుడనియు, సంశయములేదనియు శివభక్తుడు వేదవేత్తయగు దధీచుడు చెప్పెను(10) దధీచ మహర్షి యొక్క ఆ మాటను విని ధనగర్వముచే మిక్కిలి మోహితుడై యున్న క్షువ మహారాజు ఇట్లు పలికెను.

క్షువుడిట్లు పలికెను

రాజు ఎనమండుగురు లోకపాలకుల దేహమును తాను ధరించును కాన వర్ణాశ్రమములకు రక్షకుడగు రాజే శ్రేష్ఠుడు(12) రాజధర్మములను భోదించు శ్రుతి 'రాజు సర్వదేవతా స్వరూపుడు' అని చెప్పుచున్నది. కాన రాజు దేవతలలో కెల్ల గొప్పవాడు. ఓ మహర్షీ! అట్టి దేవతను నేనే(13). ఓ చవ్యవనసపుత్రా! ఇందువలన రాజు బ్రాహ్మణుని కంటె శ్రేష్ఠుడు. నీవు ఆలోచించుము. ఈ కారణముగా నన్ను అవమానించరాదు. నీవు నన్ను అన్నివిధముగా పూజించవలసియున్నది(14)

బ్రహ్మ ఇట్లు పలికెను

భృగువంశజుడగు దధీచి మహర్షకి ఆ క్షువుని వేదశాస్త్ర విరద్ధమగు ఆ అభిప్రాయమును వినిన పిదప మిక్కిలి కోపము కలిగెను. (15)

ఓ మహర్షీ! మహాతేజస్వియగు దధీచుడు కోపించినవాడై, ఆత్మగౌరవమును రక్షించుట కొరకై శిరస్సుపై ఎడమ ముష్టితో కొట్టెను(16) బ్రహ్మాండమునకు ప్రభువు, దర్బుద్ధియగు క్షువుడు దధీచుడు కొట్టుట వలన మిక్కిలి కోపించి, అతనిని వజ్రముతో చీల్చివేసి గర్జించెను(17). భృగువంశమును నిలబెట్టే ఆ దధీచుడు వజ్రముతో క్షువునిచే కొట్టబడిన వాడై నేలమీద బడి శుక్రాచార్యుని స్మరించెను(18)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


20 Jan 2021

No comments:

Post a Comment