భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 214


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 214 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. శుకమహర్షి - 2 🌻


07. సమాహితాత్ముడైన ముని ఇతరులవల్ల తనకు, తనవల్ల ఇతరులకు భయంలేనివాడు. అంటే, ‘ఈ ప్రపంచలో నాకు ఆశ కలుగుతుందేమో!’ అనిగాని, అప్సరసలు, దెవతలవలనగాని జ్ఞానికి భయముండదు. ప్రపంచంలో ధనం, ఇంకా ఏమేమో ఉన్నాయి. అవే కదా ఆపదలకు హేతువులు! వాటివల్ల తనకు ఆపదలు లేవు. అవి లోపలికి ప్రవేశించి లోకులను భ్రష్టులను చెయ్యగలుగుతాయి.

08. కాని జ్ఞాని ఇతరుల వస్తువులను ఆశించడు. “లోభి అయిన ధనవంతుడుంటాడు. వాడికికూడా జ్ఞానివలన ఆపద లేదు. ఎందుకంటే అతడేమీ ఆశించడు. ఈ ప్రకారంగా నిస్పృహుడై ఉండటంచేత అతడు జీవనుముక్తుడై వెలుగొందుతాడు. అకామవృత్తి, తపోరతి – అంటే, కోరికలేకుండా ఉండటము, తపస్సులో ఉండటము – ఈ రెండే అతడు నిరంతరం ఆచరించేవి.

09. అతడి యథార్థస్థితి ఇంటే! అతడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మదృష్టి కలిగి ఉంటాడు. మట్టి అయినా, బంగారమయినా అతడికి ఒకటే. నింద కీర్తి ఈ రెండింటినీ అతడు సమదృష్టితో చూస్తాడు. అతనిలో ఇంద్ర్యములు పూర్తిగా అణగిపోయి ఉంటాయి. ఆ దశలో అతడికి శివజ్ఞానము, శివదర్శనము కలుగుతాయి. ఈ విశేషాలన్నీ నీలో ఉన్నాయి నాయనా!” అన్నాడు జనకుడు.

10. యోగసాంఖ్యాధ్వర్య ప్రజ్ఞా విశేషాలలో దేనివల్ల పరబ్రహ్మము పొందవచ్చు అని అడిగాడు. “ఇంద్రియ నిగ్రహము, కామక్రోధ లోభ మోహాదులను పోగొట్టుకోవటము దృధవిద్య అంటే ఇది సత్యము అనే విషయము ఎప్పుడూ మరువకుండా ఉండటము ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఆ సత్యజ్ఞానము వదలకుండా ఉండటము.

11. భయంకరమైన స్థితిలో సముద్రంలో మునిగిపోతున్నా, బడబాలనంలో చిక్కుకున్నా ఆ సత్యమనే వస్తుజ్ఞానము ఎప్పుడూ లోపల వెలుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడూకూడా ఆరిపోదు. దృఢవిద్య అని దానికి పేరు. ఇలాగే ఉన్నవాడు ఏమార్గంలో ఉన్నా బ్రహ్మపదప్రాప్తి కలుగుతుంది.

12. ఏ మార్గము అంటే యోగం చేత కాని, మౌనం చేత కాని, తపస్సు చేతగాని, ప్రాణోపాసన చేతగాని, సరైనమార్గం ఏమీలేకుంటే అలా పడిఉండటంచేతకూడా – ఏ మార్గంద్వారా అయినా కాలాంతరంలో జ్ఞానం కలుగుతుంది” అని చెప్పాడు.

13. ఒకసారి నారదుని, “ఈ లోకంలో పుట్టినవాడికి హితమైనమార్గం ఉపదేశించమని అడిగాడు శుకుడు”. దానికి బదులుగా నారదుడు, “మునులు పూర్వం సనత్కుమారుణ్ణి ఈ ప్రశ్నేవేశారు. ఆ సనత్కుమారుడు మునులకు చెప్పిన సమాధానమే నేను నీకు చెపుతున్నాను. తపస్సు, సత్యము, విద్య – ఇవన్నీ పరమసుఖాన్నిచ్చేవి.

14. ఈ తపస్సు ఉండి, సత్యవ్రతముండి, విద్యకూడా సంపాదించిన నాడు ముక్తియందు కోరిక పుట్టదు సుమా” అన్నాడు. “ఈ విజ్ఞానం వచ్చిన తరువాత – వేదవేదాంగములు చదవటము, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యటము, సత్యము, శౌచము ఇవన్నీ వచ్చిన తరువాత – ఆ జన్మలో ముక్తి యందు కాంక్ష కలగకపోతే ఏ జన్మయందూ మరి ఎన్నడూ ముక్తియందు కోరికకలుగదు. ముక్తి లభించదు” అన్నాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


20 Jan 2021

No comments:

Post a Comment