దేవాపి మహర్షి బోధనలు - 8


🌹. దేవాపి మహర్షి బోధనలు - 8 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 3. గుప్తవిద్య - ప్రయోజనము - 2 🌻


ఇట్లు శాశ్వత జ్ఞానమునకు గల ఏడు గ్రంథులలో జ్యోతిశ్చక్ర విద్య, రేఖా విద్యయు ఒకటి. దీని రహస్య గ్రంథము ప్రాచీనమున ఒక మూలభాషలో నుండెడిది. అది కేవలము ఉపదేశ గమ్యమైన భాష, అనగా, గురువు కొన్ని అక్షరము లుపదేశించి కొన్ని ఆకారములు చెప్పినచో శిష్యునకు సర్వజ్ఞత వచ్చును. ఆ గ్రంథములోని విషయములు కొంత కొంత భారతీయ భాషల లోనికి, టిబెట్, ఈజిప్టు, గ్రీకు భాషలలోకి అనువదింపబడినవి. కాలక్రమమున ఇతర భాషల లోకి అనువాదమగుసరికి మూలభావము నశించినది.

వేదము, బైబిలు మొదలగు మూలగ్రంథము లందు ఈ విషయములు గోచరము కాగలవు. “ఖీరో" (Cheiro) అను ద్రష్ట విషయమున బైబిలు అనువాదకులు దురభిప్రాయబడిరి. ఏడవ అధ్యాయము, Book of John ఏడవ పద్యమున ఈ విధముగ నున్నది. “దైవము” మానవుని అరచేతుల యందు, వ్రేళ్ళయందు కొన్ని సంకేతములను గుర్తులను ఏర్పరచెను. కారణమేమన, ఆ గుర్తులను సంకేతములను అవగాహన చేసుకొని మానవుడు తన జీవన ప్రయోజనము తెలుసుకొన గలుగును.

ఈ విషయము దురవగాహన చేసుకొనుటచే అనువాదము పొరపాటుగ జరిగినది.” భారతీయ సంప్రదాయమున ఈ జ్యోతిశ్చక్రమును భగవంతుని కాలస్వరూపముగ ఆరాధించుట జరుగుచున్నది. శాస్త్రపరమైన సుదర్శనము మరుగున పడినది. సుదర్శన చక్రము విషయమున దర్శనజ్ఞానము వలసినవారు పై చెప్పబడిన సంకేతమును గురు శ్లోకము నాధారముగ చేసికొని ధ్యానము చేసినచో వారియందీ శాస్త్రము మరల ఉద్భవింపగలదు.

గురు శ్లోకము :

గురుర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః !
గురుస్సాక్షాత్పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


20 Jan 2021


No comments:

Post a Comment