గీతోపనిషత్తు -153


🌹. గీతోపనిషత్తు -153 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 5

🍀 5 - 1. ఆత్మోద్ధరణ - తనను తానే ఉద్ధరించుకొనవలెను. తనను తాను అధోగతికి చేర్చుకొనగూడదు. తనను తానుద్ధరించు కొన్నప్పుడు, తనకు తాను బంధువు. అట్లు కానిచో తనకు తానే శత్రువగును. తాను - నేను అను ప్రజ్ఞ మనయందు నాలుగు స్థితులలో యున్నది. అందు మూడు స్థితులు దివ్యము. ఒక స్థితి దివ్యమే అయినను స్వభావమున బంధింపబడి యుండును. ముందు మూడు స్థితులు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న వ్యూహము లనియు, నాలుగవది అనిరుద్ధ వ్యూహ మనియు తెలుపుదురు. మొదటి ప్రజ్ఞను 'పరమాత్మ', రెండవ ప్రజ్ఞను జీవాత్మ లేక ప్రత్యగాత్మ అందురు. మొదటి ప్రజ్ఞను వాసుదేవ ప్రజ్ఞ యని, రెండవ ప్రజ్ఞను సంకర్షణ ప్రజ్ఞయని కూడ అందురు. అట్లే మొదటి ప్రజ్ఞను నారాయణుడని, రెండవ ప్రజ్ఞను నరుడని కూడ యందురు. 🍀

ఉద్ద రేదాత్మనం 2 త్మానాం నాత్మాన మవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః || 5

తనను తానే ఉద్ధరించుకొనవలెను. తనను తాను అధోగతికి చేర్చుకొనగూడదు. తనను తానుద్ధరించు కొన్నప్పుడు, తనకు తాను బంధువు. అట్లు కానిచో తనకు తానే శత్రువగును.

తాను - నేను అను ప్రజ్ఞ మనయందు నాలుగు స్థితులలో యున్నది. అందు మూడు స్థితులు దివ్యము. ఒక స్థితి దివ్యమే అయినను స్వభావమున బంధింపబడి యుండును. ముందు మూడు స్థితులు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న వ్యూహము లనియు, నాలుగవది అనిరుద్ధ వ్యూహ మనియు తెలుపుదురు.

మొదటిది మనయందలి దైవము. ఆ ప్రజ్ఞ మనయందు త్రిగుణములను దాటి యుండును. రెండవది మనిషి తానొకడు వేరుగ నున్నాడని భావించుట.

గోధుమపిండియే చపాతీగ యున్నట్లు ఈ స్థితిని భావించవచ్చును. అనగా రెండవ స్థితి మొత్తము నుండి ప్రత్యేకముగ ఏర్పడిన స్థితి. ఇది త్రిగుణముల కీవలయుండును.

మొదటి ప్రజ్ఞ మనయందలి దైవము కాగ, రెండవ ప్రజ్ఞ “మనము” అని మనను గూర్చి మనము భావించుచున్న తెలివి, మొత్తము నుండి త్రిగుణముల ద్వారా ప్రత్యేకముగ నేర్పడినవి. అందువలన ఈ రెండవ స్థితిని “ప్రత్యగాత్మ” అని కూడ అందురు.

మొదటి ప్రజ్ఞను 'పరమాత్మ', రెండవ ప్రజ్ఞను జీవాత్మ లేక ప్రత్యగాత్మ అందురు. మొదటి ప్రజ్ఞను వాసుదేవ ప్రజ్ఞ యని, రెండవ ప్రజ్ఞను సంకర్షణ ప్రజ్ఞయని కూడ అందురు. అట్లే మొదటి ప్రజ్ఞను నారాయణుడని, రెండవ ప్రజ్ఞను నరుడని కూడ యందురు.

మొదటి ప్రజ్ఞ మంచి నీరువలె భావించినచో, రెండవ ప్రజ్ఞ అందు తేలుచున్న మంచుగడ్డ యని భావింపవచ్చును. మంచినీరే మంచుగడ్డ అయినది. పరమాత్మయే ప్రత్యగాత్మ అయినది. ఈ మార్పు త్రిగుణముల ద్వారా జరుగుట వలన జీవాత్మపై త్రిగుణముల ప్రభావముండును.

నీరే మంచుగడ్డ అయినప్పటికిని, మంచుగడ్డకు కొన్ని క్రొత్త గుణములు వచ్చును. అమితమగు శీతలత్వము, పగిలిపోవుట, గట్టిపడుట, ఎవరి పైనను విసిరినచో వారికి కొద్దిగ దెబ్బతగులుట యుండును. మంచి నీటికి లేని గుణములు మంచుగడ్డకు ఏర్పడినవి. అట్లే దైవమునకు లేని గుణములు జీవున కేర్పడినవి. ఒక నూతన స్వభావ మేర్పడును.

గుణముల సమ్మిశ్రమమును బట్టి అనేకములగు స్వభావములు గోచరించు చుండును. తన స్వభావము కన్న తాను వేరుగ బుద్ధిమంతు డగువాడు చూచుకొనవచ్చును. తాను, తన స్వభావముగ తనని తాను విడమర్చుకొన వచ్చును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


18 Feb 2021

No comments:

Post a Comment