భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 236


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 236 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. దేవలమహర్షి - 7 🌻


36. ఆ రెండు ఫలాలనూ మాత్రమే కోరినట్లయితే, మోహంలేని సంసారయాత్ర చేయవచ్చు. నిజానికి ఏ వస్తువులో మాత్రం ఏమి దోషముంది? మోహమనే దోషం మన బుద్ధిలోనే ఉంది. భార్యలోనో, సంతానంలోనో ఏమి దోషముంది?

37. మనను పీడిస్తున్నది మన బుద్ధిలోని దోషమే. అది వారి యందలి మోహమే. మనమేలా ఉండాలో అలా ఉండ గలిగితే, సంసారబంధాలు మనకు ఉపకారమే చేస్తాయి. సేవ చేస్తాయి, వెళ్ళిపోతాయి. మనం కూడా చివరకు బంధనం లేకుండా వెళ్ళిపోతాము.

38. నారదమహర్షి దేవలుదికి అనేక ధర్మాలు చెప్పాడు. “జీవుడు ఎవ్వరి వాడూ కాదు. నాది అనే వస్తువు ఏదీ ఈ ప్రపంచంలో జీవుడికి లేదు.

39. ఇతర జీవులు కాని, ఇతర పదార్థములు కాని తనవి కావు. తనకు ఏ సంబంధమూ లేదు.ఒక్కడే ఉంటాడు. తన దేహంద్వారా సుఖదుఃఖాలను తానే సృష్టించుకుంటూ, పునర్జన్మకై తానే కర్మచేసుకుంటూ ఉంటాడు.

40. అనేక పుణ్యపాప కర్మల వలన వచ్చిన ఆయా దేహములు, ఆయా కర్మలు క్షీణించటంతో నశించి, తాను బ్రహ్మమయుడై పోతున్నాడు. దానినే మోక్షం అంటారు.

41. పుణ్యపాపకర్మల వినాసనమునకు జ్ఞానమే కారణమౌతోంది. జ్ఞానమనే కుఠారంతో(గొడ్డలితో) పుణ్యపాపకర్మలచే నిర్మితమైన సంసారమనే వృక్షాన్ని ఛేదించు. ఇదే సాంఖ్యమతం.

42. పుణ్యపాప కర్మల మూలాన్ని ఛేదిస్తే, జీవుడు బ్రహ్మీభావం పొందడమనేది సహజంగా జరిగిపోతుంది. దానిని ఎవరూ ప్రత్యేకంగా కోరుకోనవసంలేదు. విజ్ఞానులు దీనిని ఇలా అర్థంచేసుకుంటున్నారూ అని నారదమహర్షి బోధించాడు.

43. మహర్షులు ఆత్మజ్ఞానులు, ఆప్తకాములు. మోక్షం పొందినవారు. శరీరం ఉన్నతరువాత ఏంచేసినా కర్మ ఏర్పడి, కర్మలోంచి ఫలంపుట్టి, దాని ఫలితంగా మరొకజన్మ ఎత్తవలసి వస్తుంది కనుక; అలా కాక, శరీరానికి తపస్సు తప్ప మరొక కర్తవ్యం ఏదీ లేకుండా వారు ఉంటారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


18 Feb 2021

No comments:

Post a Comment