శ్రీ శివ మహా పురాణము - 352


🌹 . శ్రీ శివ మహా పురాణము - 352 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

90. అధ్యాయము - 02

🌻. సనత్కుమారుని శాపము - 2 🌻

సనత్కుమారుడిట్లు పలికెను


మీరు అక్కా చెల్లెళ్ళు ముగ్గురు మూర్ఖులు. మీలో యోగ్యమగు జ్ఞానము లేదు. మీరు పితృదేవతల కుమర్తెలే అయినా, మీకు వేదతాత్పర్యము ఎరుక లేదనుట నిశ్చయము(20) మీరు గర్వముచే లేచి నిలబడలేదు. మాకు నమస్కరించలేదు. కావున, మోహితులైన మీరు మానవ శరీరమును పొంది స్వర్గమునకు దూరమగుదురు గాక!(21) జ్ఞానమునుండి వంచితులైన మీరు ముగ్గురు కూడ మానవస్త్రీలై జన్మించెదరు గాక! మీరు చేసుకొన్న కర్మయొక్క ప్రభావము వలననే మీకిట్టి ఫలము లభించుచున్నది(22)

బ్రహ్మ ఇట్లు పలికెను-

జ్ఞానమునుండి వంచితులైన వారు, మిక్కిలి భయపడినవారు, తలవంచుకున్న వారు అగు ఆ ముగ్గురు ఈ మాటలను విని, ఆయన పాదములపై బడి ఇట్లు పలికిరి(23)

పితృదేవతలు ఇట్లు పలికిరి

ఓ మహర్షీ! నీవు దయా సముద్రుడవు. నీవిపుడు ప్రసన్నుడవు కమ్ము. మూర్ఖులమగు మేము నీకు నమస్కరించకపోతిమి. దానికి కారమణము అనాదర భావన కాదు (24) హే విప్రా! మా తప్పునకు ఫలమును మేము పొందితిమి. ఓ మహర్షీ! దీనియందు నీ దోషము లేదు కాని మేము మరల స్వర్గ నివాసమును పొందునట్లు మమ్ములను అనుగ్రహించుము(25)

బ్రహ్మ ఇట్లు పలికెను

వత్సా! అపుడా మహర్షీ ఆ మాటను విని ప్రసన్నుమగు అంతఃకరణము గలవాడై, శివుని మాయచే ప్రేరేపింపబడి శాపము నుండి ఉద్ధారమును ఇట్లు చెప్పెను(26)

సనత్కుమారుడిట్లు పలికెను

పితృదేవతల ముగ్గురు కుమర్తెలారా| వినుడు మనస్సులో ప్రీతిని చెందుడు. నా మాట మీకు సర్వదా శోకములను పోగొట్టి సుఖముల నీయగలదు(27) మీలో జ్యేష్ఠురాలు విష్ణువు యొక్క అంశ##మైన హిమవత్పర్వతుని బార్యయగు గాక| వారికి పార్వతియను కన్య ఉదయించగలదు(28).

మీలో రెండవది, యోగ సంపన్నురాలు అగు ధన్య జనకునకు ప్రియురాలు కాగలదు. వారికి సీత యను పేర మహాలక్ష్మి కుమార్తె కాగలదు(29) కనిష్ఠురాలగు వృషభానుడగు వైశ్యునకు పత్ని కాగలదు. ద్వాపర యుగాంతమునందు వారికి రాధయను కుమార్తె కలుగును(30)

యోగిని యగు మేనక పార్వతి యొక్కక వరముచే భర్తతో గూడి ఆ దేహముతో పరమపదమగు కైలాసమును పొందగలదు(31) జనక వంశములో పుట్టినవాడు,జీవన్ముక్తుడు, మహాయోగి అగు సీరధ్వజుడు మరియు ఆతని పత్ని యగు ధన్య సీతాదేవితో గూడి వైకుంఠమును పొందగలరు(32).

వృషభానుని వివాహమాడిన కలావతి జీవన్ముక్తురాలై తమ కుమార్తెయగు రాధతో గూడి గోలోకమును పొందగలదనుటలో సంశయము లేదు(33). కష్టములను పడని వారికి ఎవ్వరికైననూ ఎక్కడనైనూ అభ్యున్నతి లేదు. పుణ్యమును చేయు వారికి దుఃఖము దూరముకాగానే దుర్లభమగు సుఖము లభించును(34).

పితృదేవతల కుమార్తెలగు మీరు ముగ్గురు స్వర్గము యొక్క విలాసము గలవారు. విష్ణువును దర్శించుట వలన మీకు కర్మక్షయమైనది(35) ఇట్లు పలికి తొలగిన క్రోథము గల ఆ మహర్షి జ్ఞానమును, భుక్తిని, ముక్తిని ఇచ్చే శివుని మనస్సులో స్మరించి ఇంకనూ ఇట్లు పలికెను(36)

నేను సదా సుఖమును ఇచ్చే మరియొక మాటను చెప్పెదను. ప్రీతితో వినుడు శివుని ప్రీతికి పాత్రులగు మీరు ధన్యులు, ఆదరణీయులు, మరియు అత్యంత పూజనీయులు(37) మేన యొక్క కుమార్తెయగు పార్వతీ దేవి దుష్కరమగు తపస్సును చేసి, శివుని ప్రియురాలైన జగన్మాత కాగలదు(38)

ధన్య యొక్క కుమార్తె సీతయను పేర రామునకు భార్యయై, లోకాచారముననుసరించి రామునితో గూడి విహరించగలదు(39). కలావతి యొక్క కుమార్తెయగు రాధ కృష్ణుని యందు రహస్య ప్రేమ పూర్ణమగు జీవితమమును గడిపి గోలోకమును పొంది కృష్ణపత్ని కాగలదు(40)

బ్రహ్మ ఇట్లు పలికెను-

పరమ పూజనీయుడు, సోదరుడుతో గూడి సర్వులచే స్తుతింపబడు వాడునగు, సనత్కుమార మహర్షి ఇట్లు పలికి అచటనే అంతర్థానమయ్యెను (41). వత్సా! పితృదేవతల మానస పుత్రికలగు ఆ ముగ్గురు సోదరీమణులు తొలగిన దుఃఖమనే పాపము గలవారై సుఖమును పొంది వెనువెంటనే తమ ధామమును పొందిరి(42)

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మూడవది యగు పార్వతి ఖండలో పూర్వగతి వర్ణనమనే రెండవ అధ్యాయము ముగిసినది(2)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


18 Feb 2021

No comments:

Post a Comment