17. గీతోపనిషత్తు - వ్యవసాయము - బుద్ధిని పరిపరి విధములుగ పోనీయక తెలిసిన విషయములందు నిర్దిష్టముగ నియమించి ఆచరించడమే ఆధ్యాత్మిక వ్యవసాయము
🌹. 17. గీతోపనిషత్తు - వ్యవసాయము - బుద్ధిని పరిపరి విధములుగ పోనీయక తెలిసిన విషయములందు నిర్దిష్టముగ నియమించి ఆచరించడమే ఆధ్యాత్మిక వ్యవసాయము 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 41 📚
భారతదేశమున పండితులెందరో కలరు. చాలామందికి చాలా విషయములు తెలియును. వేదాంతము మొదలుకొని నీతికథల వరకును అందరూ అన్నియూ చెప్పగలరు.
బోధకులకు, గురువులకు, మహాత్ములకు లోటులేని పుణ్యభూమి. సనాతనమైన దేవాలయములు, ఆధ్యాత్మికతను పెంపొందించు ఆశ్రమములు లెక్కకు మిక్కుటములు. అన్ని సమస్యలకూ పరిష్కారములు తెలుపగలిగిన మేధాసంపత్తి తగు మాత్రము గలదు.
41. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్ద |
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్దయో వ్యవసాయినామ్ ||
ఈ మార్గమున ఉన్నవారు స్థిరప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందనా! స్థిర ప్రయోజనము లేనివారి బుద్ధి అనేక విధములుగా నుండును.
ఇంత జ్ఞానము కలిగియున్ననూ భరతజాతి యింతటి దుస్థితి యందు వుండుటకు కారణమేమి? పేదరికము, అనాగరికత, దురాచారము యింత విజృంభణము చేయుటకు కారణమేమి? భారతదేశమున రాణించలేని భారతీయులు, విదేశములలో రాణించుటకు కారణమేమి?
ఇన్నింటికీ కారణ మొక్కటియే. మనకు చాలా విషయములు తెలియును. కాని, వాటిని ఆచరించు స్పూర్తి లేదు. అన్నమెట్లు వండుకొని తినవలెనో బాగుగ తెలిసి, వండుకొనుటకు బద్ధకించు జాడ్యము జాతిని పీడించుచున్నది. ఆచరణ శూన్యతయే కారణముగ సమస్త జ్ఞానము అక్కరకు రాకుండ యున్నది.
వ్యవసాయము తెలిసియూ చేయని రైతునకు ధాన్యమెట్లు లభింపదో, తెలిసిన విషయము లాచరించని వానికి నిష్కృతి లేదు.
బుద్ధిని పరిపరి విధములుగ పోనీయక తెలిసిన విషయములందు నిర్దిష్టముగ నియమించి ఆచరించమని గీతోపనిషత్తు నిర్దేశించుచున్నది. ఈ సూత్ర మంగీకరింపని వానికి జీవితము ఒక ఎడారి!
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
30.Aug.2020
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment